Asianet News TeluguAsianet News Telugu

ప్రజల మొబైల్ ఫోన్ల తనిఖీ.. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌కు లీగల్ నోటీసులు

హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్‌కు (Hyderabad CP anjani kumar ) ఓ వ్యక్తి లీగల్ నోటీసులు పంపారు. డ్రగ్స్, గంజాయి కోసం తనిఖీల సమయంలో పౌరుల వాట్సాప్‌ చాట్‌లపై నిఘా పెట్టడం నిబంధనలకు విరుద్ధం అంటూ డేటా, ప్రైవసీ పరిశోధకుడు కె.శ్రీనివాస్‌ ఈ నోటీసులు పంపారు. 

Legal notice to Hyderabad CP anjani kumar
Author
Hyderabad, First Published Oct 31, 2021, 11:30 AM IST

హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్‌కు (Hyderabad CP anjani kumar ) ఓ వ్యక్తి లీగల్ నోటీసులు పంపారు. డ్రగ్స్, గంజాయి కోసం తనిఖీల సమయంలో పౌరుల వాట్సాప్‌ చాట్‌లపై నిఘా పెట్టడం నిబంధనలకు విరుద్ధం అంటూ డేటా, ప్రైవసీ పరిశోధకుడు కె.శ్రీనివాస్‌ ఈ నోటీసులు పంపారు. నగరంలోని వెస్ట్‌జోన్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ సంబంధిత తనిఖీల సమయంలో స్మార్ట్‌ఫోన్లు చూపించాలంటూ పోలీసు అధికారులు స్థానిక ప్రజలను కోరినట్లుగా వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీనిపై స్పందించిన కె.శ్రీనివాస్‌ ... సీపీకి నోటీసులు పంపారు. అక్టోబరు 27న మంగళ్‌హాట్‌, ధూల్‌పేట్‌, జుమేరాత్‌బజార్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు తక్షణమే గుర్తించాలని శ్రీనివాస్ నోటీసులో కోరారు. పాదచారులు, ద్విచక్రవాహనదారులు, ఆటో డ్రైవర్ల వంటి సాధారణ పౌరులను ఆపడానికి, మొబైల్‌ ఫోన్లను తెరవమని అభ్యర్థించడానికి పోలీసులకు అధికారాలు లేవని ఆయన గుర్తుచేశారు. సరైన కారణం లేకుండా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని శ్రీనివాస్ సదరు నోటీసులో పేర్కొన్నారు. 

కాగా.. హైదరాబాద్ పోలీసులు (hyderabad police) గంజాయిపై (ganja) ఉక్కు పాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గంజాయి సరఫరా చేసే కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు 15 మందిని హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు (hyderabad west zone police) అరెస్ట్ చేశారు. ధూల్‌పేట కేంద్రంగా ఈ గంజాయి ముఠా పనిచేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఏపీ, ఒడిశా, కర్ణాటకల నుంచి ఈ ముఠా భారీ ఎత్తున గంజాయిని తీసుకొస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న ట్రాన్స్‌పోర్టర్లను కూడా పోలీసులు గుర్తించారు. 23 మంది గంజాయి ట్రాన్స్‌పోర్టర్లను అరెస్ట్ చేశారు. ప్రధాన డీలర్ల నుంచి 60 మంది గంజాయి కొనుగోలు చేస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. వీరిలో 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి కట్టడికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. గంజాయి సేవిస్తూ రెండోసారి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని వెస్ట్‌జోన్ పోలీసులు తెలిపారు. 

Also Read:అరటి పండ్ల లోడ్‌లో 110 కిలోల గంజాయి.. ఎల్‌బీ నగర్‌లో పట్టుకున్న పోలీసులు.. విశాఖ ఏజెన్సీ నుంచి..

అంతకుముందు గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా సీలేరు నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరానికి గంజాయి (Ganja) రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 10.50 లక్షల వివులైన 70 కిలోల గంజాయిని, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరబాద్ సీపీ అంజనీ కుమార్ గురువారం మీడియాకు వెల్లడించారు. రంగారెడ్డి  జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన రమావత్ రమేష్ 12 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. అక్రమ మద్యం కేసుల్లో అతని పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. అయితే విలాసంతమైన జీవితానికి అలవాటు పడిన రమేష్.. అదే బాటలో ప్రయాణించాడు. ఈ క్రమంలోనే అతనికి అక్రమ మద్యం వ్యాపారం చేసే భరత్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత భరత్ సింగ్ బావ నర్సింగ్ సింగ్‌ అతనికి పరిచయమ్యాడు. 

రమేష్ తనకు విశాఖ జిల్లా Sileruకు చెందిన గంజాయి సరఫరా ఏజెంట్ రవితో పరిచయం ఉందని నర్సింగ్‌కు చెప్పాడు. దీంతో నర్సింగ్ అక్కడి నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు పథకం వేశాడు. సీలేరు నుంచి గంజాయి తీసుకువచ్చి తనకు అప్పగించాలని నర్సింగ్ రమేష్‌ను కోరాడు. ఇందుకోసం ప్రతి ట్రిప్‌కు రమేష్‌కు రూ. 10వేలు చెల్లించేవాడు. వీరు అక్కడ డిజిటల్ చెల్లింపులు చేసి.. అక్కడి నుంచి సరకు రవాణా చేస్తున్నారు. అలా తెచ్చిన సరుకును నగరంలో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ మూడో వారంలో నిందితుడు నర్సింగ్ గూగుల్ పే ద్వారా రూ. 50వేలు రవికి చెల్లించాడు. 70 కిలోల గంజాయిని పంపమని అడిగాడు. అదే విషయాన్ని మరో నిందితుడు రమేశ్‌కు తెలియజేశాడు. రవి వద్ద నుంచి గంజాయి తీసుకురావడానికి సీలేరుకు వెళ్లాలని చెప్పాడు. దీంతో రమేష్ అక్టోబర్ 17వ తేదీన ఆటోలో సీలేరుకు వెళ్లి 70 కిలోల గంజాయి సేకరించాడు. 21వ తేదీన హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత నర్సింగ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios