అమ్నీషియా పబ్ రేప్ కేస్.. ఇంగ్లీష్ సినిమాలు,వెబ్ సిరీస్ లు చూసి.. అందరం అనుకునే అలా చేశాం..
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా అనుకునే బాలిక మీద అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంగ్లీషు సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేరణతోనే ఇలా చేశామని చెప్పుకొచ్చారు నిందితులు.
హైదరాబాద్ : ‘పరీక్షలు పూర్తయినప్పటినుంచి ఖాళీగా ఉన్నాం. దాదాపు ప్రతిరోజూ పబ్ లకు వెళ్తున్నాం. పార్టీల్లో కలుసుకుంటున్నాం. ఆ రోజు (మే28, 2022) అమ్మీషియా పబ్బుకు వెళ్లాం. బాధిత బాలిక, మరో బాలికను పరిచయం చేసుకున్నాం. డేటింగ్ కి వెళ్దామని అడగాలని అనుకున్నాం. వాళ్లు నవ్వుతూ మాట్లాడుతుండటం, పరిచయం చేసుకునే సమయంలో అమాయకంగా కనిపించడంతో ఇద్దరిని బయటికి తీసుకువెళ్లి ఏదైనా చేద్దామనుకున్నాను. ఈ క్రమంలోనే వారి ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు అసభ్యంగా ప్రవర్తించాం. వాళ్లు బయటకు రావడంతో మేమూ వచ్చేశాం. వారిలో ఓ బాలికను నమ్మించాం. అత్యాచారం చేయాలనుకున్నాం. అందరూ అనుకునే ఇదంతా చేశాం.
ఇంగ్లీష్ సినిమాలు,వెబ్ సిరీస్ లో ఘటనలే మాకు ప్రేరణ’ అని జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు విచారణలో పోలీసు అధికారులతో చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అత్యాచార ఉదంతంపై మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించేందుకు పోలీసులు న్యాయస్థానం ఆదేశాలతో మైనర్లను విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు నోరు విప్పకపోగా మరో ఇద్దరు మాత్రం వివరాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం. ‘మైనర్ లం కాబట్టి పబ్బుల్లోకి ప్రవేశం ఉండదు. అందుకే మేజర్ అయిన స్నేహితులు పార్టీలు ఏర్పాటు చేస్తే అందులో పాల్గొని మేమే బిల్లు చెల్లిస్తాం’ అని వారు చెప్పినట్లు తెలిసింది.
వేర్వేరు ప్రాంతాలు, కాలేజీల్లో..
సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు హైదరాబాదులోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఒకరిది మాత్రం సంగారెడ్డి జిల్లా. సాదుద్దీన్ మినహా మైనర్ లంతా హైదరాబాద్ శివారులోని ఓ కార్పొరేట్ కాలేజీ, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో ఇంటర్ చదువుతున్నారు. ‘వీరందరికీ ఓ యువకుడు స్నేహితుడు అని, అతనే వీరిని పబ్బులకు, పార్టీలకు తీసుకువెడుతున్నాడని’ పోలీసుల విచారణలో తేలింది. అతడే వ్యవసాయ క్షేత్రాలు, రిసార్ట్లు, పబ్బుల్లో పార్టీలు ఏర్పాటు చేసి మైనర్ లను ఆహ్వానిస్తున్నాడు అని గుర్తించారు. పార్టీల్లో వీరంతా సిగరెట్లు తాగారని.. మద్యం తాగుతున్నారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదని తెలిసింది. ఈ కోణంలో విచారణ అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
సమాంతరంగా అభియోగ పత్రాలు..
నిందితులను విచారిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. అభియోగ పత్రాలు సమర్పించేందుకు వీలుగా.. వేగంగా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పోక్సో చట్టం ప్రకారం ప్రతి కేసులోనూ 60 రోజుల్లో అభియోగ పత్రాలు సమర్పించాలన్న నిబంధన ఉండటంతో అందులో పొందుపరచాలి అంశాలపైనా దృష్టి కేంద్రీకరించారు. కోర్టు ఆదేశాలతో ముగ్గురు మైనర్లకు ఐదు రోజులు, మరో ఇద్దరు మైనర్లకు నాలుగు రోజులు కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం కస్టడీ ముగియడంతో సాదుద్దీన్ ను కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్గుడా జైలుకు తరలించారు.