‘చర్చి’ని మించి, దేశం కోసం... నిలిచిన తరమది!
స్వాత్యంత్ర ఉద్యమానికి ముందు తర్వాత కూడా భారతీయ క్రైస్తవ సమాజం ఎటువంటి దేశీయ లేదా జాతీయ భావనలతో ఉండేదో తెలుసుకోవడం అవసరం. అది ఆనాటి భారత జాతీయ ప్రధాన స్రవంతి సమాజ సృజన రంగంతో పాలు నీళ్ళులా కలిసి ఎటువంటి సమన్వయంతో అది పనిచేసిందో 2020 తరానికి తెలియాల్సి వుంది
-జాన్‌సన్ చోరగుడి
కొన్ని కొన్ని మరణాలు చారిత్రిక మలుపుల్లో సంభవించి, అవి గత చరిత్ర పునస్సమీక్షకు కారణమవుతాయి. గత ఏడాది చివర డిసెంబర్ 28 న విజయవాడలో ఆచార్య రెవ. పులిదిండి సాల్మన్ రాజు కన్నుమూత సరిగ్గా అటువంటిదే. మరో రెండు నెలల్లో 2020 ఫిబ్రవరి 21 న ఆయన నూరవ జయంతి జరపాలని బంధు మిత్రులు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఇది జరిగింది. గతంలో ఆయన పనిచేసిన విజయవాడ ఆంధ్ర లూధరన్ చర్చి మిషన్, 2019 క్రిస్మస్ నాటికే 2020 కేలండర్ ను సాల్మన్ రాజు చిత్రాలతో ముద్రించి దాన్ని ఆయనకు తమ శతజయంతి బహుమతిగా పంపిణీ కూడా చేసింది. ఇంతలో ఇది జరిగింది, ఇటువంటప్పుడు సహజంగా వైతాళికుల విషయంలో నివాళి వ్యాసాలు రావడం సహజం.
(ఫోటో: ఆచార్య పురుషోత్తమ చౌదరి కాలం నాటి పర్లాఖిమిడి కోట)
వందేళ్ళ క్రితం ఆయన పుట్టిన పశ్చమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతంలో అన్ని దళిత క్రైస్తవ కుటుంబాలు మాదిరిగానే ఆయనది కూడా పేదరికం నేపధ్యం కావొచ్చు. దాన్ని స్వయం కృషితో ఆయన అధిగమించడం... మిగతా జీవితం. మహా అయితే అదొక ‘సక్సెస్ స్టోరీ’ అని వేనోళ్ళ శ్లాఘించడం వద్ద అది ఆగిపోతుంది. కానీ 2020 దశాబ్దం గుమ్మంలోకి ప్రవేశానికి భారతీయ క్రైస్తవ సమాజం అడుగులు వేస్తున్న ఇప్పటి ఘడియలు మునుపటికి పూర్తిగా భిన్నమైనవి. మైనార్టీ మతస్తుల దేశ భక్తికి, గీటురాయి పరీక్షలు అవసరం అంటున్న కాలమిది.
అటువంటప్పుడు గడచిన 75 ఏళ్లలో విదేశీ మిషనరీ పరిపాలనా పరిధి నుంచి బయటకు వచ్చిన భారతీయ ‘చర్చి’ తన విశ్వాసుల్ని ఎంత మేర దేశీయ సమాజంగా స్వతంత్రంగా ఎదగనిచ్చింది..? ఈ సందేహ సందర్భం - మనల్ని సాల్మన్ రాజు జీవన ప్రస్థానం ఆరంభ కాలం వద్దకు తీసుకు వెళుతున్నది. అది ఆయన తెలుగు క్రైస్తవ సమాజానికి ఏమి చేసారు? అనే సూక్ష్మ వివరాలు కోసం కాదు. ఆయన జీవిత గమనంలోని ప్రధాన మలుపుల్లో, ఆధునిక భారతీయ (క్రైస్తవ) చరిత్రలోని కీలక పరిణామాలు, ఎటువంటివో ఇప్పటి తరాలు ఆకళింపు చేసుకోవడం కోసం.
(ఆచార్య రెవ.పులిదిండి సాల్మాన్ రాజు)
అందుకొరకు - స్వాత్యంత్ర ఉద్యమానికి ముందు తర్వాత కూడా భారతీయ క్రైస్తవ సమాజం ఎటువంటి దేశీయ లేదా జాతీయ భావనలతో ఉండేదో తెలుసుకోవడం అవసరం. అప్పటి క్రైస్తవ చరిత్ర పరంపర ఎంతటి ఉజ్వలమైనదో, అది ఆనాటి భారత జాతీయ ప్రధాన స్రవంతి సమాజ సృజన రంగంతో పాలు నీళ్ళులా కలిసి ఎటువంటి సమన్వయంతో అది పనిచేసిందో 2020 తరానికి తెలియాల్సి వుంది. ఆ కాలం ఎంత విలువైన ‘బైబిల్’ కేంద్రిత వాగ్మయ భాండాగారాన్నిభారతీయ క్రైస్తవ సమాజం కోసం నిక్షిప్తం చేసిందో... పరిశీలించినప్పుడు విస్మయం కలుగుతుంది.
మరి దాని కొనసాగింపు ఆ తర్వాత ఏమయింది? అనే ప్రశ్నకు ఇప్పటికైనా జవాబులు వెదకడం మొదలు కావాలి. మరి సాల్మన్ రాజుకు పైన చెబుతున్న పరిణామాలకు సంబంధం ఏమిటి? ఉంది, అది ఆయన తెలుగు సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం రంగాలకు చేసిన సేవ! ఇప్పుడు కూడా ఇంతగా ఇది కీలకం ఎందుకు అయింది అంటే, భారతీ జాతీయ (స్వాత్యంత్ర) ఉద్యమంలో క్రైస్తవ సంఘాల పాత్ర ఎటువంటిదో తెలియాల్సిన అవసరం గానీ, దాన్ని చెప్పాల్సిన అవసరంగానీ ‘వ్యక్తి’ కేంద్రంగా మారిన నేటి క్రైస్తవ సమాజంలో ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు! మన దేశంలో 1710 లో ‘ఇండియన్ సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియన్ నాలెడ్జ్’ తన కార్యకలాపాలు మొదలు పెట్టి డిల్లీ కేంద్రంగా గత 300 ఏళ్ళు పైగా ఎంతో విలువైన సాహిత్యాన్నిభారతీయ క్రైస్తవ సమాజానికి అందించిన విషయం తెలిసిన వారు క్రమంగా తగ్గిపోతున్నారు.
(అలనాటి సువార్తవాణి చిత్రాలు)
క్రైస్తవ సమాజ సమిష్టి కృషి గురించి మాట్లాడితే, నా గొప్పతనం గురించి ఎవరు చెబుతారు? కనుక సందర్భం వస్తే, వ్యక్తిగత ప్రచారం చేసుకోవడమే అందుకు పరిష్కారం... అనేది ఇప్పటి స్వయం ప్రకటిత క్రైస్తవ మిషనరీల విజయ సూత్రమైంది. ఇలా తన గత చరిత్ర చెప్పుకోలేని దుస్థితిలో భారతీయ క్రైస్తవ సమాజం ఉంటే, పత్రికల్లో కనిపించే అన్యమత ప్రచారం వార్తలు, రోడ్ల పక్క కనిపించే సువార్త కూటాల ఫ్లేక్సీలు, మైదానాల్లో వినిపించే లౌడ్ స్పీకర్ల హోరు... ఇదే ఇప్పటి ‘క్రైస్తవ్యం’ కాబోలు అని, ప్రతి ఒక్కరి విమర్శకు అదిప్పుడు గురి అవుతూవుంది.
అయితే, వాస్తవం ఏమిటి అనేది తెలుసుకోవడానికి, ఇతరులకే కాదు ఈనాటి క్రైస్తవులకు కూడా ఆసక్తి లేదు! ఎందుకంటే, అందుకు సంయమనంతో కూడిన వివేచన అవసరం. అది కొరవడడం ఇప్పటి విషాదం. ఇప్పుడు అది ఎందరికి తెలుసోగాని, ఏనాడో 18వ శతాబ్దిలో బెంగాల్ నుంచి పర్లాఖిమిడి ప్రాంతానికి వలస వచ్చిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పురుషోత్తమ చౌదరి (1803 – 1890) తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. ఇప్పటికీ ప్రతి ‘చర్చి’లో ఆయన కీర్తనలు విధిగా పాడతారు.
స్వాత్యంత్ర ఉద్యమంలో 1915 నాటికి గాంధీజీ పాత్ర క్రియాశీలం అయ్యాక, జాతీయ ఉద్యమంలో క్రమంగా చురుకుదనం పెరిగింది. దాంతో మారుతున్న దేశ పరిస్థితుల్లో 1923లో ‘నేషనల్ మిషన్ కౌన్సిల్’ ‘నేషనల్ క్రిష్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (N.C.C.I) గా తన పేరు మార్చుకుంది. అలా అప్పటినుంచి అది పూర్తి దేశీయ వ్యవస్థగా క్రియాశీలక మయింది. ‘ఒక భౌగోళిక సరిహద్దు లోపల ఉన్న భారత జాతి కోసం...’ అనే స్ఫూర్తి ధ్వనించే విధంగా N.C.C.I దాని ప్రతి పనిలోనూ ‘నేషనల్’ అనే పదం ఉంచడం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత ‘థియాలజీ కరిక్యులం’ లోకి ‘నేషనల్’ స్పూర్తిని ప్రవేశ పెట్టాలనే సూచనలు ‘చర్చి’కి చేరాయి.
(అలనాటి సువార్తవాణి చిత్రాలు)
ఇలా తొలినాళ్ళలో ఈ కౌన్సిల్ ముందుగా ఈ కొత్త ‘జాతీయత తత్వం’ ఒక నూతన ‘తాత్వికత’గా అన్ని చర్చిల్లో అమలు చేస్తూ... వాటి మధ్య సమన్వయం సాధించాక, అప్పుడు అది కార్య రంగంలోకి దిగింది. చర్చిలో పరిస్థితి ఇలా వుంటే, స్వాత్యంత్రం తర్వాత నెహ్రు ప్రధానిగా మొదలయిన పంచవర్ష ప్రణాలికలు దేశమంతా అమల్లోకి వచ్చాయి. గ్రామీణ అభివృద్దికి ‘కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ విధానం అమలులోకి వచ్చింది.‘థియాలజీ’ తో పాటు వైద్యం, ఉన్నత విద్య, క్రిస్టియన్ హోం మూవ్మెంట్, యూత్ వర్క్, ఇండస్ట్రియల్ మిషన్, వికలాంగుల సంక్షేమం, ఆడియో-విజువల్ వర్క్ ఇలా భిన్న రంగాల్లోకి జాతీయ స్పూర్తితో భారతీయ చర్చి ప్రవేశించింది. వేర్వేరు మిషన్ చర్చిల మధ్య ఒక సమన్వయంతో కూడిన సేవాకార్యక్రమాలు జరగడానికి N.C.C.I చక్కని వేదికగా పనిచేసింది.
ఈ అనుభవంతో స్వాత్యంత్రం వచ్చిన ఇరవై ఏళ్ళకే 1970 లో భారతీయ చర్చి పక్షంగా ఈ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అది -విదేశీ నిధుల పై భారతీయ చర్చి ఇక ముందు ఆధారపడ వద్దని, కేవలం దేశీయ వనరులుతోనే అది తన కార్యరంగాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అప్పటికి డా. పులిదిండి సాల్మన్ రాజు అప్పటికే గుంటూరు ఏ.సి. కాలేజిలో బి.ఎస్సీ (1945) సిరంపూరు బైబిల్ కాలేజిలో బి.డి (1956) చదివారు. నాగపూర్ లో ఉండే N.C.C.I కేంద్ర కార్యాలయంతో పాటుగా అప్పట్లో అక్కడే వచ్చిన పలు సంస్థల్లో - ‘క్రిస్టియన్ అసోషియేషన్ ఫర్ రేడియో అండ్ ఆడియో విజువల్ సర్వీస్’ వొకటి. ఈ విభాగం బాధ్యతలు స్వీకరించమని తెలుగు వాడైన రాజు గారికి 1960 లో నాగపూర్ నుంచి పిలుపు వచ్చింది.
(సువార్త వాణి డైరెక్టర్లు రోజర్ క్యాన్- సాల్మాన్ రాజ్- డివి డేనియల్)
ఆయన ఈ బాధ్యతలు చూస్తూనే, ఇండియానా యునివర్సిటీ నుంచి 1965 నాటికి తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు, డెబ్బై దశకానికి ముందే ‘మీడియా’ రంగంలో ఎనిమిదేళ్ళ పాటు జబల్పూర్ లో రాజు పనిచేశారు. అదే కాలంలో విజయవాడలో ‘కెనెడియన్ బాప్టిస్ట్ మిషన్’ ‘ఆంధ్ర ఎవాంజిలికల్ లూధరన్ చర్చి’ ‘చర్చి ఆఫ్ సౌత్ ఇండియా’ సంయుక్త అధ్వర్యంలో ‘సువార్త వాణి’ పేరుతో 1964 సెప్టెంబర్ లో ఒక ‘మల్టి మీడియా’ ప్రాజెక్టును ప్రారంభించి డా. సాల్మన్ రాజును రేడియో స్టేషన్ డైరక్టర్ గా నియమించింది. అలా కెనడాకు చెందిన రెవ. రోజర్ క్యాన్ స్థానంలో ఒక భారతీయుడు డైరక్టర్ అయ్యారు. డా. రాజు 1968 -1978 మధ్య ఒక దశాబ్దం పాటు అనితర సాధ్యంగా ఈ బాధ్యతలు నిర్వహించారు. వీరి తర్వాత మరొక ప్రముఖుడు కమ్యునికేషన్ రంగంలో విదేశాల్లో డాక్టరేట్ చేసిన డా. రెవ. డి. వి. డేనియల్ ‘సువార్త వాణి’ డైరక్టర్ గా మరి కొన్నేళ్ళు పనిచేసారు. ఇంటా బయట మారిన పలు పరిణామాల నేపధ్యంలో ఇది 1997 లో ఈ సంస్థ మూతపడింది.
ఇప్పుడు 2020 ఆరంభంలో నుంచి ఎనభై దశకానికి ముందు కాలం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నాటి ఏడు దశాబ్దాల స్వాత్యంత్ర కాలాన్ని సగం చేసి 35 ఏళ్ళ వెనక్కి కనుక వెళితే, అక్కడ తెలుగు క్రైస్తవ సమాజ స్వర్ణ యుగం మనకు కళ్ళకు కట్టినట్టుగా సాక్షాత్కరిస్తుంది. అలనాటి ఆంధ్ర క్రైస్తవ మహాసభలు... కృష్ణా నది తీరాన విజయవాడ రాణీగారి తోటలో వేసిన చలువ పందిళ్ళ క్రింద ఎటుచూసినా జనసముద్రం... పక్కన కృష్ణా తీరం ఇసుక తిన్నెలు అక్కడ తరంగాల్లా సాగిన ‘సువార్త వాణి’ గీతాల జ్ఞాపకాల్లో అలనాటి ఆ సంస్థ డైరక్టర్లు డా. రెవ. సాల్మన్ రాజు, డా. రెవ. డి.వి. డేనియల్ (1928 – 2014) వంటి ఆధునిక క్రైస్తవ వైతాళికులు మనకు సాక్షాత్కరిస్తారు. వొక సమగ్ర భారతీయ దృష్టితో పనిచేసిన తరమది.
