ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా, భిన్నమైన రాజకీయాలను చేస్తానని చెబుతూ... అధికారం తమ లక్ష్యం కాదు, ప్రజలకు సేవ చేయటం, ప్రజల తరుఫున పోరాడటమే తమ లక్ష్యమంటూ ముందుకు వచ్చిన పార్టీ జనసేన. 

దాని అధినేత  యాంగ్రీ యంగ్ మ్యాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సైతం ప్రజల తరుఫున పోరాటాలు చేసినప్పటికీ.... వాటిని ఓట్ల రూపంలోకి మలుచుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. 

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ దాని అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. 

అయినా కూడా తాము ప్రజాక్షేత్రంలోనే ఉంటామంటూ ప్రకటన చేసి అలానే కొనసాగుతూ ఉన్నారు. ఇసుక కొరతకు వ్యతిరేకంగా జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 

Also read: ముందు నుయ్యి వెనుక గొయ్యి... ఇది పవన్ పరిస్థితి

ఈ విషయాలన్నింటిని కాసేపు పక్కన పెడితే ..గత కొన్ని రోజులుగా జనసేన పార్టీలో అనూహ్యమైన మార్పులు మనకు కనబడుతున్నాయి. పార్టీలోని సీనియర్ నేతలు ఎందరో పార్టీని వీడి వెళుతున్నారు. అది పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరైన రాజు రవితేజ మొదలుకొని మాజీ సిబిఐ జేడీ లక్ష్మి నారాయణ వరకు ఇలా ఎందరో కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. 

ఇలా ఇంతమంది నాయకులు పార్టీని వీడుతుండడం, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా అంటి ముట్టనట్టు ఉంటూ అధికార పక్షానికి వంత పాడడం ఇవన్నీ పరిశీలిస్తే... ఇదేదో పార్టీ సిద్ధాంతాలను నచ్చక చేస్తున్న పనులు అనేకంటే పార్టీలోని కొందరి వైఖరి నచ్చక ఇలా చేస్తున్నారా అనే అనుమానం మాత్రం కలుగక మానదు. 

ఈ మధ్య కాలంలో గనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ వెంట ఎవరైనా వ్యక్తి కనబడుతున్నారంటే ఆయన కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే. పవన్ కళ్యాణ్ వెంట ఢిల్లీ నుండి గల్లీ దాకా ఆయన మాత్రమే కనబడుతున్నారు. 

ఈ పరిస్థితులను చూస్తుంటే మనకు చరిత్ర పునరావృతమవుతుందని ఎందుకు అంటారో మనకు ఇట్టే అర్థమయిపోతుంది.  1990వ దశకంలో అప్పటి తెలుగుదేశం పార్టీ, దాని అప్పటి అధినేత ఎన్టీఆర్, అప్పట్లో పార్టీలో చీలికకు కారణమైన లక్ష్మి పార్వతి ఉదంతాలు మనకు ఇప్పుడు మరోసారి దర్శనమిస్తాయి. 

ఇప్పుడు ఈ నాదెండ్ల మనోహర్ వ్యవహారమే పార్టీ నుంచి కీలక నేతలందరూ బయటకు వెళ్లిపోవడానికి కారణమని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను కలవాలన్న కూడా నాదెండ్ల వారు పర్మిషన్ ఇస్తే కానీ కలిసే వీలు లేనంతలా పార్టీని తన గుప్పిట్లో కి తెచ్చుకున్నాడు. 

ఆయన పెత్తనాన్ని భరించలేకనే పార్టీలో నుండి ఒక్కొక్కరు బయటకి వెళ్లిపోతున్నారనే వాదన జనసేన వర్గాల నుండే వినబడుతుంది.  ఇంత వరకు జనసేన అంటే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే గుర్తొచ్చేవాడు. 

అలా సింగల్ ఓనర్ ఇమేజ్ ను చెరిపేసుకొని... పార్టీ అంటే ఎవరో ఒక్కరిద్దరి సొత్తు కాదు అని నిరూపించాల్సింది పోయి ఇప్పుడు మరో నేతను తన పక్కన పెట్టుకొని ఇద్దరు ఓనర్లు అన్నట్టుగా వ్యవహరించడం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఘోరమైన రాజకీయ తప్పిదం అనడంలో ఎటువంటి సందేహం, సంశయం అవసరం లేదు.  

మాజీ ఎమ్మెల్యే ఆకుల నుంచి సిద్ధాంతకర్తల్లో ఒకరైన రాజు రవితేజ, లక్ష్మి నారాయణ ఇలా ఎందరో నేతలు బయటకు వెళుతూ జనసేనపై తీవ్ర విమర్శలు చేస్తున్నవారే. వారు బయటకు పవన్ కళ్యాణ్ చంచలత్వం గురించి, మారిన సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నప్పటికీ, అసలు కారణం మాత్రం నాదెండ్ల మనోహర్ వైఖరి అనేది సుస్పష్టం. 

చూడడానికి సౌమ్యంగా, పవన్ కళ్యాణ్ కి ఆంతరంగిక సలహాదారుగా కనిపిస్తున్న నాదెండ్ల మనోహర్ ఇంతలా ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ పార్టీని శాసిస్తున్నాడా అనే అనుమానం వచ్చినా, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే అది నిజమే అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. 

