న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన ఒక చట్టంతో భారతీయులు హెచ్‌-1బీ వీసాలు పొందడం కష్టంగా మారింది. 2017 ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ‘బై అమెరికన్‌..హైర్‌ అమెరికన్‌’ (బీఏహెచ్‌ఏ) చట్టంపై సంతకం చేశారు. అమెరికా స్థానిక వ్యాపారాలను పెంచేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

ఫలితంగా రెండేళ్లలో భారతీయ కంపెనీలు పొందే హెచ్‌-1బీ వీసాల్లో  గతంతో పోలిస్తే చాలా తగ్గాయి. తొలి పది స్థానాల్లో ఉండే భారతీయ సంస్థలు 2016లో 51% వీసాలు పొందగా.. 2019కి వచ్చేనాటికి ఆ మొత్తం 24శాతానికి పడి పోయిందని అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ తెలిపింది.

also read అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని హత్య.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు

2016, 2017 సంవత్సరాల్లో హెచ్‌-1బీ వీసాలు పొందిన తొలి పది కంపెనీల్లో 5 భారత్‌కు చెందినవి ఉన్నాయి. 2019 నాటికి టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ మాత్రమే ఈ జాబితాలో ఉన్నట్లు యూఎస్సీఐఎస్‌ వెల్లడించింది. గతంలో ఏటా  85వేల వీసాలు మాత్రమే ఇచ్చేవారు.

కానీ కొత్త చట్టం వచ్చాక భారత ఐటీ సంస్థకు ఇచ్చే వీసాల సంఖ్యను మరింత కుదించారు. ఇక భారత్‌లోని టాప్‌-7 కంపెనీల వీసాల  వాటా కూడా 16 శాతానికి పడిపోయిందని నాస్కామ్‌ ప్రతినిధి శివేంద్ర సింగ్‌ తెలిపారు. భారతీయులకు జారీ చేసిన హెచ్‌-1బీ వీసాల్లో చాలా వరకు అమెరికా కంపెనీలు వెళ్లాయి, అతి తక్కువ మాత్రమే భారతీయ కంపెనీలకు వెళ్లాయి. అమెరికా కంపెనీలు దరఖాస్తు చేసిన వాటిల్లో 99శాతం వీసాలు వచ్చాయి. 

ట్రంప్‌ ప్రభుత్వం ముఖ్యంగా సేవా రంగ కంపెనీలనే లక్ష్యంగా చేసుకొని వీసా నిబంధనలను కఠినతరం చేశాయి. కస్టమర్‌ సైట్లలో పనిచేస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు వర్తించే నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ మొత్తం తతంగాన్ని వరుస మెమోలు, సూచనలు, సవరణ రూపంలో  అమల్లోకి తెచ్చింది. 

బీఏహెచ్‌ఏ చట్టాన్ని అమెరికాలో ఉద్యోగాలను పెంచేందుకు ఉద్దేశించి తీసుకొచ్చారు. పైగా జారీ చేసిన హెచ్‌-1బీ వీసాలను చట్టంలోని నిబంధనల ప్రకారం కేటాయించారో లేదో తెలుసుకొనేందుకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు, ఇతర ఏజెన్సీలు సాయం తీసుకొనే అవకాశం కూడా కల్పించారు. ఈ చట్టం  ఉద్యోగులు, యాజమాన్యాల మధ్య సంబంధంపై కూడా ప్రభావం చూపిస్తోంది. దీంతోపాటు ఇప్పటికే ఆమోదం పొందిన చాలా వీసాలు మళ్లీ తిరస్కరణకు గురైయ్యాయని ఇమ్మిగ్రేషన్‌ లాయర్లు వెల్లడించారు. 

ఇదిలా ఉంటే కుటుంబ ఆధారిత (ఫ్యామిలీ స్పాన్సర్డ్) గ్రీన్‌కార్డ్ కోసం అమెరికాలో దాదాపు 40 లక్షల మంది ఎదరుచూస్తున్నారు. వీరిలో భారతీయుల సంఖ్య 2.27 లక్షలకుపైనే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారిలో మెక్సికో 15 లక్షల మందితో మొదటిస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో, చైనా 1.18 లక్షలతో మూడో స్థానంలో ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం ఏటా 2.26 లక్షల గ్రీన్ కార్డులను మాత్రమే జారీ చేస్తున్నది. 

also read యుఎస్‌లో భారతీయ విద్యార్ధుల అరెస్ట్.. ఆందోళనలో తల్లిదండ్రులు

అమెరికా నిబంధనల ప్రకారం గ్రీన్‌కార్డు ఉన్నవారినే పౌరులుగా గుర్తిస్తారు. పౌరులు తమ రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకు గ్రీన్‌కార్డు కోసం స్పాన్సర్ చేయవచ్చు. వీటినే కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డులు అని పిలుస్తారు. ఈ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం గొలుసు వలస విధానంగా (చైన్ ఇమ్మిగ్రేషన్) అభివర్ణిస్తున్నది. ఈ కార్డులను నిషేధిస్తామని చెప్తున్నది. 

అయితే ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న 2.26 లక్షల మంది భారతీయుల్లో 1.81 లక్షల మంది తోబుట్టువులు కాగా, 2,500 మంది జీవిత భాగస్వాములు (భార్య/భర్త), పిల్లలు (మైనర్లు), 42 వేల మంది అమెరికా పౌరుల పిల్లల జీవిత భాగస్వాములు (కోడళ్లు/అల్లుళ్లు) ఉన్నారు. వీరిలో కొందరు దరఖాస్తు చేసుకొని దశాబ్దానికిపైగా ఎదురుచూస్తున్నారు.