Asianet News TeluguAsianet News Telugu

బెన్ స్టోక్స్ లక్కీ: అంపైరింగ్ తప్పిదాలకు చెక్ లేదా...

మొన్నటి యాషెస్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము. గత యాషెస్ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ ఒంటిచేత్తో ఇంగ్లాండ్ ని గెలిపించాడు. స్టోక్స్ వాస్తవానికి వికెట్ల ముందు దొరికిపోయినా అంపైరింగ్ తప్పిదం వల్ల ఆస్ట్రేలియా మ్యాచ్ ను కోల్పోవలిసి వచ్చింది. 

Ashes series: Umpiring errors changing the result of matches
Author
Hyderabad, First Published Aug 28, 2019, 10:52 AM IST

వివాదాస్పద నిర్ణయం కారణంగా, ఏదైనా పెద్ద టోర్నీ ఫలితం డిసైడ్ అయితే ఆ టీములు, వారి అభిమానులు పడే బాధ వర్ణనాతీతం. ప్రపంచ కప్ ఫైనల్లో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయం కారణంగానే ఇంగ్లాండ్ ట్రోఫీ ఎగరెసుకుపోగా న్యూజిలాండ్ రిక్త హస్తాలతో వెనక్కి వెళ్ళింది. యాషెస్ సిరీస్ ఆరంభం నుండి కూడా మనం ఇలాంటి తప్పుడు నిర్ణయాలెన్నింటినో చూసాం. ఈ తప్పులను అంపైర్ కావాలని చేశాడా అంటే కాదు. మరి ఎందుకు తరచూ ఇలాంటి గందరగోళాలు తలెత్తుతున్నాయి? వీటిని అరికట్టడానికి ఏమేం చర్యలు తీసుకుంటే బాగుంటుందో చూద్దాం. 

మొదటగా అంపైరింగ్ విషయానికి వస్తే, అది చాలా కష్టమైన పని. చాలా ఒత్తిడిలో వారు తమ నిర్ణయాలను తీసుకోవలిసి ఉంటుంది. ఒకవేళ గనుక తప్పుడు నిర్ణయం వల్ల ఏదైనా టీం గెలుపోటములు తారుమారైతే, ఓడిన టీం అభిమానులు అంపైర్ పక్షపాతం చూపించాడని అనడానికి కూడా వెనుకాడరు. అలాంటి ఎన్నో వివాదాస్పద నిర్ణయాలను గతంలో అంపైర్ లు తీసుకున్నారు కూడా. అందుకోసమే ఐసీసీ న్యూట్రల్ అంపైర్ అనే కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చింది. రెండు దేశాలు ఆడుతున్నప్పుడు తటస్థ దేశానికి చెందిన అంపైర్ ను నియమించడం ద్వారా అంపైర్లపైన పెరుగుతున్న ఆరోపణలకు అడ్డుకట్ట వేసింది ఐసీసీ. 

అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఇలా న్యూట్రల్ అంపైర్లను ఎంపిక చేయవలిసి వచ్చింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో ఈ న్యూట్రల్ అంపైరింగ్ కొత్త సమస్యలను తెచ్చి పెడుతోంది. వరల్డ్ కప్ లో ఎన్ని తప్పిదాలు జరిగాయో మనం చూసాం. యాషెస్ సిరీస్ లో తొలి రెండు రోజుల్లోనే దాదాపుగా పది తప్పుడు నిర్ణయాలను తీసుకున్నారు అంపైర్లు. ఈ నిర్ణయాలు వారేదో పక్షపాతంతో తీసుకున్నవి కావు. పిచ్ ల పైన సరైన అవగాహన లేక, బంతి గమనాన్ని అంచనా వేయలేక జరిగిన పొరపాట్లు. తెలిసి చేసినా తెలీక చేసినా ఏదో ఒక టీం నష్టపోతుంది.వారి అభిమానుల గుండెలు పగులుతూనే ఉన్నాయి.  

ఇప్పుడు టెక్నాలజీ విస్తృతంగా వ్యాప్తి చెందింది. హాక్ ఐ టెక్నాలజీ నుంచి బాల్ ట్రాకింగ్ వరకు వివిధ సాంకేతిక విధానాలతో ఆటను వేయి కళ్ళతో అందరూ గమనిస్తున్నారు. ఇంతకుమునుపులా అంపైర్లు కావాలని పక్షపాతంగా వ్యవహరించే ఆస్కారం దాదాపుగా లేదు. కాబట్టి న్యూట్రల్ అంపైర్ల కన్నా ఆ లోకల్ కండిషన్స్ పైన పట్టున్న బెస్ట్ అంపైర్ ని నియమిస్తే ఇంకా బాగుంటుంది. ఇలా అనడానికి కారణం లేకపోలేదు. 

ఉదాహరణకు ఉపఖండం పిచ్ లను తీసుకుందాం. ఇక్కడ బాల్ అంతగా బౌన్స్ అవ్వదు. 15 ఓవర్ల తరువాత బాల్ స్వింగ్ అవ్వదు, బంతి సైడ్ వే మూమెంటే ఉండదు. లో బౌన్స్ ఉంటుంది. ఇక్కడ స్లిప్ క్యాచుల మీద కన్నా బ్యాట్ ప్యాడ్ కి టచ్ అయ్యిందా లేదా అనేదానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. లో బౌన్స్ లో లెగ్ బిఫోర్ ని జడ్జ్ చేయాలంటే పిచ్ కండిషన్స్ పైన పూర్తి అవగాహన ఉండాలి. స్పిన్ బౌలింగ్ లో బాల్ ఇక్కడ కాస్త ఎక్కువ టర్న్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్ ను కరెక్ట్ గా అంచనా వేయాలంటే ఉపఖండం అంపైర్లయితేనే సరిపోతారు. వాళ్ళు ఎన్నో ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో అంపైరింగ్ చేసివున్న అనుభవం కారణంగా చాలా తేలిగ్గా, పర్ఫెక్ట్ గా నిర్ణయాలను తీసుకోగలుగుతారు.

