బ్యాంక్ లాకర్ కీ పోయిందా? ఇలా చేస్తే మీ విలువైన వస్తువులు సేఫ్
విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుకోవడానికి బ్యాంకుల్లో లాకర్లు తీసుకుంటాం. మరి ఆ లాకర్ కీ పోతే ఏం చేయాలి? బ్యాంకుని ఎలా సంప్రదించాలి? లాకర్‌ను ఎలా తిరిగి పొందాలి. దానికి ఎంత ఖర్చవుతుంది. ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
విలువైన వస్తువులు, ముఖ్యమైన డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకోవడానికి బ్యాంక్ లాకర్లు చాలా ఉపయోగపడతాయి. లాకర్ తీసుకున్నప్పుడు బ్యాంకులు కస్టమర్‌కి మాత్రమే యాక్సెస్ ఉండేలా ఒక కీ ఇస్తాయి. అయితే పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల బ్యాంక్ లాకర్ కీ కనిపించక పోవచ్చు. లేదా ఎక్కడైనా పడిపోయి ఉంటుంది. మీ బ్యాంకు లాకర్ కీ పోతే ఏం చేయాలో మీకు తెలుసా? కీ పోయిన వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి.
బ్యాంకు లాకర్ కీ మీ విలువైన వస్తువులకు భద్రత ఇస్తూనే మీకెంతో భరోసాను అందిస్తుంది. విలువైన వస్తువులన్నీ లాకర్ ఉన్నాయంటే భయం లేకుండా నిద్రపోవచ్చు. అయితే ఒక్క సారి ఆ కీ పోతే వస్తువులు పోయినట్లుగా భయమేస్తుంది. ఒక వేళ ఇలా జరిగితే ఆందోళన చెందకుండా ముందు మీకు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మిస్ అయిన కీ కోసం FIR దాఖలు చేయండి. మీ లాకర్‌ను తిరిగి పొందడానికి బ్యాంకుకు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం చాలా ముఖ్యం. మీ దగ్గర డూప్లికేట్ కీ ఉంటే బ్యాంక్ మీ ఐడెంటిటీని ధృవీకరించిన తర్వాత దాన్ని అందిస్తుంది.
ఒకవేళ డూప్లికేట్ కీ లేకపోతే బ్యాంక్ లాకర్‌ను బద్దలు కొడుతుంది. అందులోని వస్తువులను కొత్త లాకర్‌కి బదిలీ చేస్తారు. మీకు కొత్త కీ ఇస్తారు. అయితే లాకర్ బద్దలు కొట్టడానికి రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు మీరు భరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కస్టమర్, బ్యాంక్ ప్రతినిధి ఇద్దరి సమక్షంలో జరుగుతుంది. జాయింట్ అకౌంట్ ఉన్న లాకర్లకు, అన్ని అకౌంట్ హోల్డర్లు ఉండాలి.
ఒకవేళ బ్యాంకు లాకర్ ఉన్న కస్టమర్ అందుబాటులో లేకపోతే లాకర్ పగలకొట్టడానికి అతను తన తరఫున ఎవరైన ఒకరిని పంపవచ్చు. ఈ మేరకు ఈ విషయాన్ని వివరిస్తూ బ్యాంకు అనుమతి కోరుతూ లెటర్ రాయాల్సి ఉంటుంది.
SBI, ఇతర బ్యాంకుల విధానాల ప్రకారం కస్టమర్ వరుసగా మూడు సంవత్సరాలు లాకర్ అద్దె చెల్లించకపోతే, బ్యాంక్ బకాయిలు వసూలు చేయడానికి లాకర్‌ను బద్దలు కొట్టే అధికారం ఆ బ్యాంకులకు ఉంటుంది. లాకర్ ఏడు సంవత్సరాలుగా ఉపయోగంలో లేకపోయినా బ్యాంక్ లాకర్‌ను తెరవవచ్చు. దీనికి అకౌంట్ హోల్డర్ బ్యాంకుకు రాలేకపోయినా బ్యాంకు లాకర్ ఓపెన్ చేస్తుంది.
క్రిమినల్ కేసుల విషయంలో లాకర్‌లో ఆధారాలు ఉన్నాయని అనుమానిస్తే కస్టమర్ లేకుండానే బ్యాంక్ దాన్ని బద్దలు కొట్టే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఈ పనిని బ్యాంకు చట్టానికి సంబంధించిన సంస్థలతో కలిసి చేస్తుంది.
లాకర్ కీ పోవడం చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ సమాచారం తెలుసుకొని వెంటనే చర్య తీసుకోవడం వల్ల మీ విలువైన వస్తువుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమస్యలు రాకుండా మీ లాకర్‌ను యాక్సెస్ చేయడానికి ఎల్లప్పుడూ బ్యాంక్ విధానాలను పాటించండి.