ఐసిసికి బిసీసీఐ 'సూపర్'టోకరా: గంగూలీ గురి ఎవరిపైన...?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నాన్ ఐసీసీ టోర్నీమెంట్ల నిషేధాన్ని బీసీసీఐ బహిరంగంగానే తుంగలో తొక్కేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఐసీసీ నాన్ ఐసీసీ టోర్నీల విధానం ప్రకారం ఆసియా కప్ మినహా నాలుగు, అంతకంటే ఎక్కువ జట్లతో కూడిన టోర్నీలపై నిషేధం ఉంది. ఐసీసీ సభ్యుల ప్రాతినిథ్య ఒప్పందంలో ఇది స్పష్టంగా ఉంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో అధికారం, ఆదాయ వాటా భారీ స్థాయిలో కోల్పోయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తిరిగి వాటిని దక్కించుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నాన్ ఐసీసీ టోర్నీమెంట్ల నిషేధాన్ని బీసీసీఐ బహిరంగంగానే తుంగలో తొక్కేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఐసీసీ నాన్ ఐసీసీ టోర్నీల విధానం ప్రకారం ఆసియా కప్ మినహా నాలుగు, అంతకంటే ఎక్కువ జట్లతో కూడిన టోర్నీలపై నిషేధం ఉంది. ఐసీసీ సభ్యుల ప్రాతినిథ్య ఒప్పందంలో ఇది స్పష్టంగా ఉంది.
ఈ నిబంధనలను అతిక్రమిస్తే ఆ బోర్డుపై ఐసీసీ నిషేధం సైతం విధించవచ్చు. అయినప్పటికీ క్రికెట్ అగ్రదేశాలు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సహా మరో జట్టుతో కూడిన సూపర్ సిరీస్ టోర్నీకి బీసీసీఐ శ్రీకారం చుడుతోంది. 2021 నుంచి రొటేషన్ విధానంలో ప్రతి ఏడాది సూపర్ సిరీస్‌కు సన్నాహాం సిద్ధం చేస్తోంది.
ఇతర క్రికెటింగ్ దేశాల వ్యతిరేకత :
ఎన్. శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఐసీసీకి అత్యధిక ఆదాయం అందిస్తోన్న దేశాలకు దాని ఆదాయ పంపిణీలోనూ సింహభాగం వాటా దక్కాలని బిగ్ త్రీ ఫార్ములా తీసుకొచ్చాడు శ్రీని.
Also read: స్పోర్ట్స్ పాలసీని తేల్చాల్సింది ప్రభుత్వం...కోర్టులు కాదు: క్రీడా మంత్రి
బిగ్ త్రీ విధానంలో ఐసీసీ ఆదాయంలో భారత్ భారీ వాటా దక్కించుకోగా.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు తమ వంతు సొమ్మును సొంతం చేసుకున్నాయి. ఈ విధానంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను అభివృద్ది చేయాలనే ఆలోచనకు అడ్డంకి ఏర్పడుతుందని, క్రికెట్‌కు మార్కెట్ లేని దేశాల్లో క్రీడాభివృద్ధి కష్టతరమని భావించింది ఐసీసీ.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఐసీసీ పీఠం ఎక్కగానే తానే స్వయంగా బిగ్ త్రీ సంస్కరణలను రద్దు చేశాడు. ఐసీసీ సభ్య దేశాలకు దాని ఆదాయంలో సమాన హక్కు దక్కాలని కొత్త రాజ్యాంగం అమలు చేశాడు.
బీసీసీఐలో పాలకుల కమిటీ పాలన నడుస్తుండటం, ఐసీసీలో ఓ బీసీసీఐ మాజీ బాసే స్వయంగా భారత ప్రయోజనాలకు తిలోదకాలు ఇస్తుండటంతో భారత క్రికెట్ బోర్డు ఏం చేయలేని దుస్థితిలో ఉండిపోయింది.
సంస్కరణల సమయం ముగిసిన తర్వాత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఐసీసీలో బీసీసీఐ అధికారం తిరిగి సాధించేందుకు గంగూలీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే అగ్ర జట్లు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో కూడిన సూపర్ సిరీస్‌కు అంకురార్పణ చేస్తున్నాడు.
ప్రపంచ క్రికెట్‌లో విశేష ఆదరణ, ఆకర్షణ శక్తి కలిగిన నాలుగు జట్లు ప్రతి ఏడాది ఓ టోర్నీలో తలపడితే ఐసీసీ మెగా ఈవెంట్లకు విలువ తగ్గుతుందని ఐసీసీ భయపడుతోంది. సూపర్ సిరీస్ సక్సెస్ సాధిస్తే ఐసీసీ మెగా ఈవెంట్ల ప్రసార హక్కులను మించిన రేటుకు నాలుగు దేశాల టోర్నీ ప్రసార హక్కుల కాంట్రాక్టు అమ్ముడవుతుంది.
రెండు వారాల నిడివితో కూడిన టోర్నీ కావటంతో మార్కెట్ వర్గాలు సూపర్ సిరీస్‌పై ఎక్కువ దృష్టి పెడతాయి. నాలుగు అగ్ర జట్లే కావటంతో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగానే సాగుతుందనటంలో సందేహం లేదు.
Also read: బుమ్రా ఫిట్నెస్ వివాదం...నా జోక్యం తప్పనిసరి: గంగూలీ
సూపర్ సిరీస్ ఆచరణలోకి వస్తే ఐసీసీ టోర్నీల ప్రణాళిక ప్రమాదంలో పడుతుందని సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తిగా నిండిపోయిందని, కొత్తగా సూపర్ సిరీస్‌కు స్థానం లేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
దాదా గురి ఎవరిపైన...?
బీసీసీఐ కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్‌తో కలిసి సౌరభ్ గంగూలీ ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇంగ్లాండ్ టూర్‌లో బీసీసీఐ సభ్యులు ఐసీసీ అధికారులతో, ఈసీబీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. జనవరిలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నతాధికారులతోనూ సమావేశానికి ఎజెండా సిద్ధం చేశారు.
ఈ క్రమంలోనే ఓ బెంగాలీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ సూపర్ సిరీస్ ప్రతిపాదనపై నోరు విప్పాడు. సూపర్ సిరీస్ ప్రతిపాదనపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత రావటంతో దాదా స్వరంలో స్పష్టమైన మార్పు కనిపించింది. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కచ్చితంగా సూపర్ సిరీస్ టోర్నీ జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేసిన దాదా తాజాగా భిన్న స్వరం వినిపించాడు.
ఇంకా ఏ విషయం ధ్రువీకరణకు రాలేదని, ఏ విషయంపై కూడా స్పష్టత రాలేదని గంగూలీ ఓ ఆంగ్ల పత్రికతో అన్నాడు. ఇదిలా ఉండగా గంగూలీ సూపర్ సిరీస్ ప్రతిపాదన ఆదాయ ఆర్జన, సూపర్ క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉద్దేశించినదా? లేదా ఐసీసీపై నేరుగా బాణం ఎక్కుపెట్టేందుకు ఉద్దేశించిందా? అనేది మాత్రం అర్థం కాకుండా మిగిలిపోతుంది.
నిజానికి భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో కూడిన ముక్కోణపు వన్డే సిరీస్/ టోర్నీ నిర్వహణకు బీసీసీఐకి ఎటువంటి అడ్డంకి లేదు. ఇప్పటికే పలు దేశాల బోర్డులు ముక్కోణపు టోర్నీలు నిర్వహిస్తున్నాయి.
అగ్ర దేశాలు ఆడుతున్న రెగ్యులర్ ముక్కోణపు వన్డే టోర్నీకి మార్కెట్‌లో డిమాండ్ సైతం ఏమాత్రం తగ్గే అవకాశం లేదు. అయినా, ఐసీసీ నిబంధనలతో తలపడే విధంగా నాలుగు దేశాలతో కూడిన వన్డే టోర్నీకి గంగూలీ ప్రతిపాదన చేయటంలో ఆంతర్యం మాత్రం అంతుచిక్కడం లేదు.