ఈ పిచ్ కండిషన్స్ పట్ల అంతగా అవగాహన లేని ఏ ఆస్ట్రేలియాకు చెందిన అంపైర్లనో, ఇంగ్లాండ్ అంపైర్లనో తీసుకువస్తే వారు పొరపాటుపడే అవకాశం ఉంది. ఉపఖండానికి చెందిన అంపైర్లు కూడా బౌన్సీ పిచ్ కండిషన్ల పైన పొరపడే అవకాశాలు చాలా ఎక్కువ. అక్కడి పిచ్ ల పైన బాల్ అతిగా స్వింగ్ అవుతుంది. అక్కడ బ్యాట్ ప్యాడ్ డెసిషన్స్ కన్నా స్లిప్ క్యాచింగ్ పైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులను బాగా ఆకళింపు చేసుకున్న అక్కడి లోకల్ అంపైర్లయితేనే అక్కడ నిర్ణయాలను కరెక్ట్ గా తీసుకోగలుగుతారు. 

మానవ తప్పిదాలను ఎలా తగ్గించగలమో ఇంతసేపు మాట్లాడుకున్నాము. ఇదంతా బాగానే ఉంది. ఒకసారి మొన్నటి యాషెస్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము. గత యాషెస్ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ ఒంటిచేత్తో ఇంగ్లాండ్ ని గెలిపించాడు. స్టోక్స్ వాస్తవానికి వికెట్ల ముందు దొరికిపోయినా అంపైరింగ్ తప్పిదం వల్ల ఆస్ట్రేలియా మ్యాచ్ ను కోల్పోవలిసి వచ్చింది. వారు తమ రివ్యూలను అప్పటికే వాడేసుకొని ఉండడంతో వారు దాన్ని ఛాలెంజ్ చేయలేకపోయారు. ఇలాంటి సందర్భాల్లో టెక్నాలజీని మరింత మెరుగ్గా ఎలా ఉపయోగించుకొని మంచి ఫలితాలను రాబట్టుకోవచ్చో ఆలోచించాలి. 

ఫుట్ బాల్ లో గనుక తీసుకుంటే వి ఏ ఆర్  సిస్టం ఉంటుంది. వి ఏ ఆర్  అంటే వీడియో అసిస్టెంట్ రిఫరీ. ఈ విధానం బాగానే ఉంటుంది కానీ ప్రతి నిర్ణయాన్ని ఇలా చూస్తే ఒక వన్డే మ్యాచ్ ఒక రోజులో పూర్తవదు. ఫుట్ బాల్ అంటే కేవలం 90 నిముషాలు ఆడే ఆట కాబట్టి ఇలా ప్రతి నిర్ణయాన్ని చూసినా పెద్ద ఆలస్యం కాదు. అదే క్రికెట్ లో ఆలా కుదరదు. ఇంకో విషయం ఏమిటంటే క్రికెట్ లో అంపైర్ ఎప్పుడు కూడా ఆటను చాలా సునిశితంగా గమనిస్తాడు. ఫుట్ బాల్ మాదిరిగా బాల్ వెంట పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పద్దతిని మక్కి కి మక్కి క్రికెట్ కి ఆపాదించలేము. అయినా రివ్యూ తీసుకోవడమే చాలా తెలివిగా తీసుకోవాలి. ఒకవేళ బౌలింగ్ టీం గనుక ఛాలెంజ్ చేయాలంటే కీపర్, బౌలర్ల మధ్య సమన్వయం ఉండాలి. అప్పుడే వారు కెప్టెన్ ని ఒప్పించి రివ్యూ తీసుకోగలరు. ఈ నిర్ణయాన్ని తక్కువ టైములో తెలివిగా తీసుకోవాలి. ధోని ని చూడండి. అతని ఆక్యురసీ ఎంతలా ఉందంటే డెసిషన్ రివ్యూ సిస్టం ని ఇప్పుడు ముద్దుగా ధోని రివ్యూ సిస్టం అని పిలుచుకుంటున్నారు. 

ఉన్న విషయాన్ని అటుంచి, వినిపిస్తున్న ఒక కొత్త సలహాను చూద్దాం. కొత్తగా నడుస్తున్న చర్చేంటంటే ప్రతి టీం కి కూడా సిరీస్ ఆరంభంలోనే వారికి లభించే అన్ని రివ్యూస్ ని వారికి గంపగుత్తగా ఇచ్చేస్తే అవసరమనుకున్నప్పుడు వాడుకుంటారు. ఉదాహరణకు, 3 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ అనుకుంటే ప్రతి టీం కు మ్యాచ్ కు 4 చొప్పున ఒకే సారి 12 రివ్యూస్ ఇచ్చేస్తే, వారికవసరం అనుకున్నప్పుడు వారు వాడుకుంటారు. ఒక మ్యాచ్ లో మూడు వాడొచ్చు లేదా ఏమి వాడకపోవచ్చు కూడా. అది ఆ టీం ఇష్టం. ఇదేదో బాగానే ఉన్నట్టుంది కదూ. ఖచ్చితంగా మ్యాచ్ ఫలితాలను తేల్చే క్షణాల్లో ఇలాంటి రివ్యూలు చాలా ఉపయుక్తకరంగా ఉంటాయి. 

మొత్తంగా, అంపైరింగ్ నిర్ణయాల చుట్టూ ఇన్ని వివాదాలు సలహాలు సూచనలు వెల్లువెత్తుతున్న వేల ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం.

Follow Us:
Download App:
  • android
  • ios