న్యూఢిల్లీ: సంక్షిప్త సందేశాల దిగ్గజం వాట్సాప్ నియంత్రణపై ఆ సంస్థకు, ప్రభుత్వానికి మధ్య సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యూజర్ల సందేశాలు ట్రేస్​కు బదులు వాట్సాప్​ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అంగీకరించలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

సందేశాలు, యూజర్ల సమాచారంపై నిఘా పెట్టాల్సిందేనని వాట్సాప్​ మాతృసంస్థ ఫేస్​బుక్​కు​ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిపాయి. ప్రభుత్వం సూచించినట్లు వాట్సాప్​ సందేశాల ట్రేసింగ్​​, సమాచార బదిలీ.. తమ వ్యవస్థ అందించే వ్యక్తిగత గోప్యత, ఎండ్-టూ-ఎండ్​ నిబంధనలకు విరుద్ధమని వాట్సాప్​ వాదిస్తోంది. 
మిగతా అన్ని విషయాలు ఓ కొలిక్కి వచ్చినా.. ట్రేసబులిటీ విషయంలో అటు ప్రభుత్వం, ఇటు వాట్సాప్​ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయాలపై చర్చ..కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​తో.. వాట్సాప్​ ఉపాధ్యక్షుడు నిక్​ క్లేగ్​ గత వారం సమావేశమయ్యారు. సందేశాల ట్రేసబులిటీకి బదులు ఉన్న పలు ప్రత్యామ్నాయాలపై చర్చించారు.

ఇందులో 'మెటాడేటా', మెషిన్​ ఇంటెలిజెన్స్​ వంటి పత్యామ్నాయాలను ప్రతిపాదించారు నిక్. ముఖ్యంగా వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​లకు ప్రతిక్రియ సంబంధిత నియంత్రణను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. 

నకిలీ వార్తల వ్యాప్తి సహా.. అనధికారిక డేటా బదిలీ, వ్యక్తిగత గోప్యత, భధ్రత వంటి విషయాల్లో అవకతవకల కారణంగా సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆగ్రహించింది. ఇందుకోసం చట్టాలకు లోబడి వ్యవస్థలను దృఢపరుచుకోవాలని.. తమకు జవాబుదారీగా వ్యవహరించాలని సామాజిక మాధ్యమ సంస్థలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే.. వాటికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తోంది.