ఖమ్మం: కరోనా వైరస్‌ కట్టడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వేడుకలు, ఇతర కార్యాలను, సభలను, సమావేశాలను వాయిదా వేసుకోవాలని, వాటిని అతిక్రమిస్తే కఠినంగా స్పందిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. 

ఈ క్రమం లోనే ఖమ్మం లోని టీఎన్‌జీవోస్‌ ఫంక్షన్‌ హాలులో బుధవారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమానికి 200 మంది కన్నా ఎక్కువగా హాజరయ్యారు.అయితే దీనిపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో బుధవారం రాత్రి మున్సిపల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సిబ్బంది సీజ్‌ చేశారు. 

ఈ నెల 31 వరకు ఎలాంటి కార్యక్రమమైనా 200 మంది కన్నా తక్కువ మంది తోనే జరుపు కోవాలని, మున్ముందు జరగబోయే ఫంక్షన్‌ హాల్‌ను బుక్‌ చేయొద్దని సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరడం భయాందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ లో బుధవారం(మార్చి 18,2020) ఒక్క రోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా నుంచి వచ్చిన 11 మంది ఇస్లామిక్ మత ప్రచారకుల బృందంలో ఏడుగురికి కరోనా సోకింది.

ఒకేసారి ఏడు మందికి కరోనా సోకడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. అప్రమత్తమైన అధికారులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా కలెక్టరేట్ కు 3 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. హోటళ్లు, దుకాణాలు మూసివేశారు.