(డా. రెవ. ఏ.బి. మాసిలామణి)
ఏనాడో తమిళనాడు నుంచి వలస వచ్చిన పండిత కుటుంబానికి చెందిన డా. రెవ. ఏ.బి. మాసిలామణి తెలుగులో ప్రతి ఏడూ ఈ సభల కోసం రాసిన ‘థీం’ గీతాలు అప్పట్లో తెలుగునాట ఎంతో జనరంజకంగా ప్రజాబాహుళ్యంలో పాపులర్ అయ్యాయి. ‘నడిపించు నా నావ...’ గీతం వాటిలో వొకటి. సరళతరమైన తెలుగు భాష వాడకం ‘ప్రోటస్టెంట్’ చర్చిలో అప్పటికే విస్తరించగా, ‘కేథలిక్’ చర్చి అప్పటికి ఇంకా లాటిన్ ప్రాభవం నుంచి బయటకు రాలేదు. అక్టోబర్ 1962 నాటి రెండవ వాటికన్ ప్రకటన తర్వాత ఆ పరిస్థితి కొంత మెరుగు అయింది. ఆచార్య మాసిలామణి వంటి క్రైస్తవ సాహిత్యవేత్తల రచనల వల్ల అప్పటికే ‘ప్రోటస్టెంట్’ చర్చి సాహిత్యం జనరంజకం అయింది. దాంతో అప్పట్లో ‘కేథలిక్’ చర్చి నేరుగా ఆయన కీర్తనలను తమ సాహిత్యంగా తీసుకొంది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 1969 లోనే నాయకత్వం వహించిన మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హోదాలో (1978- 80) ఆంధ్ర ప్రదేశ్ క్రైస్తవ మహాసభలకు ఒక ఏడాది ప్రత్యేక అతిధిగా హాజరై ‘ మీరు వీటిని ఏటా విజయవాడలో చేస్తున్నప్పటికీ వీటిని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ మహాసభలు అనడం బాగుంది’ అని వ్యాఖ్యానించినట్లు అప్పటి జ్ఞాపకాలను ‘సువార్త వాణి’ లో రికార్డింగ్ టెక్నీషియన్ గా పనిచేసిన డిక్సన్ భక్తవత్సలం చెప్పారు. అప్పట్లో ప్రతి పక్ష నాయకుడిగా డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ సభలకు ప్రత్యేక అతిధిగా రావడం వొక చరిత్ర. మన దేశంలో విదేశీ మిషనరీల సేవలకు చివరి కాలమది. “డా. సాల్మన్ రాజు ‘సువార్త వాణి’ డైరక్టర్ గా పనిచేస్తున్న కాలంలో విజయవాడ ‘ఆకాశవాణి’ - ‘సువార్తవాణి’ మధ్య ఎంతో సమన్వయం ఉండేది. మా నాన్నగారు ‘ఆకాశవాణి’ విజయవాడ స్టేషన్ డైరక్టర్ డా. బాలాంత్రపు రజనీ కాంతారావు గారికి డా. సాల్మన్ రాజు మధ్య ఆత్మీయ అనుబంధం ఉండేదని” వారి కుమారుడు బాలాంత్రపు హేమచంద్ర ఈ వ్యాస రచయిత వద్ద నలబై ఏళ్ల నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
(స్టూడియో టెక్నీషియన్ డిక్సన్ భక్తవత్సలం)
డిక్సన్ భక్తవత్సలం అప్పటి సంగతులు చెబుతూ... వొక పాలసీగా ‘సువార్త వాణి లో 70 శాతం సెక్యులర్ 30 శాతం క్రైస్తవం విషయంగా కార్యక్రమాలకు రూపకల్పన జరిగేదని తెలిపారు. అప్పట్లో అవి ‘ఆకాశవాణి’ కార్యక్రమాలకు సమాంతరంగా ఉండేవి. శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాల తిరుపతిలో ఐదేళ్ళ డిప్లమో కోర్సు చేసిన పి. విక్టర్ ‘సువార్త వాణి’ స్టేషన్ లో అప్పట్లో సంగీత దర్శకుడిగా పనిచేసేవారని... మల్లిక్, వోలేటి వెంకటేశ్వర్లు వంటి ‘ఆకాశవాణి’ ఆర్టిస్టులు అప్పట్లో మాతో కలిసి పనిచేసేవారు అంటూ సాల్మన్ రాజు కాలం నాటి సంగతులు జడ్సన్ భక్తవత్సలం తెలిపారు.
