Asianet News TeluguAsianet News Telugu

మాటల మాంత్రికుడి నుంచి తిరుగులేని నేత దాకా...

2014 జూన్ 2 ఎన్నో ఆకాంక్షలకు ఊపిరిలూదుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ వేళ. భారతదేశ చరిత్రలో స్వాతంత్ర సంగ్రామంతోపాటుగా చెప్పుకోదగ్గ చరిత్ర తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటానిది. 

6 Years For Telangana: KCR The Visionary leader Behind The Success Of Newborn State
Author
Hyderabad, First Published Jun 2, 2020, 6:13 PM IST

2014 జూన్ 2 ఎన్నో ఆకాంక్షలకు ఊపిరిలూదుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ వేళ. భారతదేశ చరిత్రలో స్వాతంత్ర సంగ్రామంతోపాటుగా చెప్పుకోదగ్గ చరిత్ర తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటానిది. 

వలస పాలకుల పాలనలో మగ్గిపోతూ అన్ని విషయాల్లో అన్యాయాన్ని ఎదుర్కొంటు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన తెలంగాణ ప్రాంతం ఈ రోజు ప్రత్యేక రాష్ట్రంగా పురుడుపోసుకుంది. 

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడే ముందు వలసపాలకులు అనేక రకాలుగా భయపెట్టారు. నక్సలైట్ల సమస్య ఎక్కువవుతుందని బెదిరించడం దగ్గరి నుంచి తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకోలేదు అనే విషయం వరకు అనేక భయాల నడుమ పురుడుపోసుకున్న రాష్ట్రం. 

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాల మీద నిర్మితమైంది. తెలంగాణ రాష్ట్రానికి ఈ మూడు విషయాల్లో తీరని అన్యాయం జరిగింది. తెలంగాణకు ఎన్నో ప్రత్యేక రక్షణలను కల్పించినప్పటికీ.... వాటిని తుంగలో తొక్కుతో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు. 

ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుండేది. విద్యుత్ సమస్య నుంచి మొదలు వ్యవసాయం వరకు అనేక ఇబ్బందులు తెలంగాణను పట్టి పీడిస్తుండేవి. 

ఈ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసారు. ఆయన రాగానే తెలంగాణాలో విద్యుత్ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపారు. ఇంతకుముందు తెలంగాణలోని విద్యుత్ కోతలు సర్వసాధారణం. కానీ తెలంగాణ వచ్చిన సంవత్సర కాలానికే తెలంగాణలో విద్యుత్ కోతలు పూర్తిగా కనుమరుగయ్యాయి. 

ఇక ఆ తరువాత వ్యవసాయ రంగం మీద దృష్టిపెట్టిన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సమగ్ర మార్పులు కావాలంటే పొలాలకు నీరందించడమే మార్గమని భావించిన ప్రభుత్వం, ఆ దిశగా  వేసింది. సాగునీరుతోపాటుగా తాగునీరుకి కూడా ఒక బృహత్ ప్రణాలికను రచించారు కేసీఆర్. 

కృష్ణలో నీటి లభ్యత  తక్కువగా ఉండడం, గోదావరి తెలంగాణ కన్నా దిగువన ఉన్నప్పటికీ ఆ నీటిని ఎత్తిపోసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని కృత్య నిశ్చయానికి రావడంతో ఆ దిశగా పనులు మొదలుపెట్టారు.  

కాళేశ్వరంతోపాటుగా పాలమూరు రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని ఇతర ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది తెలంగాణ సర్కార్. ఆ దిశగా దృష్టి సారించింది, వాటిని నిర్మించింది ప్రభుత్వం. 

కాళేశ్వరం పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, హై కోర్టు కూడా కొన్ని విషయాల్లో తప్పుబట్టింది. కానీ ప్రస్తుతం పల్లెల్లో ఉన్న పచ్చదనం చూస్తే మాత్రం తెలంగాణాలో ఎప్పటికి చూడలేమేమో అనుకున్న ఒక దృశ్యం మన కళ్ళ ముందు సాక్షాత్కారం అయిందని మనసు సంతోషంతో గంతులేయడం తథ్యం.  

మిషన్ భగీరథ పేరుతో తాగునీరు కూడా అందించారు. తెలంగాణాలో మారుమూల పల్లెల్లో కూడా ఇప్పుడు తాగునీరు నల్లాలో రావడం నిజంగా అభినందనీయం. మిషన్ కాకతీయ పేరుతో తెలంగాణ వ్యవసాయానికి ఆయువుపట్టు అయిన చెరువులను, కుంటలను కూడా పునరుద్ధరించి గ్రామాల్లో నీటి లభ్యతను పెంపొందించడంతోపాటుగా భూగర్భ జలాలను కూడా పెరిగేలా చేయగలిగారు. 

తెలంగాణ మిగులు బడ్జెట్ తో అలరారుతున్న రాష్ట్రం. ప్రస్తుతానికి ఆర్ధిక లోటు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ప్రాజెక్టుల నిర్మాణం, అందునా భారీ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి సహాయం అందడం లేదు, ఈ నేపథ్యంలో తెలంగాణ అప్పుల ఊబిలో కొనసాగుతోంది. కానీ అదృష్టవశాత్హు తెలంగాణాలో పరిశ్రమల ఏర్పాటు ఇత్యాదులకు మంచి అవకాశాలు ఉండడం, సాఫ్ట్ వేర్ సంస్థలకు హబ్ గ ఉండడం తెలంగాణకు ఒకింత కలిసివచ్చే అంశాలు. 

ఇకపోతే నియామకాల విషయంలో మాత్రం తెలంగాణ సర్కార్ పై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక చిన్న చితకా ఉద్యోగాలను వేసింది ప్రభుత్వం. ప్రత్యేక విద్యార్హతలు అవసరం లేని గ్రూప్స్ ఎగ్జామ్స్ లో ఇప్పటివరకు ఒక్క గ్రూప్ 2, గ్రూప్ 4 ని మాత్రమే జరిపింది. అది కూడా తీవ్రమైన జాప్యం తరువాత. 

ఆరేండ్లు అవ్వొస్తున్న ఒక్క గ్రూప్ 1 పరీక్షా కూడా జరపకపోవడం తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో పోరాటం చేసిన విద్యార్థుల జీవితాలతో ఆదుకోవడం అనేది విద్యార్ధి లోకం వాదన. 

కొన్ని ప్లస్సులు కొన్ని మైనస్సులు తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇప్పుడు దేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. ఇప్పుడు దేశానికి ధాన్యాగారంగా కూడా నిలిచింది. నూతన ఒరవళ్లతో, సాంకేతికతను పుణికిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పుడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios