Asianet News TeluguAsianet News Telugu

ఇంజనీర్ స్టేట్స్ మన్ : నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్

ఆనాటికి దేశంలో యూరోపియన్ చీఫ్ ఇంజనీర్లదే ఆధిపత్యం ఉండేది. అలీ నవాజ్ జంగ్ దేశంలోనే చీఫ్ ఇంజనీర్ పదవిని అధిష్టించిన మొట్టమొదటి స్వదేశీ చీఫ్ ఇంజనీర్.

Sridhar Rao Deshpande remembers Nawab Ali Nawaj Jung Bahadur
Author
Hyderabad, First Published Jul 11, 2020, 10:03 AM IST

జూలై 11 నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ జన్మ దినం. హైదారాబాద్ రాజ్యంలో ఒక లెజెండ్ ఇంజనీర్. హైదారాబాద్ సంస్థానంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఆయన ప్రతిభా సామర్త్యాలు గుర్తింపుకు నోచుకున్నాయి. ఆయన పేరు పక్కన F.C.H అని రాసి ఉంటుంది. ఎఫ్ సి హెచ్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి కొంత పరిశోధన చేయవలసి వచ్చింది. వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపనీ 1850 నాటికి దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో తన రాజకీయ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నది. తన మిలిటరీ నిర్మాణాల కోసం, రైల్వేలు, రోడ్లు, వంతెనలు, భవనాలు నిర్మించేందుకు 1854 లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాపనుల శాఖను  ఏర్పాటు చేసింది. ఈ శాఖలో పనిచేయడానికి ఇంజనీరింగ్ లో శిక్షితులైన ఇంజనీర్లు అవసరం అయినారు. 

ప్రజాపనుల శాఖకు అవసరమైన ఇంజనీర్లను తయారు చేయడానికి  రాయల్ ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించారు. కూపర్ హిల్స్ ఎస్టేట్ లో ఈ కాలేజీని స్థాపించారు కనుక ఈ కాలేజీ కూపర్ హిల్స్ ఇంజనీరింగ్ కాలేజీగా ప్రసిద్ది చెందింది. ఈ కాలేజీలో యూరోపియన్ విద్యార్థులే కాకుండా బ్రిటిష్ వలస దేశాల నుంచి కూడా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసేవారు. నిజాం రాజ్యం బ్రిటిష్ అత్యున్నత రాజ్యాధికారానికి (Paramount Authority) లొంగి ఉంటూనే స్వతంత్ర రాజ్యంగా కొనసాగింది. నిజాం రాజ్యంలో ప్రజాపనుల విభాగం 1869 లో ఏర్పాటు అయ్యింది. నిజాం రాజ్యం నుండి కూడా కూపర్ హిల్స్ కాలేజీకి విద్యార్థులను పంపించే వెసులుబాటు ఉండేది.  గణితంలో మీర్ అలీ అహ్మెద్ (అలీ నవాజ్ జంగ్ బహాదూర్) ప్రతిభను గుర్తించి హైదారాబాద్ ప్రభుత్వం ఆయనకు స్కాలర్ షిప్ మంజూరు చేసి 1896 లో ఇంగ్లాండ్  లోని రాయల్ ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను అభ్యసించడానికి పంపించారు. 

అట్లా అలీ నవాజ్ జంగ్ కూపర్ హీల్స్ కాలేజీలో చేదువుకున్నాడు కనుక ఆయన పేరు పక్కన ఎఫ్ సి హెచ్ అని రాస్తారు అంటే Fellow of Cooper Hills అని అర్థం. కూపర్ హిల్స్ కాలేజీలో మీర్ అహ్మెద్ అలీ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తన బ్యాచ్ లో ప్రథముడిగా నిలచి స్కాలర్ షిప్ లు అందుకున్నాడు. కూపర్ హిల్స్ లో చదువు ముగించుకొని వచ్చి హైద్రాబాద్ ప్రభుత్వంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా 1899 లో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి 1918 నాటికి చీఫ్ ఇంజనీర్ గా, 1928 నాటికి ప్రజా పనుల విభాగానికి  సెక్రెటరీగా పదోన్నతి పొందాడు. రిటైర్మెంట్ తర్వాత 1949 లో చనిపోయేదాకా ఆయన నిజాం వ్యక్తిగత కన్సల్టింగ్ ఇంజనీర్ గా పని చేశాడు. ఈ సుధీర్ఘ ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలు నిరుపమానమైనవి. 

ఎ టి మెకంజీ వ్యాఖ్యలు : 

ఆనాటికి దేశంలో యూరోపియన్ చీఫ్ ఇంజనీర్లదే ఆధిపత్యం ఉండేది. అలీ నవాజ్ జంగ్ దేశంలోనే చీఫ్ ఇంజనీర్ పదవిని అధిష్టించిన మొట్టమొదటి స్వదేశీ చీఫ్ ఇంజనీర్. సెక్రెటరీ - చీఫ్ ఇంజనీర్ గా ప్రమోషన్ పొంది ఆనాటి బ్రిటిష్ చీఫ్ ఇంజనీర్ ఏ టి మెకంజీ నుంచి చార్జ్ తీసుకుంటున్నప్పుడు మెకంజీ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. “ నేను నా భాద్యతలను నా కంటే ప్రతిభావంతుడికి, నా కంటే గొప్ప పరిపాలనాదక్షుడికి అప్పజెపుతున్నాను.” 1913 లో మూసీ వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరాయతో కలసి అలీ నవాజ్ జంగ్ రూపొందించిన నివేదికను యదాతథంగా ఆమోదిస్తూ మెకంజీ అన్న మాటలను కూడా గుర్తు చేసుకోవాలి. “ ఘనత వహించిన నిజాం ప్రభువు గారు ఎంపిక చేసుకొన్న సలహాదారులు, ఈ పనికి ఎంపిక అయిన అధికారులు అదృష్టవంతులు. ఈ అవకాశం భారతదేశంలోనే అత్యున్నత ప్రతిభా సామర్థ్యాలు కలిగిన విశ్వేశ్వరాయకు దక్కింది. మైసూరు దీవానుగా అతను అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఈ నివేదిక రూపొందించడంలో ఆయనకు సహాయకుడిగా ఎంపికైన మీర్ అహ్మెద్ అలీ కృషి అమోఘమైనది. ఇంజనీరింగ్ ప్రమాణాల పరంగా చూసినప్పుడు అత్యున్నతమైనది. రెండింటి (ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ) సర్వే నివేదికలు తయారు చేసింది మీర్ అహ్మెద్ అలీనే. 1913 లో మెకంజీ తో ప్రశంసలు అందుకున్న అలీ నవాజ్ జంగ్ ఆ తర్వాత కాలంలో మెకంజీ స్థానంలో చీఫ్ ఇంజనీర్ గా ఎదగడం యాదృఛ్చికం కాదు. మెకంజీ మాటలు అక్షర సత్యాలు. ఆయన ఇంజనీరింగ్ మేధావిగా చెప్పడానికి ఆయన రూపొందించిన నివేదికలు రుజువులుగా ఉన్నాయి. మద్రాస్, మైసూర్, హైదారాబాద్ రాష్ట్రాల మధ్య  దశాబ్దాలుగా నానుతున్న తుంగభద్ర జల  వివాదాలను పరిష్కరించి తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణం కావడానికి ఆయన చూపిన చొరవ, చూపిన పరిష్కార మార్గాలు ఆయనను ఒక స్టేట్స్ మన్ గా మన ముందు నిలబెడతాయి. ఆయన మేధావి తనానికి మచ్చు తునకలుగా ఉండే కొన్ని సందర్భాలను  ఈ వ్యాసంలో ఉటంకించదలుచుకున్నాను. 

తుంగభద్ర జల వివాదాలు : 

తుంగభద్ర జల వివాద పరిష్కారం విషయమై మద్రాస్, మైసూర్ రాష్టాలతో హైదారాబాద్ రాష్ట్రం చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలను హైదారాబాద్ ప్రభుత్వం 5 సంపుటాలుగా ప్రచురించింది. వాటిలో అలీ నవాజ్ జంగ్ రాసినవి ఎన్నో ఉన్నాయి. వాటిలో నుంచి కొన్ని ఆణిముత్యాలను ఇక్కడ ఉటంకిస్తున్నాను. 

“హైదారాబాద్ రాష్ట్రం తుంగభద్ర నీటిలో తనకు న్యాబద్దంగా అందవలసిన నీటి వాటాను కాపాడుకోవాలనుకుంటున్నది. నీరు రాష్ట్రాల సరిహద్దులకు అతీతంగా అత్యధిక ప్రయోజనాలను అందివ్వాలి. అత్యధిక జనాభాకు అందాలి.” 

“నదీ జలాలు రాజకీయ ఒత్తిడుల ద్వారా పంపకం చేయబడే ఒక ఆస్తిగా భావించే వైఖరి బలపడటాన్ని మనం అనుమతించకూడదు. ప్రజల అవసరాలే ప్రమాణం కావాలి.”

అలీ నవాజ్ జంగ్ స్టేట్స్ మన్ షిప్ ను కొనియాడుతూ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఒకప్పటి మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రాజగోపాలచారి 1962 లో అలీ నవాజ్ జంగ్ మెమోరియల్ కమిటీకి రాసిన ఒక లేఖలో ప్రస్తావించినారు. “ 1937-38 సంవత్సరాల్లో అలీ నవాజ్ జంగ్ ను కలిసే భాగ్యం నాకు దక్కింది. అప్పుడు నేను మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను. మా మధ్య చర్చలు తుంగభద్ర నిర్మాణంపై మద్రాస్, హైదారాబాద్ రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న వివాదాలపై సాగినాయి. ఈ చర్చలు మా మధ్య సృహుద్భావ వాతావరణంలో జరిగినాయి. అర గంట పాటు జరిగిన చర్చల అనంతరం రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది. ఆ తర్వాత కూడా మా మధ్య స్నేహ సంబందాలు కొనసాగినాయి. నా హృదయంలో అలీ నవాజ్ జంగ్ కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఆ యన ప్రతిభను, ఒక ఇంజనీరుగా ఆయన సామర్థ్యాన్ని నేను గౌరవప్రదంగా గుర్తు చేసుకుంటున్నాను.తుంగభద్ర ప్రాజెక్టు సాకారం కావడానికి ఆయన పడిన తపన నేను సదా స్మరించుకుంటాను. ఇంత త్వరగా తుంగభద్ర ప్రాజెక్టు వివాదాలను మేము పరిష్కరించుకోవడం పట్ల అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈవేళ అలీ నవాజ్ జంగ్ మెమోరియల్ ను ఏర్పాటు చేయడం సముచితం మరియు సమయోచితం “ అని రాజగోపాలచారి రాసినారు. 

 నిజాంసాగర్ ప్రాజెక్టు నివేదిక -1923

నిజాంసాగర్ ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు అవసరాన్ని, నిర్మాణం అనంతరం ప్రాజెక్టు వలన సమాజానికి ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తూ ఈ  విధంగా రాశాడు. “ నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం వలన ప్రభుత్వానికి వచ్చే రాబడి గురించి నేను ఈ నివేదికలో చర్చించాను. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన ప్రభుత్వం పొందే ప్రత్యక్ష రాబడులు కాకుండా పరోక్ష ప్రయోజనాలు కూడా ఉంటాయి. ప్రజల ఆర్థిక స్థితిగతులు గణనీయంగా పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల ద్వారా అదనపు రాబడి పెరుగుతుంది. భూగర్భ జలాలు గణనీయంగా పెరుగడంతో బావుల కింద వ్యవసాయం పెరిగి వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి దేశ అవసరాలకు పోనూ ఎగుమతులు కూడా చేయవచ్చు. కరువులు దరిజేరవు. రైల్వేల ద్వారా రవాణా ఆదాయం పెరుగుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా అడవులు, తాటి వనాలు, ఈత వనాలు పెరుగుతాయి. అటవీ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా, అబ్కారీ పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో అనుబందంగా విద్యా వైద్యం రవాణా సదుపాయాలు పెరుగుతాయి. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. తద్వారా ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు ఊహించ లేనంత మార్పు చెందుతాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వెలుస్తాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 3,20,000  ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తే ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష రాబడి సాలీనా 6 కోట్ల రూపాయలు ఉంటుంది.”  ఇవి 1923 లో వ్యక్తం చేసిన అభిప్రాయాలని మనం గుర్తించాలి. ఆయన వ్యక్త పరచిన అభిప్రాయాలను నిజాంసాగర్ ప్రాజెక్టు అనంతర కాలంలో దృవపరచింది. నిజామాబాద్ జిల్లా నిజాం సంస్థానంలోనే అత్యంత సంపద్వంతమైన జిల్లాగా మారింది.  ఈ మాటలు ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అక్షరాల వర్తిస్తాయని చెప్పవచ్చు. 

రహదారులు, వంతెనలు :

అలీ నవాజ్ జంగ్ హైదారాబాద్ సంస్థానంలో అనేక రహదారులు, వంతెనలు నిర్మాణం చేశాడు. అవి ఈనాటికీ సేవలు అందిస్తునాయి. రహదారులు, వంతెనలు దేశ ఆర్థిక ప్రగతికి ఎంత అవసరమో అలీ నవాజ్ జంగ్ తను రాసిన సాంకేతిక నివేదికల్లో రాశాడు. అందులో నుంచి కొన్ని ఉటంకింపులు. 

“మానవ దేహంలో దమనులు, సిరాలు రక్తాన్ని సరఫరా చేస్తూ మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఎట్లా దోహదం చేస్తున్నాయో అట్లానే దేశంలో రహదారుల వ్యవస్థ ఎంత చిక్కగా, ఎంత విస్తృతంగా ఉంటే అంతా ఎక్కువగా ప్రగతి ఫలాలు దేశంలోని ప్రజలందరికీ అందుతాయి. “ 

“ఆధునిక రహదారుల నిర్మాణానికి మనం వెచ్చించే ఖర్చు అని నిర్మించక పోవడం వలన జరిగే ఆర్థిక నష్టంతో పోల్చినప్పుడు ఛాలా తక్కువ.”

“ఏ ప్రాంతంలోనైతే మంచి రహదారుల వ్యవస్థ లేదో ఆ ప్రాంతం తీవ్రంగా ఆర్థిక నష్టాల రూపంలో వెచ్చించవలసి ఉంటుంది.”

“మన జీవన ప్రమాణాలు, మన జీవన విధానాలు మనం నిర్మించుకునే రహదారుల మీద ఆధారపడి ఉంటాయి.”

“రహదారులు దేశంలో తగినంత ఉంటే అవి మనకు తెలియకుండానే తిరిగి చెల్లిస్తూనే ఉంటాయి.”

ఇటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్న అలీ నవాజ్ జంగ్ తన హయాంలో హైదారాబాద్ సంస్థానంలో  అనేక రహదారులను, అన్ని ప్రధాన నదులపై వంతెనలు నిర్మింపజేసినాడు. ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు సరిహద్దుగా ఉన్న గోదావరి నదిపై సోన్ గ్రామం వద్ద ఆయన నిర్మించిన అద్భుతమైన రాతి వంతెన వందేళ్ళకు పైగా  ఇటీవలి దాకా సేవలు అందించింది. ఆ వంతెనను చారిత్రిక వారసత్వ సంపదగా భావించి చెట్లు మొలవకుండా, రాళ్ళు పెకిలించుకపోకుండా  రక్షించుకోవాల్సిన బాధ్యత సోన్ గ్రామ ప్రజలదే. 

తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం సందర్భంగా పురా తవ్వకాలలో దొరికిన తెలంగాణ గర్వించదగిన కోహినూర్ వజ్రం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. ఆయన జీవితం, ఆయన సాధించిన విజయాలు తెలంగాణ ఇంజనీర్లకు ఎప్పుడూ స్పూర్తిదాయకమే. 

( 11 జూలై తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా.. )

Sridhar Rao Deshpande remembers Nawab Ali Nawaj Jung Bahadur

- శ్రీధర్ రావు దేశ్ పాండే 

Follow Us:
Download App:
  • android
  • ios