‘సువార్త వాణి’ మరో డైరెక్టర్ డా. రెవ. డి.వి.డానియెల్ కుమారుడు ఆంధ్ర లయోలా కాలేజి ఇంగ్లీష్ లెక్చరర్ ప్రవీణ్ దాసరి మాట్లాడుతూ “ఇటీవల కూడా మెడ్రాస్ రికార్డింగ్ స్టుడియోల వద్ద కలిసినప్పుడు సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం తన కెరియర్ తొలి దినాల్లో ‘సువార్త వాణి’ కోసం పాడిన పాటలను తన వద్ద గుర్తు చేసుకున్నారని” తెలిపారు. 70-80 దశకాల మధ్య సాల్మన్ రాజు రాసిన ‘కారు మొయిలు దారిలో....’ బాలు గాత్రంతో తెలుగునాట చిరపరిచితమైన గీతం! అయితే దీన్ని స్వర పరిచింది పెమ్మరాజు సూర్యారావు అంటారు ప్రవీణ్ దాసరి. సాల్మన్ రాజు రాసిన పాటలు 70 దశకంలో ఎస్.పి. బాలు, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి వంటి సినిమా గాయకుల గాత్రంతో గ్రామఫోన్ రికార్డులుగా తెలుగునాట జనరంజక మయ్యాయి.
(సాల్మాన్ రాజు బాతిక్ చిత్రాలు)
సాహిత్యం సంగీతంలోనే కాకుండా చిత్రలేఖనంలో కూడా అపార ప్రతిభా పాటవాలు ఉన్నడా. సాల్మన్ రాజు బాతిక్ శైలిలో వేసిన వర్ణ చిత్రాలు ఈ నాడు యురోపియన్ దేశాల్లోని ప్రధాన థియోలాజికల్ సేమినరీ గ్యాలరీలలో దర్శనం ఇస్తున్నాయి! బైబిల్ నేపధ్యంగా వేసిన చిత్రాలు ఒక పార్శ్వమైతే, దేశ జాతీయ సమస్యల పట్ల భారతీయ క్రైస్తవ సమాజం స్పందన రాజు చిత్రాల్లో ఉండేది. ఈ దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్టతల పట్ల భారతీయ క్రైస్తవ సమాజం సదా క్రీస్తు నేర్పిన ‘ప్రేమ’ ను కలిగివుంటుంది; అని వొకానొక తైల వర్ణ చిత్రం ద్వారా దేశ సరిహద్దుల మీద నిలబడి మరీ బహిరంగ ప్రకటన చేసినవాడు డా. సాల్మన్ రాజు.
(సాల్మాన్ రాజు బాతిక్ చిత్రాలు)
బంగ్లాదేశ్ శరణార్ధుల సమస్య మన దేశానికీ తలకు మించిన భారం అయినప్పుడు 1971 బంగ్లాదేశ్ శరణార్ధులను గాయపడిన జీసస్ అక్కున చేర్చుకున్న చిత్రాన్ని రూపొందించడం రాజు వసుధైక దృష్టికి తార్కాణం. దాని వొరిజినల్ ఇప్పటికీ ఢాకా నగరంలోని లూధరన్ చర్చి బిషప్ ఆపీస్ లో ఉందని విజయవాడలోని ఆ చర్చి పాస్టర్ రెవ. షాలెం రాజు చెప్పారు.
(బంగ్లాదేశ్ శరణార్ధులపై సాల్మాన్ రాజు వేసిన చిత్రం)
‘ది ఆక్స్ఫర్డ్ హ్యాండ్ బుక్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా’ గ్రంధంలో గ్రంధ రచయిత గుడ్రున్ లోనర్ డా. సల్మాన్ రాజు చిత్ర కళ గురించి చేసిన వ్యాఖ్య ఇది... “Still alive and creative is the Lutheran theologian and artist, Solomon Raj who uses batik and woodcuts, which use cheap materials that are readily available. He depicts Jesus amidst the refugees and suffering people. The favourite story is John 4, where he shows the liberative message of Jesus taking water from an untouchable woman, something which is still distant reality in South Indian villages, where the Dalits are not allowed to take water from the wells of others since they are considered polluting. ఇప్పుడు కూడా నివాళి సందర్భమై తప్పనిసరై ఇది చెప్పడం తప్ప, చెప్పుకోవాలని మాత్రం కాదు!