తిరుమల డిక్లరేషన్ పై పవన్ కల్యాణ్ సంతకం ... ఎందుకు చేయాల్సి వచ్చిందంటే
తిరుమల డిక్లరేషన్ వివాదం పవన్ కల్యాణ్ కుటుంబం వరకు చేరింది. తాాజాగా చిన్నకూతురు పలీనా అంజనాను తిరుమలకు తీసుకెళ్లిన ఆయన డిక్లరేషన్ ఇప్పించారు.
Pawan Kalyan : ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలను కేంద్ర బిందువుగా మారింది. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డులో జంతువుల మాంసంతో కల్తీ చేసిన నెయ్యిని వాడారంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం మొదలయ్యింది. ఇది ఇక్కడితో ఆగకుండా అన్య మతస్తులు తిరుమలకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని... మాజీ సీఎం వైఎస్ జగన్ కు కూడా ఈ నిబంధన వర్తిస్తుందంటూ ఆయనను ఇరకాటంలో పెట్టే స్ధాయికి చేరింది. ఇలా ఈ డిక్లరేషన్ వ్యవహారం ఇప్పుడు తిరుమలలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అన్య మతానికి చెందిన మహిళను పెళ్లాడాడు... కాబట్టి ఆయన కూడా డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమలకు వెళ్లాలని వైసిపి నాయకులు డిమాండ్ చేసారు. ఈ క్రమంలోనే పవన్ తనకు వెంకటేశ్వర స్వామిపై వున్న భక్తిని చాటుతూనే... టిటిడి నిబంధనలను పాటిస్తూ డిక్లరేషన్ పై సంతకం చేసి వైసిపికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో వున్న పవన్ కల్యాణ్ కాలినడకన తిరుమల ఏడుకొండలపైకి చేరుకున్నారు. తండ్రితో పాటే చిన్నకూతురు పలీనా అంజన కొణిదెల కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలోనే పలీనా తల్లి అన్నా లెజినోవా అన్యమతస్తురాలు కావడంతో తిరుమల డిక్లరేషన్ తెరపైకి వచ్చింది. దీంతో వెంకటేశ్వర స్వామిపై తనకు విశ్వాసం వుందని తెలియజేస్తూ పలీనా డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది... కూతురు మైనర్ కావడంతో తండ్రి పవన్ కల్యాణ్ కూడా ఈ పత్రాలపై సంతకం చేసారు.
ఏమిటీ తిరుమల డిక్లరేషన్ :
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం వేలాదిమంది, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక పర్వదినాల సమయంలో అయితే లక్షలాదిమంది వస్తుంటారు. కేవలం ఇప్పుడే కాదు వందల సంవత్సరాలుగా తిరుమల ఆలయం వెలుగొందుతోంది. రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.
దేశానికి స్వాతంత్య్రం రాకముందే అంటే 1932 లోనే ప్రత్యేక చట్టం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ (టిటిడి) ఏర్పాటయ్యింది. బ్రిటీష్ పాలకులు ఈ బోర్డు ద్వారా తిరుమల కార్యకలాపాలు పర్యవేక్షించేవారు... మద్రాస్ ప్రభుత్వం ప్రత్యేక కమీషనర్ ను తిరుమలకు కేటాయించింది. దీంతో అప్పటివరకు కేవలం హిందువులు మాత్రమే కాకుండా ఇతర మతాలవారు కూడా తిరుమలకు రావడం ప్రారంభమయ్యింది.
అయితే స్వాతంత్య్రం అనంతరం తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో అన్యమతస్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఆంధ్ర ప్రదేశ్ చారిటబుల్ ఆండ్ హిందు రిలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్ ఎండోమెంట్ యాక్ట్ ను 1969 లో తీసుకువచ్చారు. ఇందులో సెక్షన్ 85 నుండి 91 వరకు టిటిడికి సంబంధించిన నిబంధనలు పొందుపర్చారు. ఈ చట్టాన్ని అనేకసార్లు సవరించి కొత్త నిబంధనలు చేర్చారు.
ఈ యాక్ట్ ప్రకారమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకునే అన్య మతస్తులు (హిందువులు కానివారు) స్వామివారిపై తమకు నమ్మకం వుందని రాతపూర్వకంగా రాసివ్వాలి. టిటిడి అధికారులకు ఈ పత్రం అందించి అనుమతి తీసుకోవాల్సి వుండేది. కానీ 2006 చేసిన చట్ట సవరణ ద్వారా రాతపూర్వక అనుమతి స్థానంలో డిక్లరేషన్ ను తీసుకువచ్చారు... టిటిడి నుండి ఈ డిక్లరేషన్ ఫారం తీసుకుని సంతకం చేసాకే అన్యమతస్తులు శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి వుటుంది.
తిరుమల ప్రధాన ఆలయంలోకి వెళ్లేముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఈ డిక్లరేషన్ సమర్పించాల్సి వుంటుంది. టిటిడి అధికారులు ఈ పత్రాన్ని పరిశీలించి వారికి ఆలయ ప్రవేశం కల్పిస్తారు. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు సిద్దమైన నేపథ్యంలో ఈ డిక్లరేషన్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
వైఎస్ జగన్ తిరుమల డిక్లరేషన్ ఎందుకివ్వడం లేదో తెలుసా?
మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా తిరుమల డిక్లరేషన్ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను అపవిత్రం చేసారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో వున్నవారు బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల సమయంలో తిరుమల వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాల సమర్పిస్తారు. సతీ సమేతంగా వెళ్లి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం సాంప్రదాయం... కానీ గత ఐదేళ్లలో జగన్ ఒక్కరే వెళ్లేవారు. ఇలాంటి అనేక అపచారాలు తిరుమలలో జరిగాయని... సీఎం జగన్ కు స్వామివారిపై భక్తి, విశ్వాసం లేకే ఇలా వ్యవహరించారని ప్రస్తుత సీఎం చంద్రబాబుతో సహా కూటమి నాయకులంతా ఆరోపిస్తున్నారు.
ఇక తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం తెరపైకి వచ్చాక వైఎస్ జగన్ పై విమర్శలు మరీ పెరిగాయి. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా గత వైసిపి ప్రభుత్వం వ్యవహరించిందని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళుతోంది కూటమి. ఈ క్రమంలోనే తమ హయాంలో తిరుమల పవిత్రతను ఎక్కడా దెబ్బతీయలేదని వైసిపి చెబుతోంది. ఈ క్రమంలోనే స్వామివారిపై తనకు భక్తి వుందని నిరూపించుకునేందుకు జగన్ తిరుమల ఆలయానికి వెళ్లేందుకు సిద్దమయ్యారు... దీంతో ప్రభుత్వం డిక్లరేషన్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చింది.
తిరుమల డిక్లరేషన్ ప్రస్తావన తీసుకురాగానే జగన్ వెనకడుగు వేసారు. ఎందుకంటే డిక్లరేషన్ ఇవ్వాల్సివస్తే అందులో కులం గురించి ప్రస్తావించాల్సి వుంటుంది. ఇది తన భవిష్యత్ రాజకీయాలకు ఇబ్బందికరంగా మారుతుందని భావించారో లేక మరేదైనా కారణముందో తెలీదుగానీ జగన్ మాత్రం వెనకడుగు వేసారు.
వైఎస్ జగన్ కుటుంబం క్రిస్టియన్ మతాచారాలను పాటిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ పూర్వీకులు హిందువులే... కానీ వైఎస్ ముత్తాత క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. ఆ తర్వాత ఈ కుటుంబం అదే మతంలో కొనసాగుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుండి వైఎస్ జగన్ వరకు చర్చిలో ప్రార్థనలు చేయడం, ఇంటిల్లిపాది క్రిస్మన్ వేడుకలు జరుపుకునే ఫోటోలు, వీడియోలు వున్నాయి. వైఎస్ విజయమ్మ అయితే ఎప్పుడూ బైబిల్ చేతబట్టుకుని కనిపిస్తారు.
అయితే రాజకీయ అవసరాల కోసం వైఎస్ జగన్ ఎక్కడా తాను క్రిస్టియన్ అని ప్రస్తావించడం లేదట ... పైగా హిందువును అనే భావన ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తున్నాడని కూటమి నాయకులు అంటున్నారు. అందువల్లే తిరుమలకు వెళితే ఎక్కడ డిక్లరేషన్ లో తమ మతం ప్రస్తావించాల్సి వస్తుందోనని భయపడ్డాడని... పర్యటనను విరమించుకున్నారని అంటున్నారు. ఆ తర్వాత కూడా తన మతం మానవత్వం అంటూ నాటకాలు ఆడుతున్నారే తప్ప... తాను క్రిస్టియన్ ను కానీ శ్రీవారి విశ్వసిస్తాను అని మాత్రం చెప్పడం లేదని మండిపడుతున్నారు. కేవలం రాజకీయాల కోసమే జగన్ తిరుమల వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు.
పవన్ కల్యాణ్ తిరుమల డిక్లరేషన్ తో ఇరకాటంలో జగన్
కేవలం వైఎస్ జగన్ కే నిబంధనలు వర్తిస్తాయా? ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా వర్తిస్తాయా? ఆయన అన్యమతస్తురాలిని పెళ్లాడాడు కాబట్టి తిరుమల డిక్లరేషన్ ఇస్తారా? అంటూ వైసిపి నాయకులు పవన్ కల్యాణ్, కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసారు. కానీ పవన్ తన కూతురు ఫలినా అంజనితో కలిసి తిరుమలకు వెళ్లి డిక్లరేషన్ ఇచ్చారు. కూతురు మైనర్ కాబట్టి ఆమె డిక్లరేషన్ పై పవన్ సంతకం చేసారు.
ఇలా పవన్ కన్న కూతురితో డిక్లరేషన్ ఇప్పించడం ద్వారా వైసిపికి, వైఎస్ జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓ వైపు తాను హిందువునేనని ... తన భార్య అన్నా లెజినోవా, ఆమె బిడ్డలు అన్యమతస్తులని ప్రకటించారు. తన మతాన్ని పాటిస్తూనే అన్య మతాలను గౌరవిస్తానని పవన్ చెప్పకనే చెప్పారు. మరీ మీ సంగతి ఏంటి జగన్? అనేలా పవన్ కల్యాణ్ చర్యలున్నాయి.