పవన్ కల్యాణ్ బాటలోనే బాలశౌరి ... అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టలేదుగా!
మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. త్వరలోనే రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి సర్వే, డీపీఆర్ తయారీ చర్యలు కొనసాగుతాయని జనసేన ఎంపీ బాలశౌరి ప్రకటించారు.
మచిలీపట్నం : జనసేనాని పవన్ కల్యాణ్ బాటలోనే ప్రజా సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. ఈ క్రమంలోనే దివిసీమ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేందుకు ఆయన చేసిన కృషి ఫలించింది... మచిలీపట్నం - రేపల్లే రైల్వే లైన్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. త్వరలోనే రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి సర్వే, డీపీఆర్ తయారీ చర్యలు కొనసాగుతున్నాయని... త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని జనసేన ఎంపీ ప్రకటించారు.
ఇవాళ (మంగళవారం) మచిలీపట్నంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎంపీ బాలశౌరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మచిలీపట్నం రైల్వే లైన్ నిర్మాణంపై గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసారు. ఈ హామీని నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసానని... ఈ క్రమంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారం మరువలేనిదని అన్నారు. ఈ ప్రయత్నాలు ఫలించి మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ఎంపీ పేర్కొన్నారు. రైల్వే లైన్ కోసం త్వరలో సర్వే, డీపీఆర్ అధికారులు తయారు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
మచిలీపట్నం - రేపల్లే రైల్వే లైన్ ఎందుకంత స్పెషల్ :
మచిలీపట్నం పోర్టు కోసం ఉద్యమాలు జరిగినట్లే మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ కోసం కూడా గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయని ఎంపీ బాలశౌరి గుర్తుచేసారు. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మచిలీపట్నం ఎంపీగా వున్నసమయంలోనే బందర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కృషి చేసానని తెలిపారు. ఇప్పుడు కూడా అలాగే మచిలీపట్నం-రేపల్లే రైల్వే లైన్ కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల ఎన్నికల సమయంలో మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటుపై హామీ ఇచ్చినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ అంశాన్ని తన మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నానని అన్నారు. ఇలా మొట్టమొదట ఈ ప్రాజెక్టు గురించే హామీ ఇచ్చాను... ఇప్పుడు కూడా ఈ హామీనే మొదట నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నానని ఎంపీ వెల్లడించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ పూర్తి చేయాలన్న పట్టుదలతో వున్నాను... అందువల్లే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు డిల్లీలో తిష్టవేసుకుని కూర్చుంటున్నానని బాలశౌరి తెలిపారు. ఇప్పటికే పలుమార్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పాటు రైల్వే ఉన్నతాధికారులను కలిసి ఈ ప్రాజెక్ట్ ఆవశ్యకత గురించి వివరించినట్లు తెలిపారు. చివరకు వారిని ఒప్పించి ఈ రైల్వే పనులకు ముందడుగు పడేలా చేసానని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.
దివిసీమ ప్రజలకు ఈ రైల్వే లైన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి... అలాగే రైల్వే శాఖకు కూడా ఇది ఎంతగానో లాభసాటిగా వుంటుందని అన్నారు. అందరికీ మేలు చేసే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఎంతగానో ప్రయత్నించారు... చివరకు అవన్నీ ఫలించాయని అన్నారు. రైల్వే లైన్ పూర్తయితే ఉమ్మడి కృష్ణా జిల్లా మాత్రమే కాదు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దికి ఉపయోగపడుతుందని బాలశౌరి తెలిపారు.
మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ఎలా సాగుతుందంటే :
మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ నిర్మించాలని తొలుత ఆలోచన చేయడం జరిగిందని ఎంపీ తెలిపారు. కానీ రేపల్లె నుంచి తెనాలికి రైళ్లు వెళ్లాలి అంటే వెనక్కి వెళ్లినట్లు అవుతుందని... అందుకని మచిలీపట్నం నుంచి చల్లపల్లి, భట్టిప్రోలు, నిడుబ్రోలు, బాపట్ల వరకు ఈ రైల్వే లైన్ పొడిగించాలని రైల్వే మంత్రిని కోరడం జరిగిందన్నారు. దీని వల్ల దూరం తగ్గడంతోపాటు సమయం కూడా కలిసి వస్తుందని... ఖర్చు ఆదా అవుతుందని రైల్వే అధికారులకు తెలియజేయడంతో వారు కూడా ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నారని బాలశౌరి వివరించారు.
ఇప్పటికే నర్సాపురం నుంచి మచిలీపట్నం వరకు ఒక రైల్వే లైన్ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇక మచిలీపట్నం నుంచి బాపట్ల వరకు మరో నూతన రైల్వే లైన్ వస్తే.. ఇదంతా కలిపి కోస్టల్ రైల్వే లైన్ అవుతుందన్నారు. అంటే సముద్ర తీరంలో రైల్వే లైన్ ఏర్పాటు చేసినట్లు అవుతుంది... ఈ లైన్ ప్రయాణికుల కోసం మాత్రమే కాకుండా సరకు రవాణాకు కూడా ఎంతగానో ఉపయోగపడుందని ఎంపీ తెలిపారు.
హౌరా టు చెన్నై రైల్వే లైను చాలా ఫేమస్ ట్రంక్ లైన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ లైన్‌కు అనుసంధానం చేస్తూ మచిలీపట్నం నుంచి బాపట్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీ తెలిపారు.
మారనున్న విజయవాడ రైల్వే స్టేషన్ పరిస్థితి :
భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో విజయవాడ స్టేషన్ ఒకటి. అనేక గూడ్స్ రైళ్లు, ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆ మార్గం నుంచి వెళ్లడంతో ఇంకా రద్దీగా మారుతోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం నుంచి బాపట్ల వరకు నూతన రైల్వేమార్గం కనుక ఏర్పాటైతే విజయవాడ జంక్షన్ మీద ట్రాఫిక్ భారం తగ్గుతుంది. మచిలీపట్నం నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లే ప్రయాణికులకు 70-80 కిలోమీటర్లు దూరం తగ్గడంతోపాటు, చాలా సమయం కూడా ఆదా అవుతుంది.
ఈ రైలు మార్గం ఏర్పాటులో ఎంతగానో సహకరిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసారు ఎంపీ బాలశౌరి. ఏదైనా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలంటే ముందుగా సర్వే చేయాలి, డీపీఆర్ రూపొందించాలి. మచిలీపట్నం - బాపట్ల రైల్వే లైన్‌కి సంబంధించి ఈ రెండు పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఎంపీగా తనవంతు తప్పకుండా కృషి చేస్తానని కృష్ణా జిల్లా ప్రజలకు తెలియజేసారు ఎంపీ వల్లభనేని బాలశౌరి.
బాలశౌరి మార్క్ అభివృద్ది :
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి విద్యార్థులను బావి భాతర పౌరులుగా తీర్చిదిద్దేందుకు కూడా కృషి చేస్తున్నారు. ఇందుకోసం సిఎస్ఆర్ నిధులు రూ.38 లక్షలతో అవనిగడ్డ నియోజకవర్గం మాజేరు గ్రామంలోని జడ్పీ హైస్కూల్ కు అభివృద్ది పనులు చేయించారు. షిప్పింగ్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో డిజిటల్ లైబ్రరీ, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసారు. వీటిని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు.