Asianet News TeluguAsianet News Telugu

కదనంలోనే కాదు.. కోర్టు పోరుల్లోనూ వారే వీరమణులు

ఇటీవల యువతులు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆర్మీ శిక్షణ విద్యాలయం ఎన్‌డీఏలో  ప్రవేశాలకు అనుమతి సాధించుకున్నారు. దీనితో సైనిక దళాల్లోని అన్ని రంగాలు, అన్ని విభాగాల్లో ఉద్యోగాలు చేయడానికి మహిళల అర్హత సాధించినట్టే. మహిళలు ఈ అనుమతులు పొందడం కోసం దశాబ్దాలుగా వివిధ రకాలుగా పోరాటాలు చేస్తున్నారు. ప్రతి అంశంలోనూ కోర్టుకెక్కి తాము కోరుకున్నవి సాధించుకుంటున్నారు. ఈ విజయ పరంపరను 1992లో మొదలైంది.

woman achieved permanent commission status in army through supreme court is a great milestone
Author
Hyderabad, First Published Sep 24, 2021, 12:51 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

శక్తికి ప్రతిరూపం మహిళ. అయినా, మొన్నమొన్నటి వరకు స్త్రీలకు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసు వంటి ఒకటో రెండో సైనిక విభాగాల్లో మాత్రమే ఉద్యోగం చేసే అవకాశముండేది. ఎన్నో డిమాండ్లు, పోరాటాల ఫలితంగా 1992లో త్రివిధ దళాల్లోని ఏవియేషన్, ఇంజనీరింగ్, లా, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లోకి మహిళలను ఆఫీసర్లుగా అనుమతించడం మొదలైంది. ఎయిర్‌ఫోర్స్ 1994లో పైలట్లుగా మహిళలను తీసుకోవడం ప్రారంభించింది. అయితే, వారిని నాన్-కంబాట్ రోల్స్‌కే పరిమితం చేశాయి. అంతేకాదు, షార్ట్ సర్వీసు కమిషన్(స్వల్ప కాలావధి ఉద్యోగాలు చేయడాని)కే అనుమతించేవారు.

ఈ పరిమిత అవకాశాలనే సాధనంగా చేసుకున్న యువతులు, కొన్ని సార్లు పురుషులకు మించిన ప్రతిభ కనబరుస్తూ, రికార్డులు సృష్టిస్తూ ధైర్యసాహసాల్లో, వ్యూహ చతురతల్లో తమను తాము నిరూపించుకుంటున్నారు. అయినప్పటికీ వారిని కదనరంగంలోకీ, కమాండర్ పోస్టుల్లోకీ అనుమతించడంలో కూడా తాత్సారం జరిగింది. అత్యుత్తమ స్థాయి సత్తా చాటుతున్న తమను ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కదనరంగ విభాగాలకూ కమాండర్లుగా అనుమతించాలంటూ డిమాండ్ చేసి కోర్టుకెక్కారు.

వారి పోరు ఫలించి 2018లో మహిళలు ఫైటర్ పైలట్లుగా యుద్ధ విమానాలను నడపడం మొదలైంది. అప్పటిదాకా వీరుల గురించే చెప్పుకున్న మనం మహిళా యోధుల గురించి కూడా విశేషంగా చెప్పుకోవడం మొదలైంది. తొలి బ్యాచ్ ఫైటర్ పైలట్లయిన అవని చతుర్వేది, మోహనా సింగ్ జితర్‌వాల్, భావనా కాంత్‌లు చేసిన వీరోచిత కృషికిగానూ 2020 మార్చి 8 ‘మహిళా దినోత్సవం’ రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘నారీ శక్తి పురస్కారాల’ను అందుకున్నారు. తద్వారా మహిళలు యుద్ధ రంగంలోనూ ఏ స్థాయిలో రాణించగలరో వీరు చాటిచెప్పారు.

భారతీయ రక్షణ దళాల్లో యువతుల ప్రవేశాలకు సంబంధించిన మరో ముఖ్య పరిణామం 2019లో జరిగింది. అప్పటి నుంచే పీబీఓఆర్(పర్సన్స్ బిలో ఆఫీసర్) ర్యాంకు ఉద్యోగాల్లోనూ చేరడానికి యువతులకు అవకాశం కల్పించారు. తొలి సారిగా ఆర్మీలో సోల్జర్(ఉమెన్ మిలిటరీ పోలీస్) ఉద్యోగాలకు యువతులను రిక్రూట్ చేశారు. కానీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్టల్ గార్డు పీబీఓఆర్ ర్యాంకు ఉద్యోగాల్లోకీ మహిళలను ఇంకా అనుమతించలేదు.

రక్షణ దళాల చరిత్రలోనే కాదు, భారత దేశ చరిత్రలోనే చెప్పుకోదగిన మరొక మలుపు 2020లో చోటుచేసుకుంది. కంబాట్(కదనరంగ విభాగాల) ఆర్మ్స్‌లోకీ, కమాండ్ పోస్టుల్లోకీ తమను అనుమతించాలని, పర్మనెంట్ కమిషన్‌కు అవకాశం కల్పించాలన్న డిమాండ్లతో 2000 సంవత్సరం నాటికే రక్షక దళాల్లోని మహిళా ఆఫీసర్లు న్యాయ పోరాటం మొదలుపెట్టారు. పదేళ్లకు పైగా కొనసాగిన న్యాయపోరాటంలో కింది కోర్టుల్లో గెలిచారు. అయినా కూడా పురుషాధిక్య సమాజం వివిధ కారణాలు చూపుతూ వారికి అడ్డంకులు కల్పించింది. మహిళల డిమాండ్లను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో ఎన్నో వాదనలు చేసింది. ఈ కారణాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు మహిళల డిమాండ్లను తీర్చాల్సిందేనంటూ 2020 ఫిబ్రవరి 17న ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. ‘మహిళలను కమాండ్ పోస్టుల్లోకి అనుమతించడంతోపాటు, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకోవాలనీ, వారిపట్ల ఎలాంటి వివక్ష చూపకూడదంటూ’ఆదేశించింది.

టెరిటోరియల్ ఆర్మీలోనూ ఉద్యోగావకాశాలు పొందడానికి మహిళలు కోర్టుకెక్కాల్సి వచ్చింది. అయితే, ఇప్పటికీ రక్షణ దళాల్లో మహిళలకు ఇంకా పూర్తి స్థాయిలో అవకాశాలు లభించలేదనే భావించాలి. ఉదాహరణకు, సైన్యంలో ఆఫీసర్లు కావడానికి గ్రాడ్యుయేషన్‌ను కనీస అర్హతగా నిర్ణయించారు. కానీ, అబ్బాయిలను మాత్రం.. ఆర్మీలో ఇంటర్మీడియెట్ అర్హతతో ఎన్డీయే, టీఈఎస్(10+2), నేవీలో ఎన్డీయే&ఎన్ఏ, టెక్నికల్ కేడెట్ ఎంట్రీల ద్వారా చేర్చుకుని డిగ్రీ, బీటెక్ చదివించి ఆఫీసర్ పోస్టు కట్టబెట్టే ప్రత్యేక సౌకర్యం కల్పించారు. కానీ, అమ్మాయిలకు ఈ అవకాశం లేదు. దీన్ని కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి మహిళలు అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చింది.

-- హిమబిందు, సామల (డిఫెన్స్ స్పెషలిస్ట్)

Follow Us:
Download App:
  • android
  • ios