న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ సమయంలో భారతదేశంలో మహిళలపై గృహహింస కేసులు పెరిగాయని పలు అధ్యయనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచేందుకు సోషల్ మీడియా వేదిక ‘ట్విట్టర్’ కొత్త టూల్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.

గృహహింస విషయమై అధికారిక వనరుల నుంచి సమాచారాన్ని, కొత్త అప్‌డేట్‌లను అందించేందుకు ప్రత్యేకంగా ట్విట్టర్ సెర్చ్ ప్రాంఫ్ట్‌ను తీసుకువచ్చింది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సమాచారం ఇచ్చే ‘సెర్చ్ ప్రాంఫ్ట్’.. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లపై పని చేస్తుందని సంస్థ తెలిపింది. 

మొబైల్.ట్విట్టర్ డాట్ కాంలో కూడా ఈ ఆప్షన్ కనపిస్తుందని ట్విట్టర్ వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ సమయంలో మహిళలు, బాలికలపైన హింస మరింత పెరిగిందని కొన్ని అధ్యయనాలలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో మహిళల్లో చైతన్యం కలిగించే ఉద్దేశంతో కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ, జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి ట్విట్టర్ పని చేస్తోంది.

ట్విట్టర్ సంస్థ అధికారి మహిమా కౌల్ మాట్లాడుతూ ‘ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేయడం వల్ల గృహ హింస మీద పోరాడవచ్చునని మేం గుర్తించాం. హింస, దుర్వినియోగానికి వ్యతిరేకంగా సాయం కోరే వారికి సెర్చ్ ప్రాంఫ్ట్ ద్వారా మేం అందించే సరైన సమాచారం సహకరిస్తుంది’ అని తెలిపారు. 

also read భారత్-చైనా సరిహద్దు ఘర్షణ..: ఒప్పో లైవ్ షో రద్దు..

బాధితుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన  హ్యాష్ ట్యాగ్ ‘దేర్ ఈజ్ హెల్ప్ ఫ్రాంఫ్ట్’ ద్వారా క్లిష్ట పరిస్థితుల్లో నమ్మదగిన సమాచారాన్ని అందజేసి ప్రజలకు సహకరిస్తుందని ట్విట్టర్ తెలిపింది. ఈ ఫీచర్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించి, గృహ హింసకు సంబంధించిన కొత్త కీ వర్డ్స్‌ను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నది. 

ఆసియా-పసిఫిక్ రీజియన్ పరిధిలో మహిలు, బాలికలపై జరుగుతున్న హింసకు సంబంధించిన సమాచారం సరిగ్గా వెలుగులోకి రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐక్యరాజ్యసమితి మహిళా ఆసియా పసిఫిక్ రీజియన్ మేనేజర్ ఎండింగ్ వయలెన్స్ ఎగనెస్ట్ ఉమన్ మెిస్సా అల్వారాడో మాట్లాడుతూ తమ రీజియన్ పరిధిలోని పలు దేశాల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు తమపై హింసకు సంబంధించిన అనుభవాలను వెల్లడిస్తారన్నారు. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ మాట్లాడుతూ సామాజిక దూరం నిబంధనలతో చాలా మంది మహిళలు వారు నిరంతరం తమకు మద్దతునిచ్చే వ్యవస్థలతో అనుసంధానం కాలేకపోతున్నారన్నారు.