అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి: బీఆర్ఎస్‌కు కడియం కౌంటర్
బీఆర్ఎస్ ను వదులుకోవడం బాధగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు.
హైదరాబాద్:బీజేపీని అడ్డుకోవడం కాంగ్రెస్ తోనే సాధ్యమని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు.మంగళవారంనాడు కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. సోమవారం నాడు బీఆర్ఎస్ నేతలు తనపై చేసిన విమర్శలపై కడియం శ్రీహరి కౌంటరిచ్చారు.కాంగ్రెస్ పిలుపు మేరకు తనతో పాటు తన కూతురు ఆ పార్టీలో చేరినట్టుగా కడియం శ్రీహరి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే పార్టీ మారినట్టుగా ఆయన తెలిపారు.ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేమన్నారు.
బీఆర్ఎస్ ను వదులుకోవడం బాధగా ఉందని కడియం శ్రీహరి చెప్పారు. ఎంత మంది బీఆర్ఎస్ ను వీడినా తనపైనే బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్న విషయాన్ని కడియం శ్రీహరి గుర్తు చేశారు.కేసీఆర్ ఎన్నో అవకాశాలిచ్చారన్నారు.మీ అహంకార మాటలే ఓటమికి కారణమని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ దుస్థితికి పల్లా రాజేశ్వర్ రెడ్డే కారణమని శ్రీహరి విమర్శించారు.
పల్లాకు దమ్ముంటే తన చరిత్ర బయటపెట్టాలని మాజీ డిప్యూటీ సీఎం సవాల్ విసిరారు. తనకు బీఆర్ఎస్ ఒక్క రూపాయి ఇచ్చినట్టు నిరూపించినా తాను పోటీ నుండి తప్పుకుంటానన్నారు.
మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని కడియం శ్రీహరి ఆరోపించారు. విపక్ష పార్టీల నేతలపై సీబీఐ, ఈడీ కేసులు బనాయిస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీలో చేరగానే అవినీతిపరులు పునీతులవుతున్నారని కడియం శ్రీహరి సెటైర్లు వేశారు.తనది గర్వం కాదు, ఆత్మాభిమానమని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ బలోపేతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు.వ్యవస్థలను అపహాస్యం చేసేలా కేంద్రం వైఖరి ఉందని కడియం శ్రీహరి విమర్శించారు.తాను అవకాశవాదిని కాదన్నారు. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయన్నారు.తనను రాజీనామా చేయాలని అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదని కడియం శ్రీహరి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి. Have your say! 📢https://telugu.asianetnews.com/mood-of-andhra-survey