Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు హేమ మీద చర్యలు తీసుకుంటాం... 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన!


రేవ్ పార్టీ కేసులో నటి హేమ ఉన్నారంటూ కథనాలు వెలువడుతుండగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. 
 

movie artists association president manchu vishnu responds over hema rave party case ksr
Author
First Published May 25, 2024, 7:33 PM IST

మే 19 ఆదివారం రాత్రి బెంగుళూరులోని ఓ  ఫార్మ్ హౌస్లో రేవ్ పార్టీ జరిగింది. ఆ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో టాలీవుడ్ నటులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ప్రముఖంగా నటి హేమ పేరు వినిపించింది. బెంగుళూరు పోలీసులు నటి హేమ ఫోటో సైతం విడుదల చేశారు. 

రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్లు వస్తున్న వార్తలను హేమ ఖండించారు. ఆమె ఒక వీడియో బైట్ విడుదల చేశారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీకి నేను అటెండ్ అయ్యాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. హైదరాబాద్ లో గల ఓ ఫార్మ్ హౌస్ లో నేను చిల్ అవుతున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను. పుకార్లను నమ్మవద్దు అని, సదరు వీడియో ద్వారా వివరణ ఇచ్చింది. పోలీసులు విడుదల చేసిన ఫోటోలో వేసుకున్న డ్రెస్ లోనే హేమ వీడియో బైట్ చేసింది. ఇది అనుమానాలకు దారి తీసింది. 

రేవ్ పార్టీలో హేమ మారు పేరుతో పాల్గొన్నారని, ఆమె పేరును కృష్ణవేణిగా చెప్పారని సమాచారం. ఆమె బ్లడ్ శాంపిల్స్ లో కూడా డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నాయని. వైద్య పరీక్షలో పాజిటివ్ అని తేలిందని కథనాలు వెలువడ్డాయి. హేమకు వ్యతిరేకంగా వార్తల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. 

నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని మీడియా  సంస్థలు, వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నేరం ప్రూవ్ అయ్యే వరకు హేమను నిరపరాధిగా పరిగణించాలి. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా ఆమెపై ఆరోపణలు చేయడం సరికాదు. ఆమె ఒక భార్య, తల్లి కూడాను. నిరాధార ఆరోపణలు ఆమె గౌరవానికి భంగం కలిగిస్తాయి. 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించదు. ఒక వేళ పోలీసుల సమాచారం ఆధారంగా ఆమె తప్పు చేశారని తెలిస్తే అప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలు తీసుకుంటుంది. అప్పటి వరకు రాద్దాంతం చేయవద్దు... అని మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా ఓ నోట్ విడుదల చేశాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios