నగర జీవనంలో ప్రశాంత చిత్తంతో, ఒకానొక అలోకిక అనుభూతి పొందాలంటే కళాకృతి ఆర్ట్ కేఫ్ లో ప్రదర్శితమైన మోషే డాయన్ చిత్రకళా ప్రదర్శన తప్పకచూడాలిఇంకా నాలుగు రోజులే ఉంది మరి.

నగర జీవనంలో ప్రశాంత చిత్తంతో, ఒకానొక అలోకిక అనుభూతి పొందాలంటే కళాకృతి ఆర్ట్ కేఫ్ లో ప్రదర్శితమైన మోషే డాయన్ చిత్రకళా ప్రదర్శన తప్పకచూడాలిఇంకా నాలుగు రోజులే ఉంది మరి.

దైనందిన జీవితమే అతడి వస్తువు. లౌకిక జీవన ఛాయలే అతడి ఇతివృత్తం. కానీ అలౌకిక అనుభవాణ్ని, అనుభూతిని పంచడం మోషే డాయన్  ప్రత్యేకత. అతడి చిత్రాలు చూసి వచ్చినాక కూడా అవి తిరిగి తిరిగి అనుభవంలోకి వచ్చి మనల్ని ఆనందింప చేస్తాయి. అందుకు కారణం చిత్రకారుడేనా లేక ఆ చిత్ర జగత్తు కూడా అతడి కుంచెను ఎంచుకున్నదా అనిపిస్తుంది, తరిచి చూస్తే.

తరచి  చూస్తే కొన్ని ప్రశ్నలు. మోషే డాయన్ చిత్రించిన నీటి వర్ణ చిత్రాలు ఎందుకు లౌకిక జీవితం పరిధిని దాటుతున్నాయి? అవి ఆహ్లాదాన్ని పంచడమే గాక మనలో ఎందుకు ఒక రససిద్ధిని ఉద్దీపనం చేస్తున్నాయి? ఆ కళాకారుడు వివిధ వస్తువులను దైనందిన జీవితం నుంచి గైకొని వేసినప్పటికీ, అవి అన్నీనూ వెలుగు నీడల మార్మిక ఛాయలే ప్రధానంగా ప్రతిఫలిస్తున్నప్పటికీనూ ఎందుకని మనసును దోచుకుంటున్నాయి? అంతకి మించి హృదయానికి శాంతిని సైతం పంచుతున్నాయి?

ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక విశేషం చెప్పవలసే ఉన్నది. అదే బహుశా అతడి ‘ఆత్మ’ లేదంటే ‘కాస్మిక్ ట్రాన్స్’ కాబోలు.  

అతడు చిత్రించిన ప్రతి చిత్రం దేనికదే ఒక చిత్రంగా కాకుండా చిత్రభరితమైన విశ్వంలోని పంచభూతాల మూర్తిమత్వాన్ని ఒక్కొక్కటీ సూక్ష్మస్థాయిలో ఇముడ్చుకోవడం వలన ఇలా అనాలీ అనిపిస్తున్నది.

భూమి, ఆకాశం, వాయువు, జలమూ, అగ్ని, వీటన్నిటి ఆయా చిత్రాలు నిక్షిప్తం చేసుకువడం వల్లే అవి మనల్ని సప్త వర్ణాల్లో రంజింప చేస్తున్నాయేమో అనీ అనిపిస్తుంది.

పంచ మహాభూతాలు, వాటి తాలూకు సంగీతం -సాహిత్యం, శబ్దం- నిశబ్ధం – ఇతడి లలిత కళలో తారాడుతున్నట్లే గోచరిస్తున్నది.

పృథ్వివలే స్థీరమూ, గగనం వలే విశాలమూ ఐనట్లు, వాయువు వలే చలనం, జలము మాదిరి జీవము కదిలినట్లు, అగ్వివలె ఆరని జ్వాల కలగలసి, అవే వర్ణాలుగా ఒకానొక స్వప్నమూ చేతనా జీవకళగా ఆవిష్కృతం కావడం ఏదో ఇక్కడ ఉన్నదని నిచ్చయం.

ప్రకృతి ఒక శంఖం వలే ఆకృతి దాల్చి వినిపించే గానం అక్కడ ఒక కృతిగా ఉన్నట్టు ఉన్నది.

చూడగా చూడగా పంచభూతాలు రమించినట్లు, ప్రతి అణువూ తరించినట్లు, సృష్టి, స్థితి, లయ అంతా ఇంద్రచాపంగా విరిసినట్లు, అది అంతమూ ఎరగని అనాది జీవన లాస్యం వాటిల్లో సాంద్రమై ఉన్నట్టుగా గోచరిస్తున్నది.

చిత్రమేమిటంటే, ఒక్కో చిత్రంలో స్థాయి బేధాలు లేవు. ఒక దానిలో ఉన్నది ఒక ఛాయ వాలా కావొచ్చు, మరోదానిలో ఒక ఇళయరాజా కనిపించవచ్చు లేదా ఒక మామూలు వనిత కావొచ్చు, మరో ఆదివాసీ కావొచ్చు, ఒక సమ్మోహన సౌందర్య రాగాలీనం నర్తనం చేస్తున్నట్టే ఉంటుంది. విస్మయం చెందడం ఒక అందమైన అనుభవం. 

AND TRANCE EVERYWHERE పేరిట ఏర్పాటైన మోషే డాయన్ చిత్రకళా ప్రదర్శన ఈ నెల 21 వరకే ఉంటుందని గమనించాలి. అన్నట్టు, కళాకృతి ‘The Gallery café’ రోడ్డు నంబర్ 10, బంజారాహిల్స్ లో ఉంటుంది.