వరంగల్: కరోనావైరస్ అనుమానంతో వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విద్యార్థికి ఊరట లభించింది. అతనికి కరోనా వైరస్ నెగెటివ్ వచ్చింది. అతను అమెరికాలోని ఓ సదస్సుకు హాజరై తిరిగి వచ్చాడు. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో అతను ఆస్పత్రిలో చేరాడు.

అతని రక్తనమూనాలను పూణేలోని ల్యాబ్ కు పంపించగా శుక్రవారం రాత్రి పరీక్షల ఫలితాలు వచ్చాయి. దాంతో అతనికి కరోనా వైరస్ లేదని తేలింది. దీంతో అతన్ని ఆస్పత్రిని డిశ్చార్జీ చేసే అవకాశం ఉంది. అతను నిట్ స్కాలర్. జలుబు, జ్వరం రావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆయన రూమ్మేట్ కు కూడా పరీక్షలు నిర్వహించారు. 72 గంటల పాటు జరిగే మరో పరీక్షకు చెందిన నివేదిక అందాల్సి ఉంది. అది రాగానే అతన్ని ఇంటికి పంపిస్తారు.

Also Read: కరోనా భయం: ఇన్ఫోసిస్ కార్యాలయ భవనం ఖాళీ

ఇదిలావుంటే, కరోనా వైరస్ అనుమానంతో శుక్రవారం భార్యాభర్తలు ఇద్దరు శుక్రవారంనాడు ఎంజీఎం ఆస్పత్రికి వచ్చారు. గత మూడు రోజులుగా వారు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. తమ వైద్యుడు ఇచ్చిన సలహా మేరకు కరోనావైరస్ పరీక్షల నిమిత్తం వారు ఎంజిఎంకు వచ్చారు. వారిద్దరు దుబాయ్ నుంచి హన్మకొండకు వచ్చారు. 

ఇదిలావుంటే, భారత్ లో కరోనావైరస్ కారణంగా రెండో మరణం సంభవించింది. కోవిడ్ 19 బారిన పడిన 68 ఏళ్ల మహిళ ఢిల్లీలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. గత నెలలో స్విట్జర్లాండ్, ఇటలీ దేశాలకు వెళ్లి వచ్చిన కుమారుడి ద్వారా ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. 

Also Read: కరోనా వైరస్... అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్

కరోనా వైరస్ కారణంగా గురువారం తొలి మరణం సంభవించింది. కర్ణాటకలో 76 ఏళ్ల వ్యక్తి మరణించాడు. సౌదీ అరేబియా నుంచి ఫిబ్రవరి 29వ తేదీన వచ్చిన కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. భారతదేశంలో కరోనా వైరస్ మరింత విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 82కు చేరుకుంది.  ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారంనాడు ఢిల్లీ, కర్ణాటక, మహరాష్ట్రల్లో కొత్తగా 13 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తిరువనంతపురంలో తాజాగా ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.