- Home
- Entertainment
- Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో నటించిన ఓ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఆ మూవీ సక్సెస్ అయినట్లు కనీసం నిర్మాతకు కూడా తెలియదు అట. ఆ విషయాన్ని సదరు నిర్మాత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో చిన్న పాత్రలు, నెగిటివ్ రోల్స్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి హుషారు, డ్యాన్స్, ఫైట్స్ చేసే ట్యాలెంట్ చూసి నిర్మాతలు అతడిని హీరోగా పెట్టుకోవడం ప్రారంభించారు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో పూర్తి స్థాయిలో హీరోగా నటించిన సినిమాల్లో కోతల రాయుడు ఒకటి. ఈ మూవీతోనే తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం వెనుక జరిగిన సంగతులని తమ్మారెడ్డి ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
హీరోగా కమల్ హాసన్, కానీ
తమ్మారెడ్డి మాట్లాడుతూ నేను నిర్మాతని కావాలని అనుకున్నప్పుడు కోతల రాయుడు కథ దొరికింది. కానీ నాకు సినిమా ఇండస్ట్రీ గురించి సరైన అనుభవం లేదు. నాకు తెలిసిన వాళ్ళని అడిగితే క్రాంతి కుమార్ గారిని అడిగి ఆయన సాయం చేస్తారు అని చెప్పారు. దానికంటే ముందు మలయాళం డ్యాన్స్ మాస్టర్ తంగప్ప అనే ఆయన నాకు తెలుసు. ఆయనకు ఈ సినిమా గురించి చెబితే హీరోగా కమల్ హాసన్ ని పెట్టుకో అని అన్నారు.
రెమ్యునరేషన్ 25 వేలు
అప్పటికే కమల్ హాసన్ గుర్తింపు ఉన్న హీరో. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు అని అడిగా. ఏముంది 25 వేలు ఇస్తే చాలు అని చెప్పారు. 25 వేలు అంటే అప్పట్లో చాలా ఎక్కువ. వద్దు సార్ నేను అంత పెట్టుకోలేను అని చెప్పా. దీనితో క్రాంతి కుమార్ గారి ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడే బయట చిరంజీవి కూర్చుని ఉన్నాడు. అప్పటికే పునాదిరాళ్ళు రిలీజ్ అయింది. నైజాం లో ఆ సినిమాని నేనే రిలీజ్ చేసి బాగా నష్టపోయాను. ఆ సినిమాలో చిరంజీవి నటించాడనే సంగతి కూడా నాకు తెలియదు.
చిరంజీవి ఎవరో తెలియదు
ఎవరు ఇతను అని అడిగాను. ఇతనే చిరంజీవి పునాదిరాళ్లు మూవీలో నటించాడు అని చెప్పారు. చూడడానికి బాగానే ఉన్నాడు అని అనుకున్నా. క్రాంతి గారితో మాట్లాడితే నేను హెల్ప్ చేస్తా నువ్ సినిమా చెయ్ అని అన్నారు. హీరోగా చిరంజీవిని పెట్టుకుందాం అని ఆయనే అన్నారు. అంతా ఓకె అయింది. ఈ మూవీలో హీరోయిన్లుగా జయసుధ, జయమాలిని లని అనుకున్నాం. జయసుధ తన పాత్ర నచ్చక రిజెక్ట్ చేసింది. జయమాలిని కూడా కొన్ని కారణాల వల్ల నటించలేదు.
సూపర్ హిట్ అని 110వ రోజు తెలిసింది
దీనితో మాధవి, మంజు భార్గవిలని తీసుకున్నాం. షూటింగ్ అంతా సవ్యంగా సాగింది. నాకు తొలి సినిమా కావడంతో పెద్దగా రిస్క్ లేకుండా తక్కువ లాభానికి అన్ని జిల్లాలలో డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశాం. క్రాంతి కుమార్ గారే అంతా చూసుకున్నారు. సినిమాని అమ్మేసి హ్యాపీగా బయటకు వచ్చేశా. ఆ తర్వాత సినిమా రిజల్ట్ ఏమైంది అనేది కూడా పట్టించుకోలేదు. సినిమా చాలా బాగా ఆడింది అని వాళ్ళు వీళ్ళు చెబుతుంటే విన్నాను అంతే. మూడు నాలుగు నెలల తర్వాత ఓ పనిమీద బెజవాడ వెళ్ళాను. ఆ ఏరియాకి కోతలరాయుడు మూవీ కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ నన్ను కలిశారు. సార్ ఈ రోజు పేపర్ చూశారా అని అడిగారు. లేదు చూడలేదు అని చెప్పాను. వెంటనే పేపర్ తెచ్చి చూపించాడు. అందులో కోతల రాయుడు విజయవంతంగా 110వ రోజు అని పెద్ద పోస్టర్ ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి మన సినిమా ఇన్ని రోజులు ఆడిందా, అంత పెద్ద హిట్ అయిందా అని తాను షాక్ కి గురైనట్లు తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఆ విధంగా చిరంజీవితో చేసిన కోతలరాయుడు మూవీ తనకు ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అని తమ్మారెడ్డి తెలిపారు.

