సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ నెలకొన్న వివాదం ఇప్పుడు తిరిగి తిరిగి బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం దగ్గర ఆగింది. ఇప్పటికే బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసారు కూడా. ఆమె మరికొందరు నటుల పేర్లను సైతం బయటపెట్టిందంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి కూడా. 

ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఏ సోషల్ మీడియాకు, సామాన్యులవరకే పరిమితమవలేదు. పార్లమెంటులోనూ ఇందుకు సంబంధించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రేసు గుర్రం సినిమాలో విలన్ గా నటించిన ఎంపీ రవి కిషన్ పార్లమెంటు సాక్షిగా బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగంపై మాట్లాడారు. ఇందుకు నటి జయప్రద కూడా మద్దతు తెలిపింది. 

ఇదే వ్యవహారం లో నటి కంగనా వర్సెస్ బాలీవుడ్ గా కూడా మరో యుద్ధం నడుస్తుంది. ఆమె బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగంపై గళమెత్తుతూ వై కేటగిరీ భద్రత నడుమ ముంబై లో ప్రవేశించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం విషయంలో నెలకొన్న సందిగ్ధతపై నటి నగ్మా స్పందించారు. 

"సీబీఐ, ఎన్‌సీబీ,ఈడీ దయచేసి సుశాంత్‌సింగన రాజ్ పుత్  కేసులో ఏం జరుగుతుందో బీజేపీ నాయకులకు, జయప్రద గారికి తెలియజేయండి. సుశాంత్‌ చనిపోయి ఇప్పటికే 3 నెలలు దాటింది. అందరూ సుశాంత్‌ మృతికి కారణం తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ ఫలితం శూన్యం. దీన్ని కవర్‌ చేయడానికి అన్నట్టుగా బీజేపీ నాయకులు బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం పై మాట్లాడుతున్నారు. కానీ ఇంకా కూడా దేశం సుశాంత్‌ మృతికి కారణం తెలుసుకోవడానికి వేచి చూస్తుంది" అంటూ ట్వీట్ చేసారు.