అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి.. వీడియోలు వైరల్...
చికాగోలో ఓ హైదరాబాద్ విద్యార్థిపై నలుగురు దుండగులు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు.
హైదరాబాద్ : అమెరికాలో భారతీయ విద్యార్థుల మీద దాడులు ఆగడం లేదు. గతవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. తాజాగా చికాగోలో ఓ భారతీయ విద్యార్థి దొంగల దాడికి గురయ్యాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా.. సహాయం కోసం అర్థిస్తున్న వీడియో వైరల్ గా మారింది. నలుగురు దుండగులు అతనిని వెంటాడడం.. ఆ తరువాత రక్తం కారుతూ సహాయం కోసం అర్థించడానికి సంబంధించిన వీడియోలు వెలుగు చూశాయి.
ఈ ఘటన వైరల్ అవ్వడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న ఆయన కుటుంబసభ్యులు తీవ్రంగా కంగారు పడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన భార్య, తన పిల్లలతో భర్త దగ్గరికి వెళ్లేందుకు అనుమతించాలని యూఎస్ అధికారులకు లేఖ రాశారు. అతనికి సరైన చికిత్స అందేలా చూడాలని ఆయన భార్య సయ్యదా రుకులియా ఫాతిమా రిజ్వీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు.
ఆమె రాసిన లేఖలో.. "అమెరికాలోని చికాగోలో ఉన్న నా భర్త భద్రత గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందించడంతో సహాయం చేయండి. వీలైతే నేను నా ముగ్గురు మైనర్ పిల్లలతో కలిసి అమెరికాకు నా భర్త దగ్గరికి వెళ్లడానికి దయచేసి అవసరమైన ఏర్పాట్లు చేయండి’’ అనిరాసింది.
అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థి అనుమానాస్పదమృతి.. వారంలో మూడో ఘటన...
సయ్యద్ మజాహిర్ అలీ ఇండియానా వెస్లియన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ విద్యార్థి. ఆయనపై దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగు చూసింది. చికాగో ఇంటి సమీపంలో అతనిపై దాడి జరిగింది. దీనికి ముందు ముగ్గురు వ్యక్తులు అతనిని వెంబడిస్తున్నట్లు కనిపిస్తుంది.
దీనిమీద అలీ మాట్లాడుతూ.. "ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు నలుగురు వ్యక్తులు నాపై దాడి చేశారు. వారినుంచి పారిపోయే క్రమంలో కింద పడ్డాను. వెంటనే వాళ్లు నన్ను పట్టుకుని కొట్టారు. దయచేసి నాకు సహాయం చెయ్యండి బ్రో, దయచేసి నాకు సహాయం చెయ్యండి" అని అలీ వీడియోలో వేడుకోవడం కనిపిస్తుంది.
ఈ ఏడాది అమెరికాలో నలుగురు భారతీయ సంతతి విద్యార్థులు మృతి చెందారు. ఈ క్రమంలో అలీపై దాడి సంచలనం కలిగించింది. గత వారం అమెరికన్ పాస్‌పోర్ట్ ఉన్న 19 ఏళ్ల విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగర్ చనిపోయి కనిపించాడు. నీల్ ఆచార్య అనే మరో విద్యార్థి ఆ వారం ప్రారంభంలో పర్డ్యూ యూనివర్శిటీ క్యాంపస్‌లో చనిపోయి కనిపించాడు.
హర్యానాకు చెందిన 25 ఏళ్ల విద్యార్థి వివేక్ సైనీ జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో నిరాశ్రయుడైన వ్యక్తి కొట్టడంతో చనిపోయాడు. మరో భారతీయ విద్యార్థి అకుల్ ధావన్ జనవరిలో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ వెలుపల శవమై కనిపించాడు.