Asianet News TeluguAsianet News Telugu

బీ-అలెర్ట్.. లేదంటే మీ డబ్బు హాంఫట్!!

కళ్లు తెరవండి బాబు.. అని యాక్సెంజర్ అనే అధ్యయన సంస్థ ఐటీ నిపుణులను హెచ్చరిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజురోజుకు సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని పేర్కొంది. ప్రత్యేకించి కార్పొరేట్‌ సంస్థలకు పెనుముప్పు పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. 

Half of business leaders fear they are unprepared for cyber attacks
Author
New Delhi, First Published Feb 10, 2019, 11:12 AM IST

బ్యాంకర్లు డెబిట్ కార్డు పోయిందని గానీ, వాడకం గురించి గానీ గుర్తు చేయరు.. కానీ సైబర్ నేరగాళ్లు రకరకాల ఎత్తులు, వ్యూహాలు అమలు చేస్తున్నారు. బ్యాంకుల ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని..‘మీరు డెబిట్‌ కార్డు వాడి చాలాకాలం కావడంతో కార్డు బ్లాక్‌ అయింది.. మీకు కొత్త కార్డు జారీ చేస్తున్నాం.

మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.. ఆ ఓటీపీతోపాటు పాత కార్డు నెంబరు, సీవీవీ చెప్పండి’అని ఫోన్ చేస్తారు. అప్పుడు కంగారుగా వివరాలు చెప్పేసిన నిమిషాల్లో సదరు వ్యక్తుల బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇదొక రకం సైబర్ చీటింగ్..

ఈ పద్ధతిలో కాకున్నా కార్పొరేట్‌ సంస్థలకు కూడా సైబర్‌ ముప్పు పొంచి ఉంది. పైగా ఆ ప్రమాదాలు కూడా పెద్ద స్ధాయిలో ఉంటాయి. కార్పొరేట్‌ సంస్థలకు గతంతో పోలిస్తే సైబర్‌ భద్రత అనేది ఇప్పుడు పెను సమస్యగా మారిందని యాక్సెంచర్ అనే సంస్థ తెలిపింది. దీనివల్ల కలిగే నష్టాలు కూడా అనూహ్యంగా ఉంటున్నాయన్నది. 

వచ్చే అయిదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్‌ సంస్థలు సైబర్‌ దాడుల వల్ల 5.2 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.370 లక్షల కోట్లు) మేర నష్టపోవలసి ఉంటుందని అగ్రగామి ఐటీ సేవల సంస్థ ‘యాక్సెంచర్‌’ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది.

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పరిజ్ఞానం రోజురోజుకీ విస్తరిస్తోంది. టెక్నాలజీ పరంగానూ వినూత్న పోకడలు వస్తున్నాయి. ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి కంపెనీలు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో భద్రత అంశాన్ని ఒక్కోసారి విస్మరిస్తున్నాయి. 

భద్రతా కోణంలో పూర్తి సంసిద్ధత లేకుండా టెక్నాలజీని అంది పుచ్చుకోవటం వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని యాక్సెంచర్ అధ్యయనంలో స్పష్టమైంది. తమ సంస్థలను ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా తట్టుకునే విధంగా నిర్మించటం పెను సవాలుగా మారినట్లు యాక్సెంచర్ అధ్యయనంలో పాల్గొన్న కొన్ని సంస్థల ప్రతినిధులు  స్పష్టం చేశారు.

అన్నింటికీ మించి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించే (హై-టెక్‌) సంస్థలకు సైబర్‌ దాడుల ముప్పు ఎక్కువని తేలింది. ఈ రంగ సంస్థలకు ఈ సమస్య వల్ల వచ్చే ఐదేళ్లలో 75,300 కోట్ల డాలర్ల (దాదాపు రూ.53 లక్షల కోట్లు) మేరకు నష్టం జరగవచ్చని ఈ నివేదిక పేర్కొంది.

తదుపరి స్థానాల్లో జీవశాస్త్రాలు, ఆటోమోటివ్‌ పరిశ్రమ, వినియోగ వస్తువులు, సేవల రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. సైబర్ దాడుల నుంచి రక్షణ కోసం ఇంటర్నెట్‌ సెక్యూరిటీని పూర్తిగా బలోపేతం చేయటమే దీనికి కొంత పరిష్కారమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సంస్థల్లోని ముఖ్య సైబర్‌ భద్రతాధికార్లకు సంబంధించిన విషయంగా దీన్ని పరిగణిస్తున్నారు, కానీ ఇది సరికాదు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) స్వయంగా దృష్టి సారించాల్సిన అంశంగా సైబర్‌ భద్రత మారిందని పేర్కొంటున్నారు.