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడుతూ గత కొన్ని నెలలుగా బిజీగా ఉంటున్నాడు. ఆయన బిజీగా ఉండడం వల్ల పార్టీ కార్యక్రమాలన్నిటిని నాదెండ్లనే చూసుకుంటున్నారు. అలా ఒక రకంగా పార్టీనంతా ఆయన చెప్పు చేతుల్లోకి తీసుకున్నట్టు సమాచారం. 

ఇలా పార్టీ పై ఆధిపత్యం చెలాయిస్తున్న నాదెండ్ల మనోహర్ ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని కూడా పార్టీకి దూరంగా పెట్టారని జనసేన వర్గాల భోగట్టా. ఇదే విషయాన్నీ తన సన్నిహితుల వద్ద కూడా రాపాక ప్రస్తావించారట. 

బహుశా నాదెండ్లను అభద్రతా భావం అలుముకున్నట్టుంది. ఒకవేళ రాపాక మీటింగులకు, పార్టీ కార్యకలాపాలకు గనుక హాజరయితే... తనకంటే ఎక్కడ ఎక్కువ ప్రాముఖ్యత రాపాకకు దక్కుతుందో అని ఆయన భయపడుతూ ఉండొచ్చు. 

ఇక సిబిఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ కూడా పార్టీ నుంచి వెళ్లిపోవడానికి పవన్ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కారణమని చెప్పినప్పటికీ.... పార్టీలో తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కడంలేదని ఆయన భావించి ఉండొచ్చు. 

Also read; ఎన్టీఆర్ ఇమేజ్ కోసం కేజ్రీవాల్ పాకులాట.... జాతీయ రాజకీయాలకు వేసేనా బాట?

పవన్ ఢిల్లీ పర్యటనలో కూడా లక్ష్మీనారాయణను భాగస్వామిగా చేయలేదు. కనీసం ఆయనను పార్టీలో అంతర్గతంగా బీజేపీతో పొత్తు విషయమై జరిగిన చర్చలకు కూడా ఆహ్వానించలేదని సమాచారం. 

మామూలుగానే జనసేన అధినేత తీసుకునే ఏ నిర్ణయం కూడా పార్టీలో చర్చించరు అనేది బహిరంగ రహస్యం. అలాంటిది ఇప్పుడు నాదెండ్ల మరింతగా పార్టీకి ఇతర నేతలను దూరం పెట్టడం పార్టీలోని ఈ అసంతృప్తికి కారణమని మనకు అవగతమవుతుంది. 

ఈ తతంగం అంతా చూస్తుంటే మనకు తెలుగు రాజకీయాల్లో అప్పటి టీడీపీ మనకు కళ్ళ ముందు మెదలాడుతుంది. అప్పట్లో ఎన్టీఆర్వద్ద చేరిన ఒక వ్యక్తి.... ఆ తరువాత పార్టీ పగ్గాలన్నీ తన చేతుల్లోకి తీసుకొని షాడో సీఎం గా కూడా వ్యవహరించిన విషయం అందరికీ సుపరిచితమే.  

సదరు వ్యక్తి పెత్తనం వల్ల అప్పట్లో టీడీపీ పార్టీ ఓటమిని చవిచూడడమే కాకుండా నిట్టనిలువునా చీలింది. కుటుంబం కూడా ఎన్టీఆర్ కు దూరం అయింది. జనసేనలో కూడా మనకు ఇప్పుడు అదే పరిస్థితి కనబడుతుంది. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్నా కూడా పార్టీ నేతలతో ఎక్కువ సంబంధాలను నెరుపుతున్నాడు నాదెండ్ల. ఆఖరికి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కూడా పక్కనపెడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. 

బీజేపీతో పొత్తు విషయమై కూడా ఎవ్వరినీ కలగచేసుకోనీయకుండా తాను మాత్రమే ఉన్నాడు. కనీసం ఆ పొత్తు విషయమై పవన్ కళ్యాణ్ అన్నకు కూడా  తెలిసుంటుందో లేదో కూడా డౌటే!. ఈ మధ్య కాలంలో నాగబాబు కూడా ఎక్కువగా పొలిటికల్ స్క్రీన్ మీద మనకు కనిపించడం లేద్. 

ఇలా ఈ విధంగా పార్టీలో ఎక్కువగా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ.... అధినేతను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నట్టుగా గనుక ఇంకొద్ది కాలం పార్టీ వ్యవహారం సాగితే... పార్టీని మరింతమంది వీడే ఆస్కారం లేకపోలేదు. 

బీజేపీతో పొత్తుకూడా ఇప్పుడు సంకటస్థితిని ఎదుర్కుంటున్నవేళ, అమరావతి కార్యాచరణను పవన్ పూర్తిగా అమలుచేయలేక ఇబ్బందులుపడుతున్నవేళ మరిన్ని వేళ్ళు మాత్రం అధినేత పవన్ వైపు అందుకు కారకుడిగా అందరూ ఊహిస్తున్న నాదెండ్ల మనోహరువైపు చూపెట్టడం తథ్యంగా కనబడుతుంది.