సైబరాబాద్ పోలీస్ పనితీరులో కొత్త ఒరవడి...నకిలీ ఫోర్జరీ పత్రాలు, రబ్బరు స్టాంపుల ముఠా గుట్టురట్టు...
నకిలీ ఫోర్జరీ పత్రాలను, రబ్బరు స్టాంపులను తయారుచేసే అతిపెద్ద ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టుచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ : ఏ విభాగంలోనైనా తప్పులుంటాయి, లోపాలుంటాయి. కానీ తప్పులు, లోపాలు వేర్వేరు అంశాలు. ఆ లోపాలనే మనం వ్యవస్థాగత లోపాలుగా పరిగణించవచ్చు. కానీ ఆ లోపాలను సరిద్దిదే ఒక క్రమానుగత వ్యవస్థ మన దేశంలో లేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సమాజంలో శాంతి భద్రతలు, ప్రజల రక్షణ అనే బాధ్యతలను భుజాన వేసుకున్న పోలీస్ శాఖే మళ్ళీ ఈ లోపాలను పసిగట్టి ప్రజలకు, ప్రభుత్వాలకు చెప్పటమనేది.. కాలం చెల్లి శిథిలమవుతున్న వ్యవస్థ పునాదులకు విసిరే పెను సవాళ్లు.
ఈ విషయంలో సైబరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్య సైబరాబాద్ పోలీసులు పట్టుకునే కేసులు దేశంలో వ్యవస్థాగత లోపాలను వేలెత్తి చూపుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గుణపాఠాలుగా మారుతున్నాయి. ప్రజల సమాచార గోప్యత అనేది ప్రజలకు కల్పించబడిన హక్కు. అలాంటి ప్రజల వ్యక్తిగత సమాచారమనేది అంగట్లో దొరికే అరటిపండులా అమ్ముడుపోతుంది.
దళిత యువతిని ఎత్తుకెళ్లి... నడి రోడ్డుపైనే ప్రేమోన్మాది దారుణం
మనకు సంబంధించిన వ్యక్తిగత డేటా ఎక్కడో ఒక కార్పొరేట్ కంపెనీ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటుంది. మన వ్యక్తిగత సమాచారమంతా మన స్నేహితులు, బంధువుల కన్నా మన కంటికి కనబడని వ్యక్తికే ఎక్కువ తెలుస్తుంది. దీనికంతటికి కారణం మన వ్యక్తిగత డేటా మనకు తెలియకుండానే చోరీ అవుతుంది. ఒక ఫేక్ కాల్ సెంటర్ ను పట్టుకోవటం తద్వారా ఆ కాల్ సెంటర్ కి డేటా ఎలా వస్తుందని తీగ లాగితే డొంక కదిలినట్టు సైబరాబాద్ పోలీసులు మన పౌరుల డేటా ఎలా చౌర్యానికి గురవుతుందో బయటి సమాజానికి బహిర్గతపరించారు.
ఒక ముఠా అంగట్లో బహిరంగంగా డేటాను అమ్మటం ద్వారా దేశ పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత డొల్లతనాన్ని సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. ఆ వెనువెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు, ఆయా కంపెనీల ప్రతినిధులకు ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపై లేఖ రాయటం కేంద్రంలో కదలికలను తీసుకువచ్చింది. తద్వారా కేంద్ర హోం శాఖ ప్రజల వ్యక్తిగత డేటా భద్రతకు సరైన మార్గనిర్దేశకాలు ఉండాలని నిర్ణయించటం, ఈ పరిణామాల అనంతరం కేంద్ర ప్రభుత్వం డేటా ప్రొటెక్షన్ బిల్ తీసుకురావటం దేశవ్యాప్తంగా ప్రజలకు ఊరటను ఇచ్చింది.
నకిలీ ఫోర్జరీ పత్రాలను, రబ్బరు స్టాంపులను తయారుచేసే అతిపెద్ద ముఠాను ఇటీవల కాలంలో సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠా తయారుచేసే నకిలీ పత్రాలతో బ్యాంకుల్లో గృహ,వాణిజ్య రుణాలు పొందటం, బ్యాంకులను మోసం చేయటం ద్వారా అతి పెద్ద కుంభకోణం బయటపడింది. ఈ నకిలీ పత్రాలతో బ్యాంకుల ద్వారా వందల కోట్ల స్కామ్ జరిగి ఉండవచ్చని సైబరాబాద్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఎత్తిచూపింది.
బ్యాంకుల రుణాల జారీ సమయంలో పలు లేయర్ల క్షుణ్ణమైన తనిఖీ అవసరమని గుర్తించేలా చేసింది. ఆర్బీఐ వ్యవస్థ ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించేలా మార్గనిర్దేశకాలు ఉండాలని ఆర్ధిక నిపుణులు సైతం చెప్తున్నారు. నకిలీ పత్రాలతో బ్యాంకులు రుణాలు ఇవ్వటం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ భద్రత ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. విత్తనం అనేది వ్యవసాయ ఉనికికే పెను ప్రమాదం. వీటిని నిరోధించటం ప్రభుత్వాలకు సైతం పెద్ద తలనొప్పిగా మారింది. కానీ నకిలీ విత్తనమనే భూతాన్ని వేర్లతో సహా పెకిలించి వేయాలని సైబరాబాద్ పోలీసులు ప్రయత్నించారు.
దానిలో భాగంగానే వ్యవసాయ శాఖతో కలిసి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రైతులకు నకిలీ ఏదో, అసలేదో తెలుసుకునేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు రైతులకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నా ఎక్కడ కూడా ఇలాంటి అవకాశాలను వినియోగించుకోలేదు. ఏది ఏమైనా సైబరాబాద్ పోలీసుల పనితనంతో వ్యవస్థల లోపాలు బహిర్గతం అవుతున్నాయి. ఆ లోపాలతో దేశ ప్రజలను ఆందోళనలోకి నెట్టకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలు చట్టాల్లో లోపాలను సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.