కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు చాలా దేశాలకు పాకేసింది. భారత్ లొ తాజాగా రెండు కరోనా మరణాలు సంభవించాయి. ఇక చైనా, ఇటలీల్లో అయితే.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వేలల్లో ఉంది. కాగా... అమెరికాలో దీని ప్రాబల్యం రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని అంటు వ్యాధిగా ప్రకటించింది.

Also Read కరోనావైరస్ తో ఢిల్లీలో మహిళ మృతి: దేశంలో రెండో మరణం..

తాజాగా... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించారు.  అమెరికాలో నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆరోగ్య శాఖకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. అలాగే... రాష్ట్రాలు ఎక్కువ నిధులు ఖర్చు చేసేందుకు వీలవ్వబోతోంది. ఇందుకోసం ట్రంప్ ప్రభుత్వం రాష్ట్రాలకు 50 బిలియన్ డాలర్లు కేటాయించింది. 

కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్ ప్రకటించారు. తాజా నిధుల విడుదలతో రోగులకు ప్రత్యేక చికిత్స అందించవచ్చన్నారు. అమెరికాలో తాజాగా ఏడుగురు చనిపోవడంతో... మృతుల సంఖ్య 48కి చేరింది. కొత్తగా ఏకంగా 500కు పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో కేసుల సంఖ్య 2270కి చేరింది. 

2009లో H1N1 వైరస్ సోకినప్పుడు ఇలాగే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది అమెరికా. తాజా ప్రకటనతో... ఇప్పటివరకూ 25 బెడ్లకు మాత్రమే పరిమితమయ్యే ఆస్పత్రులు... ఇప్పుడు బెడ్ల సంఖ్య పెంచుకోవచ్చు. అలాగే... ఎలాంటి పేషెంట్లనైనా అడ్మిట్ చేసుకోవచ్చు. ఇంతకుముందులా 96 గంటల్లో డిశ్చార్జి చెయ్యాలనే రూల్ ఇప్పుడు ఉండదు.