దళిత యువతిని ఎత్తుకెళ్లి... నడి రోడ్డుపైనే ప్రేమోన్మాది దారుణం
ప్రేమిస్తున్నానని వెంటపడుతూ యువతిని వేధించడమే కాదు నడిరోడ్డుపై ఆమెతో అత్యంత దారుణంగా ప్రవర్తించాడో ఆకతాయి. ఈ దారుణం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

నిజామాబాద్ : నిరుపేద దళిత కుటుంబానికి చెందిన యువతిని ప్రేమపేరుతో వేధిస్తున్న ఓ ఆకతాయి అమానుషంగా వ్యవహరించాడు. వెంటపడుతున్నా యువతి ప్రేమను అంగీకరించకపోవడంతో కోపంతో రగిలిపోతూ ఉన్మాదిలా మారిపోయాడు. యువతిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తూ దారుణానికి ఒడిగట్టడంతో ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ దారుణం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
బాధిత కుటుంబం, దళిత సంఘాల కథనం ప్రకారం...నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన దళిత యువతిని కొంతకాలంగా ప్రేమపేరుతో ఓ ముస్లిం యువకుడు వేధిస్తున్నాడు. అతడి ప్రేమను అంగీకరించకపోవడంతో యువకుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి యువకుడు మద్యంమత్తులో వుండగా యువతి ఒంటరిగా కనిపించింది. దీంతో ఉన్మాదిలా మారిపోయి ఆమెను బెదిరించి బలవంతంగా బైక్ పై తీసుకెళ్లాడు.
మార్గమధ్యలో యువకుడిని ప్రతిఘటించిన యువతి తప్పించుకునేందుకు బైక్ పైనుండి దూకేసింది. దీంతో బైక్ ను నిలిపి యువతిని వెంబడించి పట్టుకుని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని అలాగే రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో గాయాలతో రోడ్డపక్కన పడివున్న యువతిని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వాళ్లు ఘటనాస్థలికి చేరుకుని యువతిని దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ తమ బిడ్డ పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారని బాధిత కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది.
Read More అప్పు చెల్లించలేదని.. దళిత మహిళను వివస్త్ర చేసి.. విచక్షణరహితంగా.. ఆపై మూత్ర విసర్జన..
యువతిపై ప్రేమోన్మాది దాడి ఘటన దళితసంఘాలు ఆందోళన చేపట్టాయి. యువతి కుటుంబసభ్యులతో కలిసి దళిత సంఘాలు నాయకులు, గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. యువతిపై దాడికి పాల్పడిన యువకున్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.