మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. తిరుగుబాటు ఎమ్మెల్యే సచిన్ పైలట్ ను రాజస్థాన్ పీసీసీ చీఫ్ గా తొలిగించారు. ఆయనను ఉపముఖ్యమంత్రి పదవి నుండి కూడా తొలగించారు. ఈ తొలగింపులు తరువాత కూడా సచిన్ పైలట్ ఎటువంటి వ్యాఖ్య చేయకుండా తాను ఇంకా కాంగ్రెస్ సభ్యుడినేనని అంటున్నారు. 

అశోక్ గేహలోట్ వర్గానికి మెజారిటీ ఉన్నప్పటికీ....సచిన్ పైలట్ పై అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఇప్పుడు అందరి మనసుల్లోనూ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఏదో ముఖ్యమంత్రి పదవి కావాలని అన్నాడు, అంతమాత్రాన ఎమ్మెల్యేగా కూడా అనర్హత వేటు వేయాల్సినంత తప్పు ఏమి చేసాడని అందరూ ప్రశ్నిస్తున్నారు. 

ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి, పార్టీకి రాజస్థాన్ లో అధికారం తెచ్చిపెట్టిన సచిన్ పైలట్ ని కాంగ్రెస్ ఈ విధంగా అణగదొక్కడం పాపం అని అంటున్నారు. ఈ అన్ని విషయాలపై ఒక పూర్తి అవగాహనకు వచ్చే ముందు రాజస్థాన్ రాజకీయాల్లో  సంఘటనలను అర్థం చేసుకుంటే...సచిన్ పైలట్ పై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఎందుకనుకుంటుంది, ఆయన ఎందుకు కోర్టుకెక్కాడు వంటి విషయాలు మనకు అర్థమవుతాయి. 

సచిన్ పైలట్ ఎప్పటినుండో కూడా బీజేపీతో టచ్ లో ఉన్నాడు అని ఆరోపణలు చేస్తున్నారు అశోక్ గెహెలోట్. నేరుగా చేయకున్నప్పటికీ... పరోక్షంగా బీజేపీ తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రణాళికలు రచిస్తుందని ఇప్పటికి రెండు మూడు సార్లు బహిరంగంగా ఆరోపించారు. 

ఆ తరువాత సెడిషన్ చట్టం కింద సచిన్ పైలట్ కి నోటీసులు పంపించారు అశోక్ గెహెలోట్.ఈ నోటీసులందడంతో మనస్తాపం చెందిన సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇక అది మొదలు కొద్దిసేపు తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని అన్నారు. ఆ తరువాత గేహలోట్ ప్రభుత్వం మైనారిటీలో ఉంది అని అన్నారు. 

ఏదో సీఎం మీద కోపంతో ఇలా అన్నాడు అని అనుకోవచ్చు. కానీ సచిన్ పైలట్ తన వర్గ ఎమ్మెల్యేలతో వచ్చింది ఎక్కడికో తెలుసా, హర్యానాలోని ఒక రిసార్ట్ కి. హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రం. హర్యానా రిసార్ట్ లో తన వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేస్తే, ఆ రిసార్ట్ బయట కరోనా క్వారంటైన్ సెంటర్ అని హర్యానా ప్రభుత్వం స్టిక్కర్ కూడా అంటించింది. 

ఇంతలోనే కాంగ్రెస్ ఆయనను పీసీసీ పదవి నుండి, ఉపముఖ్యమంత్రి పదవి నుండి తొలగించారు. ఇక ఆ తరువాత సచిన్ పైలట్ మాత్రం తాను బీజేపీలో చేరేది లేదని, తాను కాంగ్రెస్ వాదినని చెబుతున్నారు. 

బీజేపీ పాలిత రాష్ట్రంలో రిసార్ట్ లో క్యాంపు పెట్టడంతో... సచిన్ పైలట్ మాటను కాంగ్రెస్ అధిష్టానం విశ్వసించడంలేదు. అతను బీజేపీ సహకారంతోనే ఇదంతా నడుపుతున్నాడని నమ్ముతోంది. అందుకోసమే సచిన్ పైలట్ పై అనర్హత వేటు కూడా వేయాలని అనుకుంటుంది. 

ప్రస్తుతానికి అశోక్ గేహలోట్ కి 102 నుంచి 104 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. 200 సీట్లు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీలో అది మెజారిటీ మార్క్ అయినప్పటికీ.... సచిన్ పైలట్ గనుక బలపరీక్షనాటికి.... 30 మంది ఎమ్మెల్యేలతో గనుక వ్యతిరేకంగా ఓట్ వేయించగలిగితే గెహెలోట్ ప్రభుత్వం కూలిపోతుంది. 

ఎట్టిపరిస్థితుల్లోనూ పరిస్థితిని ఇక్కడిదాకా తీసుకురావడం ఇష్టం లేక, సచిన్ పైలట్ ని నమ్మలేక ఆయనను పార్టీ నుంచి తొలగించకుండా తెలివిగా అనర్హత వేటు వేయాలని స్పీకర్ ని కోరింది. కాంగ్రెస్ భయాన్ని నిజం చేస్తూ సచిన్ పైలట్ కేసులు ఏకంగా ఏజీ ముకుల్ రోహత్గి వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత లాయర్ ఈ కేసును వాదిస్తుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. 

సచిన్ పైలట్ మనసులో ఏముందో మాత్రం అతను బయటపెడితేనే తెలియాలి. సచిన్ మాత్రం అనర్హత నుండి తప్పించుకొని, తాను, తన వర్గ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోనే కొనసాగాలి అని అనుకుంటున్నట్టు తెలియవస్తుంది. ఇది ప్రస్తుతం వరకు ఉన్న అప్ డేట్. తదుపరి సచిన్ కార్యాచరణను మాత్రం ఇప్పుడే చెప్పలేము!