ఇంటర్నెట్‌ ఆవిష్కరణ సమయంలో ఇప్పుడున్నంత సంక్లిష్ట సాంకేతిక వాతావరణం లేదు, అందువల్ల అప్పట్లో భద్రత అనేది పెద్ద  సమస్యగా కనిపించలేదు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని యాక్సెంచర్ నివేదిక విశ్లేషించింది.

తన సమాచారం భద్రం కాదనే అనుమానం వినియోగదార్లకు వస్తే వారు తమకు సేవలు అందించే సంస్థలకు దూరం జరుగుతారన్నది. ఈ సమస్య ఏదో ఒక దేశానికో  లేక ఒక సంస్థకో సంబంధించిన సమస్య కాదని, ఇది అన్ని దేశాలకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త సమస్య అని యాక్సెంచర్ రూపొందించిన నివేదిక విశ్లేషించింది.

అందువల్ల ప్రపంచ దేశాల మధ్య ఈ విషయంలో పరస్పర సహకారం ఉండాలని సూచించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, జీవ శాస్త్రాలు, వాహన రంగం, వినియోగ వస్తువులు, సేవలు, బ్యాంకింగ్‌, ఆరోగ్యం, రిటైల్, బీమా, పారిశ్రామిక యంత్ర సామగ్రి, కమ్యూనికేషను, మీడియా, సహజ వనరులు, ఉపకరణాలు, ఇంధనం, రసాయనాలు, రవాణా, పర్యాటక సేవలు, స్టాక్‌ మార్కెట్లరే ఈ ముప్పు పొంచి ఉంటుంది. 

మనదేశంలోని కార్పొరేట్‌ సంస్థలకు ఎంతో ఎక్కువగా సైబర్‌ ముప్పు ఉన్నట్లు ఫ్రాస్ట్‌ అండ్‌ సులివాన్‌ అనే అంతర్జాతీయ సంస్థ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమైంది. దీనివల్ల కార్పొరేట్‌ సంస్థలు ఆర్థికంగా నష్టపోవటంతో పాటు ఎన్నో ఉద్యోగాలు కోల్పోవసిన పరిస్థితి ఎదురవుతుందని వెల్లడించింది. 

ఏదైనా ఒక పెద్ద కార్పొరేట్‌ సంస్థకు సైబర్‌ సవాలు ఎదురయితే, దానికి కోటి డాలర్లకు పైగా నష్టం జరుగుతుందని తేలింది. మనదేశంలోని ప్రతి ఐదు కంపెనీల్లో మూడింటికి ఇప్పటికే సైబర్‌ భద్రతా సమస్య ఎదురు కావటం కానీ, అలా ఎదురైన సమస్యను గుర్తించకపోవటం కానీ జరిగింది. 

వినియోగదారులకు బాగా దగ్గర కావటానికి, వారితో నిరంతరం సంబంధాలు కలిగి ఉండటానికి పలు సంస్థలు ఇటీవలి కాలంలో క్లౌడ్‌, మొబైల్‌ కంప్యూటింగ్‌ తదితర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మీద అధికంగా ఆధారపడుతున్నాయి. ఇదే ఒక్కోసారి పెనుముప్పు అవుతోంది. కొత్త ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. 

సైబర్‌ ప్రమాదాల వల్ల బయటకు కనిపించే నష్టాలు కాక పరోక్షంగా మరెన్నో నష్టాలు ఉంటాయని ఈ అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. వినియోగదార్ల విశ్వాసాన్ని కోల్పోవటం, బ్రాండ్‌ విలువ పతనం కావటం వంటి కనిపించని నష్టాలు ఎదురు కావచ్చు. మనదేశంలోని చిన్నా, పెద్దా ఎన్నో కార్పొరేట్‌ సంస్థలకు సైబర్‌ ముప్పుపై తగినంత అవగాహనే లేకపోవట అన్నింటికీ మించిన ఉపద్రవం సర్వే నివేదిక తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios