తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చిక్కులను ఎదుర్కుంటోంది. టీటీడీని కరోనా మహమ్మారి కుదిపిస్తోంది. తాజాగా ఆలయ పెద్ద జియ్యంగారికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం తిరుపతిలో  స్విమ్స్ కు తరలించారు. పెద్ద జియ్యంగారికి కరోనా సోకడంతో చిన్న జియ్యంగార్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చాతుర్మాస్య దీక్ష వల్ల ఎల్లలు దాటకూడదు కాబట్టి పెద్ద జియ్యంగారి మఠాన్ని క్వారంటెన్ సెంటర్ గా మార్చే ఆలోచన చేస్తున్నారు.

ఇప్పటికే 18 మంది ఆలయ అర్చకులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. మరికొంత మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ స్థితిలో భక్తులకు శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపేసే అవకాశం ఉంది. శ్రీవారికి ఏకాంత సేవా కైంకర్యాలు నిర్వహించనున్నారు. తిరుమలలోనూ, తిరుపతిలోనూ కరోనా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దర్శనాలు ప్రారంభించిన తర్వాతనే కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని అంటున్నారు.

ఇదిలావుటే, శుక్రవారంనాడు వివరాల ప్రకారం......ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. తాజా కేసులతో మొత్తం 40,646 కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా సంభవిస్తూనే ఉన్నాయి. తాజా మరణాలతో సంఖ్య 534కు చేరుకుంది.

గత 24 గంటల్లో ఏపీలో 2602 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందినవారిలో 2592 మందికి కోరనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 8 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది.

గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా తన విశ్వరూపం ప్రదర్శించింది. ఒక్క రోజులోనే 643 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 297, చిత్తూరు జిల్లాలో 328, గుంట్ూరు జిల్లాలో 367, కడప జిల్లాలో 55, కృష్ణా జిల్లాలో 37, కర్నూలు జిల్లాలో 315 కేసులు నమోదయ్యాయి.

నెల్లూరు జిల్లాలో 127, ప్రకాశం జిల్లాలో 53, శ్రీకాకుళం జిల్లాలో 149, విశాఖపట్నం జిల్లాలో 23, విజయనగరం జిల్లాలో 89, పశ్చిమ గోదావరి జిల్లాలో 109 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు మోత్తం 2461 మందికి కరోనా వైరస్ సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 434 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 

తాజాగా గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో ఆరుగురు మరణించారు. చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురేసి మృత్యువాత పడ్డారు. గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో నలుగురేసి కరోనా వైరస్ కారణంగా మరణించారు. కడప, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. 

ఏపీలో జిల్లాలవారీగా మొత్తం కరోనా వైరస్ కేసులు, మరణాలు

అనంతపురం 4284, మరణాలు 58
చిత్తూరు 3864, మరణాలు 43
తూర్పు గోదావరి 4505, మరణాలు 34
గుంటూరు 4330, మరణాలు 39
కడప 2275, మరణాలు 21
కృష్ణా 3021, మరణాలు 86
కర్నూలు 5131, మరణాలు 116
నెల్లూరు 1717, మరణాలు 18
ప్రకాశం 1448, మరణాలు 26
శ్రీకాకుళం 1852, మరణాలు 16
విశాఖపట్నం 1716, మరణాలు 28
విజయనగరం 1071, మరణాలు 13
పశ్చిమ గోదావరి 2537, మరమాలు 36