అక్షయ తృతీయకు నగలు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే..
అక్షయ తృతీయకు బంగారంతో పాటుగా వెండి ఆభరణాలను వస్తువులను కొంటుంటారు. ఈరోజు చాలా మంచిదని బంగారం కొంటే ఇల్లు సుఖసంపదలతో వర్ధిల్లుతుందని నమ్ముతారు. అందుకే డబ్బులు లేకున్నా కూడా అప్పు తెచ్చి మరీ కొంటుంటారు. కానీ డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు మీరు బంగారం కొనాల్సిన అవసరం లేదు.
బంగారం కొనడమంటే ఆడవాళ్లకు ఎక్కడలేని ఇష్టం. అయితే ఈ బంగారం కేవలం అలంకరణకే కాకుండా.. వీటిని అత్యవసరాలకు తాకట్టు పెట్టడానికి కూడా ఉపయోగిస్తున్నారు. అందుకే బంగారం ధర రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ.. జనాలు మాత్రం బంగారాన్ని కొంటూనే ఉన్నారు.
అక్షయ తృతీయను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి వస్తుందని భావించి జనాలు బంగారాన్ని కొంటుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10 న వచ్చింది. అందుకే అన్ని స్టోర్లలో ఆఫర్లు మారుమోగుతున్నాయి. మీరు గనుక అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
హాల్ మార్క్
బంగారం ధర రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ బంగారాన్ని ఖచ్చితంగా కొంటుంటారు. అయిగే మీరు బంగారాన్ని కొనేటప్పుడు దాని స్వచ్ఛతను తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. మీరు హార్ మార్క్ ఆభరణాలను తప్ప వేరేవాటిని అసలే కొనొద్దు. అలాగే 916 నగలను కొనండి. అప్పుడే మీరు వాటిని తిరిగి అమ్మకానికి ఇచ్చినా ఎలాంటి సమస్యలు రావు.
బిల్ తప్పనిసరి
మీరు బంగారం కొనడానికి పెద్ద షాప్ కు వెళ్లినా, చిన్న షాప్ కు వెళ్లినా ఖచ్చితంగా బిల్లును తీసుకోవాలి. ఎందుకంటే బిల్లులోనే ఆభరణాల నాణ్యత, బరువు సరిగ్గా ఉంటాయి. అంతేకాదు వాళ్లు చెప్పిన దానికి పేపర్ పై ఉన్న బిల్లుకు తేడా ను కూడా గమనించండి.
జాగ్రత్తగా ఉండండి
బిల్లు చెల్లించిన తర్వాత ఆభరణాలను తూకం వేసేటప్పుడు, బరువు సరిగ్గా ఉందో? లేదో? చెక్ చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. లేకపోతే దుకాణదారుడు మిమ్మల్ని మోసం చేయొచ్చు. చాలా మంది ఇక్కడే మోసపోతుంటారు.
రాళ్ల ఆభరణాలకు దూరం
రాళ్లున్న ఆభరణాలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ అమ్మకాల విషయానికి వస్తే దీనిలో సగం మాత్రమే బంగారం ఉంటుంది. వీటిని మీరు అమ్మినా పెద్దగా డబ్బులు రావు. అందుకే అందం కోసం రాళ్లతో అందంగా కనిపించే ఆభరణాలు అస్సలు కొనకండి.
మీరు ఈ పండుగకు ఖచ్చితంగా బంగారం కొనాలనే రూలేమీ లేదు. అందుక తక్కువ డబ్బు ఉంటే మీరు అక్షయ తృతీయ నాడు బంగారం జోలికి వెళ్లకండి. వీటికి బదులుగా బంగారు నాణేలను కొనండి. మేకింగ్ ఛార్జీలు, వృథా తక్కువగా ఉంటాయి.