రెండవదఫా విధించిన లాక్ డౌన్ కూడా ఎత్తివేత దశకు వస్తుంది. దేశమంతా మూడవ తారీఖుతో, రెండవదఫా విధించిన లాక్ డౌన్ ముగుస్తుండగా, తెలంగాణాలో మాత్రం అది మే 7వ తేదీతో ముగుస్తుంది. 

ఈ సారి కేంద్రం కూడా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ ని ఎత్తివేసేందుకు మొగ్గు చూపెడుతోంది. మనకు అందుతున్న సమాచారం మేరకు, కేంద్రం తీసుకుంటున్న చర్యలు చూసినా అదే అనిపిస్తుంది. 

ఈ నేపథ్యంలో రేపు కాకపోతే ఎల్లుండి లాక్ డౌన్ ను మాత్రం ఎత్తివేయటం తథ్యం. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత పరిస్థితి ఏమిటనే దానిపై మన తెలుగు రాష్ట్రాల వద్ద సమాధానం ఉన్నట్టుగా లేదు. 

ఆరోగ్య పరంగా సోషల్ డిస్టెంసింగ్ పాటించడం, మాస్కులు ధరించడం, ఇవన్నీ ఓకే. కానీ ఈ లాక్ డౌన్ ని ఎత్తివేసిన తరువాత ఆర్ధిక వ్యవస్థని ఎలా గాడిలో పెట్టాలి అనేదానిపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో సరైన ప్లాన్ ఉన్నట్టుగా అయితే కనబడడం లేదు. ఇప్పటివరకు లాక్ డౌన్ ఎగ్జిట్ కి సంబంధించి ఒక సమగ్ర ప్రణాలికను మన ఇరు తెలుగు రాష్ట్రాలు రూపొందించలేదు. 

రూపొందించకపోవడం పక్కనుంచితే... ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఆ దిశలో ఒక కమిటీని వేసిన దాఖలాలు కూడా లేవు. ప్రత్యేకమైన ఆర్ధిక నిపుణులను రంగంలోకి మాత్రం ఇంకా ధింపలేదు. 

ఉన్న ఐఏఎస్ లు, ఐపిఎస్ లతో కాలం నెట్టుకొస్తామంటే కష్టం. ఆ ఫీల్డ్ లో నిపుణుల సలహాలు తీసుకున్నప్పుడు మాత్రమే సరైన ఫలితాలు దక్కుతాయి. మొన్నీమధ్య కేంద్రం ఆర్ధిక రంగానికి బూస్ట్ కల్పించడానికి ఎం చేయాలనీ ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ అధికారులను అడిగితే... వారు ట్యాక్సులను విపరీతంగా పెంచమని ఒక అనాలోచిత తప్పుడు సలహాను ఇచ్చారు. 

ఆతరువాత దానిపై తీవ్ర స్థాయిలో దుమారం రేగడంతో.... అది అంతర్గత డాక్యుమెంట్ అని కేంద్రం దాన్ని కొట్టి పారేసింది. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు కూడా ఆర్థికవేత్తల సలహాలను తీసుకుంటున్నట్టో, వారిని నియమించుకున్నట్టొ అయితే కనబడడం లేదు. దాని గురించి ప్రత్యేకమైన కమిటీలను ఏర్పాటు చేసినట్టుకూడా ఎక్కడా వార్తలు రావడం లేదు. 

ఒకవేళ అంతర్గతంగా ఎవరినైనా నియమించి ఉన్నారో తెలియదు. ఒకవేళ నియమించినప్పటికీ వాటిని అలా బయటకు రానీయకుండా ఉంచడం సరికాదు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పడంతోపాటుగా, తీసుకుంటున్నట్టు ప్రజలకు కూడా కనబడాలి. 

అప్పుడు మాత్రమే ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం కలుగుతుంది. ముఖ్యమంత్రులు స్వయంగా ప్రెస్ మీట్లు ఈ కరోనా కాలంలో నిర్వహించడానికి ప్రధాన కారణం ప్రజలకు నమ్మకం కలిగించడానికే కదా!

మిగిలిన రాష్ట్రాలన్నీ ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఏకంగా మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో లాక్ డౌన్ తరువాత రాష్ట్ర ఆర్ధిక విధానాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుండగా, మహారాష్ట్ర హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ చైర్మన్ దీపక్ పరేఖ్ , ఆర్థికవేత్త అజిత్ రనాడే ఆధ్వర్యంలో లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటెజిని రూపకల్పన చేస్తున్నారు. 

పక్కనున్న కర్ణాటక తమిళనాడు, కేరళలు కూడా ఈ లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటెజిలను గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమాలోచనలు చేస్తున్నాయి. ఇలా అన్ని రాష్ట్రాలు ఎగ్జిట్ స్ట్రాటెజిలను తయారు చేసుకుంటుంటే.... మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కరోనా వైరస్ కేసుల మీదనే ఫోకస్ సరిపోతుంది. 

తెలంగాణ రాష్ట్రం పరిస్థితి నయం. ఒకింత మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రం, అన్ని కంపెనీలకు సంబంధించిన ముఖ్యకార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం అలా కాదు. 

లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం కాబట్టి అక్కడ ఈ లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది అత్యవసరం. లాక్ డౌన్ పొడిగింపునకే ఒప్పుకోని జగన్ సర్కార్, లాక్ డౌన్ ను ఎత్తివేయాలని కోరుతున్న వేళ....  ఇంకా ఒక ఎగ్జిట్ స్ట్రాటజీని రూపొందించకపోవడం, కనీసం ఆ దిశలో ఎటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేయకపోవడం నిజంగా శోచనీయం.