టోక్యో ఒలింపిక్స్: ముగిసిన మేరీకోమ్ పోరాటం... రెండో రౌండ్‌లో ఓడి...
రెండో రౌండ్‌లో కొలంబియాకి చెందిన ఇన్‌గ్రిట్ వాలెన్సియాతో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడిన మేరీకోమ్...
3-2 తేడాతో ఓడి, ఒలింపిక్ గోల్డ్ మెడల్ కలను నెరవేర్చుకోలేకపోయిన భారత సీనియర్ బాక్సర్...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత సీనియర్ బాక్సర్ మేరీకోమ్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో కొలంబియాకి చెందిన ఇన్‌గ్రిట్ వాలెన్సియాతో జరిగిన మ్యాచ్‌లో 3-2 తేడాతో పోరాడి ఓడింది మేరీకోమ్.
తొలి రౌండ్‌లో వాలెన్సియా విజయం సాధించగా, రెండో రౌండ్‌లో మేరీ కోమ్ గెలిచింది. కీలకమైన మూడో రౌండ్‌లో దూకుడు చూపించిన వాలెన్సియా, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న మేరీకోమ్, ఈసారి స్వర్ణ పతకం సాధించాలని భావించింది. అయితే 38 ఏళ్ల వయసులో మేరీకోమ్ ఒలింపిక్ మెడల్ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ సతీశ్ కుమార్ క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. మెన్స్ సూపర్ హెవీవెయిట్ కేటగిరీలో (91 కేజీల విభాగంలో) జమైకా బాక్సర్ రిచర్డో బ్రౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో విజయం సాధించాడు సతీశ్ కుమార్.
ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌లోకి ప్రవేశించిన తొలి మెన్స్ బాక్సర్‌గా నిలిచాడు సతీశ్ కుమార్. ఇప్పటివరకూ బాక్సింగ్‌లో పోటీపడిన భారత మెన్స్ బాక్సర్లు ఆశీష్ కుమార్, వికాస్ కృష్ణన్, మనీశ్ కౌషిక్ తొలి రౌండ్‌లోనే ఓడిన విషయం తెలిసిందే.
సూపర్‌వెయిట్ కేటగిరీలో భారత జట్టు తరుపున ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మొట్టమొదటి బాక్సర్ సతీశ్ కుమారే. మహిళల బాక్సింగ్‌లో లవ్‌లీనా, పూజారాణి, మేరీకోమ్ విజయాలు అందుకున్నారు. వీరిలో లవ్‌లీనా, పూజా రాణి ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌కి అర్హత సాధించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో గురువారం భారత జట్టుకి ఇప్పటిదాకా మంచి ఫలితాలే దక్కాయి. అథానుదాస్ మెన్స్ ఆర్చరీ సింగిల్స్‌లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. వరల్డ్ నెం.3 ఆర్చర్ కొరియాకు చెందిన జిన్ హెక్ హూతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో షూట్ ఆఫ్‌లో విజయాన్ని అందుకున్నాడు అథానుదాస్.
బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు, క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లగా, భారత పురుషుల హాకీ జట్టు, అర్జెంటీనాపై విజయాన్ని అందుకుంది. రోయింగ్‌లో భారత జోడి అర్వింద్ సింగ్, అర్జున్ లాల్... లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ బీ ఈవెంట్‌ను ఐదో స్థానంతో ముగించారు.