- Home
- Entertainment
- Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
భరత్ నటించిన పంచనామా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉంది? ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్‌లో పోలీస్ ఇన్వెస్టిగేషన్, ట్విస్టులు ఎంతవరకు ఆకట్టుకున్నాయో చూద్దాం.

Panchanama Review
ప్రేమిస్తే ఫేమ్ హీరో భరత్ అప్పుడప్పుడూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు. తాజాగా భరత్ హీరోగా నటించిన పంచనామా అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కి ప్రముఖ యాంకర్ ఉదయభాను నిర్మాత. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్ సిరీస్ ఇది. సెప్టెంబర్ 11 నుంచి జీ 5లో స్టీమింగ్ మొదలైంది. భరత్ హీరోగా నటించగా బలగం రూపా లక్ష్మీ, శివాజీ రాజా, మేథ రెడ్డి, రాధికా ప్రీతీ కీలక పాత్రల్లో నటించారు. మోహన్ శ్రీవత్స పంచనామా సిరీస్ కి దర్శకుడు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ ఆకట్టుకునే విధంగా ఉందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
సిఐ జయరాం(భరత్) తెలివైన, సిన్సియర్ పోలీస్ అధికారి. పోలీసుల నుంచి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోలేరు అని బలంగా నమ్ముతాడు. అలాంటి పోలీస్ కి సవాల్ లాంటి కేసు ఎదురవుతుంది. నగరంలో ఒకే రోజు ముగ్గురు చనిపోతారు. వారి ముగ్గురిని యాక్సిడెంటల్ డెత్స్ అని మొదట భావిస్తారు. చనిపోయిన వారిలో భరత్ తమ్ముడు ఆది కూడా ఉంటాడు. అతడు సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటాడు. హాస్టల్ లో ఉండగా అనుమానాస్పద రీతిలో మరణిస్తాడు. అతడి మరణం యాక్సిడెంటల్ గా జరిగింది అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చెప్పినప్పటికీ భరత్ కి లోపల ఏదో అనుమానం. ఇంకాస్త లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే చనిపోయిన ముగ్గురిలో ఒక కామన్ క్లూ దొరుకుతుంది. చనిపోయింది 3 కాదు నలుగురు అని తేలుతుంది. జయరాం తాను కనుగొన్న క్లూ తో ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. జయరాంకి చిన్న తనంలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ తో కథ కనెక్ట్ అయి ఉంటుంది. చివరికి ఆ నలుగురు చనిపోయింది యాక్సిడెంటల్ గా కాదు హత్య చేశారు అని జయరాం ఎలా కనుగొన్నాడు ? హత్యల వెనుక ఉన్నది ఎవరు ? అతడిచిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? అనే విషయాలు సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
మొత్తం ఆరు ఎపిసోడ్లుగా తెరకెక్కిన పంచనామా వెబ్ సిరీస్‌లో మొదటి నాలుగు ఎపిసోడ్లు ఆసక్తికరంగా సాగుతాయి. ఎలాంటి ఆధారాలు లేని మరణాలను జయరాం ఎలా అనుమానించాడు? ముగ్గురి మరణాలకు ఉన్న సంబంధం ఏంటి? ఒక్క క్లూతో కేసులోని అసలు విషయాలను అతడు ఎలా బయటకు లాగాడు? అనే అంశాలతో ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. ముఖ్యంగా ఒక్కో క్లూను జయరాం ఫాలో అవుతూ కేసును ముందుకు తీసుకెళ్లే విధానం బాగుంది.
కథ ముందుకు వెళ్లే కొద్దీ కేసు వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది ఆసక్తిని పెంచుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు మెడికల్ రంగానికి సంబంధించిన కొన్ని అంశాలను కథలోకి తీసుకురావడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మానవులపై క్లినికల్ ట్రయల్స్, డబ్బు కోసం కొందరు చేసే అక్రమాలు, వైద్యం పేరుతో జరిగే నేరాలను ఇందులో చూపించారు. వీటితో పాటు కుటుంబ బంధాలు, అన్నదమ్ముల అనుబంధం వంటి ఎమోషనల్ అంశాలను కూడా కథలో మిక్స్ చేశారు.
అయితే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లను రెగ్యులర్‌గా చూసే వారికి ఇందులోని కొన్ని విషయాలు ముందుగానే అర్థమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అసలు నేరం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనే విషయంలో పెద్దగా సర్‌ప్రైజ్ అనిపించదు. మొదటి నాలుగు ఎపిసోడ్లలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆసక్తి తర్వాత ట్విస్ట్ రివీల్ కావడంతో కాస్త తగ్గుతుంది. అసలు ట్విస్ట్ బయటపడిన తర్వాత చివరి రెండు ఎపిసోడ్లు అంత ఆసక్తికరంగా అనిపించవు. క్లైమాక్స్‌ను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే సిరీస్ ఇంపాక్ట్ మరింత పెరిగేది.
అయితే పెద్దగా సాగదీయకుండా ఆరు ఎపిసోడ్లలో కథను ముగించడం ప్లస్ పాయింట్. ముఖ్యంగా మొదటి నాలుగు ఎపిసోడ్లలో వచ్చే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, జయరాం పాత్ర ద్వారా కేసును ఛేదించే విధానం సిరీస్‌కు బలంగా నిలిచాయి. కొన్ని చోట్ల మరింత డెప్త్, బలమైన ట్విస్టులు ఉంటే పంచనామా మరింత మంచి క్రైమ్ థ్రిల్లర్‌గా నిలిచేది.
నటీనటులు:
సీఐ జయరాం పాత్రలో భరత్ అద్భుతంగా నటించాడు. ఇప్పటివరకు కనిపించిన పాత్రలతో పోలిస్తే ఈ సిరీస్‌లో పోలీస్ అధికారిగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ బాగా సెట్ అయ్యాయి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా, కేసును ఛేదించే సమయంలో చూపించే కాన్ఫిడెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు.
బలగం ఫేమ్ రూప లక్ష్మీకి ఇచ్చిన పాత్ర కూడా బాగుంది. కథలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యం మేరకు సహజంగా నటించారు. మేథ రెడ్డికి అక్కడక్కడా తన పెర్ఫార్మెన్స్ చూపించడానికి మంచి సన్నివేశాలు దక్కాయి. శివాజీ రాజా పాత్ర ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ పాత్రలో ఆయన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
టెక్నికల్‌గా:
దర్శకుడు మోహన్ శ్రీవత్స ఒక చిన్న క్లూతో మొదలైన పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ను ఆరు ఎపిసోడ్ల వరకు తీసుకెళ్లిన విధానం బాగుంది. ముఖ్యంగా మొదటి నాలుగు ఎపిసోడ్లలో కథనాన్ని ఆసక్తిగా నడిపించారు. ఒక్కో క్లూను బయటకు తీస్తూ కేసును ముందుకు తీసుకెళ్లడం ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తుంది.
అయితే కథలోని ప్రధాన ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కథనం వేగం తగ్గుతుంది. చివరి రెండు ఎపిసోడ్లను ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుని ఉంటే బాగుండేది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను మరింత కొత్తగా చూపించే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలు గతంలో చూసిన క్రైమ్ థ్రిల్లర్లను గుర్తు చేస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సాంకేతికంగా సిరీస్ ఓ మోస్తరుగా మెప్పిస్తుంది.
ఫైనల్‌గా:
పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే పంచనామా ఒకసారి చూడదగ్గ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మొదటి నాలుగు ఎపిసోడ్లలో జరిగే పోలీస్ ఇన్వెస్టిగేషన్, భరత్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి.

