న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశం కల్పించి మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. కానీ ఈ విధానంతో ఉద్యోగులు పలు దుష్ప్రభావాలకు గురవుతున్నారని ‘యువర్ అమిగోస్‌ ఫౌండేషన్‌’ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో తేలింది.

ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేస్తూ నీరసించి పోతున్నారని గుర్తించింది. ఇంటి నుంచి పని చేస్తున్న వివిధ వయస్సుల ఉద్యోగులపై శారీరక, సామాజిక, మానసిక, ఆర్థికపరమైన ప్రభావం ఎలా ఉందో తెలుసుకొనేందుకు ఈ సర్వే నిర్వహించింది. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వర్క్‌ ఫ్రం హోం మంచి ప్రత్యామ్నాయం అయినప్పటికీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సి రావటం ఆందోళన కలిగిస్తున్నది. ఉద్యోగులందరికీ ఇంట్లో ఆఫీస్‌ పనిచేసుకొనేందుకు ప్రత్యేక గదులు ఉండవు.

భార్యాపిల్లలతో ఒకేచోట ఉండి పనిచేయాల్సి వస్తుందని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో పనిపై ఏకాగ్రత కుదరక తప్పులు ఎక్కువచేసే అవకాశం ఉంటుంది. దాంతో పై అధికారుల కోపానికి గురై మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. 

also read టెలికాం కంపెనీల మధ్య పెరగనున్న పోటీ..ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలుకు అమెజాన్ కారణాలివే..

బ్రిటన్‌లో ఇటీవల నిర్వహించిన ఓ సర్వే లో వర్క్‌ఫ్రం హోం చేస్తున్న వారిలో 54 శాతం మంది బెడ్‌రూంలో కూర్చొని, 19 శాతంమంది డైనింగ్‌టేబుల్‌పైనే ఆఫీస్‌ పనిచేస్తున్నారని వెల్లడైంది. మరికొంత మందిహాల్లో, ఇంటి ఆవరణలో కూర్చొని పనిచేస్తున్నారని సర్వే తేల్చింది. 

వర్క్‌ఫ్రం హోం విధానంపై అమిగోస్‌ సర్వేలో ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సు కోసం స్పష్టమైన వర్క్‌ఫ్రం హోం విధానాలు రూపొందించి, ఉత్తేజం నింపేందుకు ప్రయత్నించాలని 87 శాతం మంది సూచించారు.

49 శాతం మంది తొలిసారి వర్క్‌ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 55.2 శాతంమంది సాధారణం కంటే ఎక్కువ టైం పనికి కేటాయించాల్సి వస్తున్నదని చెప్పారు. 

91 శాతంమంది అదనపు భత్యం లేకుండానే ఎక్కువ పనిచేయాల్సి వస్తున్నదని వాపోయారు. 59 శాతం మంది తమపై అదనపు భారం పడుతున్నదని పేర్కొన్నారు. ఇక మెజారిటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోంతో ఒత్తిడి పెరిగిందని తేల్చారు.