మహిళ చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి.. వీడియో వైరల్
MLC Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు.ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ మహిళను జీవన్ రెడ్డి చెంప చెల్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
MLC Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికలలో భాగంగా ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఓ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. ఆమెతో మాట్లాడుతూ.. చెల్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
అసలేం జరిగింది?
నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. ప్రచారంలో ఉన్ననని మరిచి అసభ్యకరంగా వ్యవహరించారు. తనకు నచ్చని సమాధానమిచ్చిందని ఓ మహిళ చెంప చెల్లుమనిపించారు. ఈ సంఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్, చేపూర్, పిప్రి గ్రామాలలో ప్రచారం సందర్భంగా చోటు చేసుకుంది. శుక్రవారం నాడు ప్రచారం సందర్భంగా జీవన్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి తో పాటు ఆర్మూర్ లోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి ఓ మహిళా కూలీలతో మాట్లాడారు.
అక్కడ ఉపాధి హామీ పనులు చేస్తున్న ఓ మహిళ గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటు వేశానని, కానీ తనకు పింఛన్ రావడం లేదని వాపోయింది. ఎవరికి ఓటు వేశావు అని సదరు మహిళను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మీకే వేశాను అనగానే వినయ్ రెడ్డి గెలువ లేదని, అన్యాయం జరిగిందన్నారు. ఐనప్పటికీ తనకు పింఛన్ రావడం లేదని చెబుతోంది. అప్పటికే ఆమె చెంప తడుతూ ఉన్న జీవన్‌రెడ్డి ఒక్కసారిగా ఛెళ్లుమనిపించారు. దీంతో విస్తుపోయిన ఆ మహిళ క్షణాల్లోనే తేరుకొని తనను తాను సంభాళించుకున్నది. ' పింఛన్ ఇవ్వండి సారు..' అంటూ చేతులు జోడించి వేడుకుంది. ఈ క్రమంలో 'వెళ్లి ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని అడుగు' అంటూ వినయ్‌రెడ్డి విసుగ్గా చెప్పడం వీడియోలో చూడవచ్చు.
అక్కడే ఉన్న కొంతమంది యువకులు ఈ సంఘటనను తమ సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ ఘటనతో జీవన్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఓ మహిళ అని కూడా చూడకుండా జీవన్ రెడ్డి చేయి చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను ప్రచారం ఆస్త్రంగా మార్చుకుని ప్రతిపక్ష పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.