హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో ముందస్తు ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. జిహెచ్ఎంసి ఎన్నికలను ముందస్తుగా జరుపుకోవచ్చని కొందరంటుంటే, ఇంకొందరేమో చట్టప్రకారం ఇలా సంవత్సరం ముందుగానే ప్రస్తుత పాలకమండలిని రద్దు చేస్తే కొత్తగా ఎన్నికయ్యే పాలకమండలి పూర్తి కాలం ఉండలేదని అంటున్నారు. 

ఈ సందిగ్ధత నేపథ్యంలో అసలు చట్టాలు ఎం చెబుతున్నాయి, ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ఎప్పుడు ముగుస్తుంది, అసలు ఈ  జిహెచ్ఎంసి యాక్టును సవరించొచ్చా, సరవరిస్తే ఎవరు సవరించాలి వంటి అనేక అంశాలను తెలుసుకుందాం. 

జిహెచ్ఎంసి ఎన్నికలు 2016లో జరిగాయి. ఈ పాలకవర్గం పదవీ కాలం 2021తో ముగుస్తుంది. పూర్తిగా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టడానికి త్వరితగతిన మునిసిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో ఈ  జిహెచ్ఎంసి ఎన్నికలను కూడా ముందస్తుగా నిర్వహించనున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. 

రాజ్యాంగంలో స్థానిక సంస్థల ప్రత్యేక అధికారాలను, జిహెచ్ఎంసి   యాక్ట్ ప్రకారం ఇప్పటికిప్పుడు  జిహెచ్ఎంసి పాలకమండలిని రద్దుచేస్తే... నూతనంగా ఎన్నికయ్యే కౌన్సిల్ కేవలం 2021 ఫిబ్రవరి వరకే కొనసాగాలి.  అంటే 5ఏళ్ల పదవీకాలంలో మిగిలిన ఒక సంవత్సరకాలం మాత్రమే ఈ నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సేవలందిస్తుందన్నమాట. 

ఈ చట్టాన్ని రాష్ట్రప్రభుత్వం మార్చాలనుకుంటే దానికి కేంద్రం సహకారం తప్పనిసరి. చట్టాన్ని రాష్ట్రప్రభుత్వం మార్చినా, రాజ్యాంగంలోని సెక్షన్లను మాత్రం మార్వాల్సింది కేంద్రప్రభుత్వమే. ముందస్తు ఊహాగానాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో న్యాయ, చట్టపరమైన ఇబ్బందులు లేకుండా గ్రేటర్ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారో తేలాల్సి ఉంది.