యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ మరో హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నాడు. 

ఇప్పటికే అల్లూరిగా నటిస్తున్న రామ్‌చరణ్‌ లుక్‌ టీజర్‌ని ఆయన బర్త్ డేని పురస్కరించుకుని విడుదల చేశారు. ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో వచ్చిన ఈ టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఎన్టీఆర్‌ అభిమానులు సైతం కొమురం భీమ్‌ పాత్ర లుక్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ బర్త్ డేకి గిఫ్ట్ వస్తుందని భావించినా నిరాశే ఎదురైంది. ఎన్టీఆర్‌ ఎలివేట్‌ సన్నివేశాలను చిత్రీకరించకపోవడంతో టీజర్‌ విడుదల చేయలేకపోయామని రాజమౌళి తెలిపారు. 

అయితే ఈ సినిమా కరోనా వల్ల షూటింగ్‌ ఆగిపోయిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో, దసరా తర్వాత షూటింగ్‌ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్‌ ప్రారంభమైన పది రోజుల్లో ఎన్టీఆర్‌ పాత్ర టీజర్‌ని విడుదల చేసేందుకు రాజమౌళి టీమ్‌ ప్లాన్‌ చేస్తుందట. ఎన్టీఆర్‌ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్న నేపథ్యంలో జక్కన్న ఈ నిర్ణయం తీసుకున్నారని, టీజర్‌తో అభిమానులను ఖుషీ చేయడంతోపాటు సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ని తీసుకొచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. మరి కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ ఎలా ఉంటారో చూడాలి. 

ఎన్టీఆర్‌కి జోడీగా బ్రిటీష్‌ నటి ఓలీవియా మోర్రీస్‌, చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తుండగా, కీలక పాత్రల్లో అజయ్‌ దేవగన్‌, సముద్రఖని యాక్ట్ చేస్తున్నారు.  దీన్ని దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.