IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. సంజూ వచ్చేశాడు.. భారత తుది జట్టు ఇదే
IND vs AFG: ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న తొలి టీ20కి ఆకాశ్ చోప్రా తన భారత ప్లేయింగ్ 11ను ఎంపిక చేశారు. వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టి సంజూ శాంసన్ ను ఓపెనర్‌గా ఎంచుకున్నారు. భారత జట్టుతో పాటు ఆఫ్ఘన్ టీమ్ ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి?

ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20: యువ సంచలనానికి నో ఛాన్స్.. చోప్రా ఎంచుకున్న ప్లేయింగ్ 11 ఇదే
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఈ మ్యాచ్ కోసం తన డ్రీమ్ ప్లేయింగ్ 11ను ప్రకటించారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఆయన, యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. అతనికి బదులుగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ను ఓపెనర్‌గా ఎంపిక చేయడం విశేషం.
సంజూ శాంసన్ కు ఓపెనర్‌గా అవకాశం
భారత టీ20 స్క్వాడ్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ రూపంలో నలుగురు ఓపెనింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నారు. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తుండటంతో ఓపెనింగ్ రేసు అభిషేక్, సంజూ, వైభవ్ మధ్యే నెలకొంది. ఈ క్రమంలో ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. వైభవ్ సూర్యవంశీ మరికొంత కాలం వేచి చూడక తప్పదని స్పష్టం చేశారు. సంజూ శాంసన్ బెంచ్ మీద కూర్చోబెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
"అభిషేక్ శర్మ వైఫల్యాలు ఎదుర్కొన్నప్పుడు మనం అతనికి సపోర్టుగా నిలిచాం. సంజూ శాంసన్ విషయంలో కూడా అదే వైఖరి ఉండాలి. గత సిరీస్‌లో వైభవ్ పరుగులు చేసినప్పటికీ, సంజూను జట్టు నుంచి తొలగించాల్సిన తప్పు అతనేమీ చేయలేదు. కాబట్టి అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించాలి" అని ఆకాశ్ చోప్రా అన్నారు.
బలమైన మిడిలార్డర్ బాధ్యతలు
ఈ తుది జట్టులో మిడిలార్డర్ బాధ్యతలను నమ్మకమైన బ్యాటర్లకు అప్పగించారు చోప్రా. మూడో స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో సూపర్ ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ బ్యాటింగ్‌కు వస్తారు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో తిలక్ వర్మ 99 పరుగులు సాధించగా, సెమీఫైనల్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో 116 (నాటౌట్), 51 (నాటౌట్) పరుగులతో అద్భుత ఫామ్ కనబరిచాడు.
ఇద్దరు ఆల్ రౌండర్లతో కొత్త వ్యూహం
స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు అందుబాటులో లేకపోవడంతో టీమిండియాకు ఒక మంచి అవకాశం లభించిందని చోప్రా తెలిపారు. తుది జట్టులో ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబేలకు ఒకేసారి అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. నితీష్ కుమార్ రెడ్డిని 6వ స్థానంలో, శివం దూబేను 7వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపవచ్చని చెప్పారు. ఇక 8వ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బరిలోకి దిగుతాడని తెలిపారు.
స్పెషలిస్ట్ బౌలింగ్ విభాగం
స్పెషలిస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలను ఆకాశ్ చోప్రా ఎంచుకున్నారు. స్పిన్ బాధ్యతలను అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చూసుకుంటారు. పేస్ విభాగాన్ని బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ నడిపిస్తారు. అవసరమైతే శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డిలతో పాటు అభిషేక్ శర్మ కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలరని ఆయన పేర్కొన్నారు.
ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత ప్లేయింగ్ 11:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

