Asianet News TeluguAsianet News Telugu

రుద్రమ దశమ వార్షిక సమావేశాలు:ఓరుగల్లు రచయిత్రుల ఐదు గ్రంథాల ఆవిష్కరణ

రుద్రమ ప్రచురణల దశమ వార్షిక సమావేశాలలో భాగంగా  ఓరుగల్లు రచయిత్రుల ఐదు గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం నిన్న వరంగల్ లో జరిగింది.  పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి

 Five Literature Books released in Warangal lns
Author
First Published Mar 19, 2024, 1:32 PM IST

హైదరాబాద్:  రుద్రమ ప్రచురణల దశమ వార్షిక సమావేశాలలో భాగంగా  ఓరుగల్లు రచయిత్రుల ఐదు గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం  వరంగల్ లో జరిగింది.  

రుద్రమ ప్రచురణల దశమ వార్షిక సమావేశాలలో భాగంగా ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాల, వరంగల్  నందు ఓరుగల్లు రచయిత్రుల ఐదు గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఐదు గ్రంథాల ఆవిష్కరణ ఐదు సమావేశాలుగా నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా అనిశెట్టి రజిత,  నిర్వాహకులుగా కొమర్రాజు రామలక్ష్మి  వ్యవహరించారు.

మొదటి సమావేశంలో చిమమండ న్గోజి అడిచె గ్రంథాన్ని ఆవిష్కరించిన 
 డా.అంపశయ్య నవీన్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మొదటి స్త్రీవాద రచయిత చలమంటూ,అన్నివిషయాలలో స్త్రీలు, పురుషులు సమానమన్న అభిప్రాయం కలగాలని, అందరూ ఇలాంటి పుస్తకాలు చదివితే స్త్రీల విషయంలో అభిప్రాయాలు మారుతాయని అన్నారు. మెట్టు రవీందర్  పుస్తకాన్ని పరిచయం చేస్తూ చిమమండ న్గోజి అడిచె నైజీరియన్  అమెరికన్ రచయిత్రి అడిచె చేసిన రచనలు గూర్చి ప్రస్తావించారు. 

రెండవ సమావేశంలో తమ్మెర రాధిక " హవేలీ దొరసాని" కథా సంపుటిని బివిఎన్ స్వామి  ఆవిష్కరించి మాట్లాడుతూ రాధిక కథలో ప్రత్యేకత కనిపిస్తుందని విభిన్న వస్తువులతో  వాస్తవిక దృక్పథం ఉంటుందని అన్నారు. పుస్తకాన్ని పరిచయం చేసిన మాలతీలత మాట్లాడుతూ రాధిక కథలలో ముగింపు వాక్యాలు బాగుంటాయని చెప్తూ ఆయా కథలను సమీక్షించారు .

మూడవ సమావేశంలో "భారతదేశంలో వితంతు వ్యవస్థ "అనే గ్రంథాన్ని ఆవిష్కరించిన తిరునగిరి దేవకీదేవి భారతదేశంలోని వితంతు దుర్భర పరిస్థితులను వివరించారు.  పుస్తక పరిచయం చేసిన తెన్నేటి విజయచంద్ర మాట్లాడుతూ స్త్రీలను దోపిడీకి గురి చేస్తే నష్టపోయేది పురుషులేనని అన్నారు. ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుందన్నగురజాడ మాటల్ని గుర్తు చేశారు.

 నాలుగో సమావేశంలో తమ్మెర రాధిక మరొక గ్రంథం 
"కాలం జాడలుతీస్తూ" కవితా సంపుటిని ఆవిష్కరించిన పొట్లపల్లి శ్రీనివాసరావు  మాట్లాడుతూ రాధిక కవిత్వంలో మానవ సంబంధాల ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.  పుస్తకాన్ని పరిచయం చేసిన చంద్రకళ మాట్లాడుతూ
కాలం అనే భావన తీరొక్కపువ్వులతో దండ అని, కాలమనేది అంతః సూత్రమని అన్నారు.

ఐదవ సమావేశంలో అనిశెట్టి రజిత " కాలం కాన్వాస్ మీద " కవితా సంపుటిని ఆవిష్కరించిన విఆర్ విద్యార్థి మాట్లాడుతూ అనిశెట్టి రజిత కాన్వాస్ పెద్దదని ఆమె కవిత్వంలోవస్తు వైవిధ్యం తాత్వికత ఉంటుందన్నారు. ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన సింగరాజు రమాదేవి రజిత కవిత్వంలో ఆచరణాత్మకత ఉంటుందని అంటూ ఆమె పుస్తకంలోని వివిధ కవితలను సమీక్షించారు. 

ఈ సమావేశంలో నాగిళ్ళ రామశాస్త్రి , డి.ధర్మయ్య ,నిధి, పల్లె శ్రీను, బి. రమాదేవి, వల్లంపట్ల నాగేశ్వరరావు, పల్లేరు వీరాస్వామి, బిల్లా మహేందర్, నేరెళ్ల శ్రీనివాస్ సౌహార్ద్ర సందేశాలు ఇచ్చారు.ఈ సమావేశాలకు బండారి సుజాత, బిట్ల అంజనీదేవి, మురాడి శ్యామల, కొలిపాక శోభారాణి, మడూరి అనిత సమన్వయకర్తలుగా వ్యవ హరించారు. కొమ్మరాజు రామలక్ష్మి ముగింపు వాక్యాలు పలికిన ఈ సమావేశాలలో కవులు, రచయితలు, సాహితివేత్తలు కళాకారులు,  విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios