విశాఖలో ఓ నిత్య పెళ్ళికొడుకు అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఒకరుకాదు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఆగడాలను మహిళా సంఘాలు మహిళా చేతన బయట పెట్టింది. 

పెళ్లి చేసుకున్న కొద్దికాలం వారితో బాగానే ఉండి, ఆ తరువాత వారిని వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేసేవాడు. అరుణ్ కుమార్ కు గంజాయి,వ్యభిచార ముఠాలతో లింకులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. భార్యలతోనే కాకుండా మొదటి భార్య కూతుర్ని కూడా వ్యభిచార ముఠాకు అమ్మేస్తానంటూ వేధించాడు. అంతేకాదు మాట వినకపోతే చంపుతానంటూ తుపాకీ, కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భార్యలు పోలీసుల్ని ఆశ్రయించారు. 

మొదట కంచరపాలెం పోలీసులను ఆశ్రయించిన బాధితులు తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరుణ్ కుమార్ మొదటి భార్య గీతాంజలి, రెండో భార్య లక్ష్మిలను వ్యభిచారం వృత్తిలో దింపి చిత్రహింసలు పెట్టాడు. దీంతో ఈ కీచకభర్త ఆగడాలమీద గత నెలలోనే బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భర్త నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. 

అరుణ్ కుమార్ కు స్థానిక పోలీసులతో మంచిసంబంధాలున్నాయని అందుకే అతనిమీద చర్య తీసుకోవడం లేదని  బాధిత మహిళలు ఆరోపించారు. ఆ తరువాత మహిళా సంఘాలను ఆశ్రయించడంతో వారు ఈ విషయాన్ని సీపీ మనీష్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

తమకు అరుణ్ కుమార్ తో ప్రాణహాని ఉందని, వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని బాధితులు సీపీ మనీష్ కుమార్ కు వాయిస్ మెసేజ్ పెట్టారు. దీనిమీద స్పందించిన సీపీ నిందితుడిమీద తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.