Asianet News TeluguAsianet News Telugu

జియో దెబ్బకు బీఎస్‌ఎన్‌ఎల్ విలవిల: ఉద్యోగుల జీతాలకు కూడా కటకట

రిలయన్స్ జియో టెలికం రంగంలో చౌక ధరలు అమలు చేయడంతో ప్రైవేట్, ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు కుదేలయ్యాయి. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థలు బీటీఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నష్టాలతో సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. దీనికి బెయిలౌట్ పథకాన్ని కేంద్రం సిద్ధం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. బెయిలౌట్ అంటే సిబ్బందికి ఉద్వాసన కూడా ఉన్నదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

BSNL misses paying February salaries
Author
Mumbai, First Published Mar 14, 2019, 4:02 PM IST

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) భవితవ్యంపై క్రమంగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చరిత్రలోనే తొలిసారిగా సంస్థ ఉద్యోగులు జీతాలందక అలమటిస్తున్నారు. గతంలో టెలికాం రంగ రారాజుగా వెలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ టెలికం రంగంలో తీవ్ర పోటీ కారణంగా సంస్థ ఆదాయం తగ్గిపోయింది. 

బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు మరో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటీఎన్‌ఎల్‌ సంస్థ ఉద్యోగులు కూడా ఫిబ్రవరి నెల జీతం ఇప్పటి వరకు అందలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ రెండు సంస్థల్లో దాదాపు రూ.1.92 లక్షల మంది ఉద్యోగులు (బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగుల సంఖ్య 1.76 లక్షలు) పని చేస్తున్నారు. 

రిలయన్స్‌ జియోలాంటి ప్రయివేటు టెలికాంల నుంచి ఎదురవుతున్న ధరల యుద్ధం నేపథ్యంలో ఫిబ్రవరి జీతాలను పది రోజులు ఆలస్యంగా చెల్లించినట్టు తెలుస్తోంది.కేరళ, ఒడిశా, జమ్ము కశ్మీర్‌ ఉద్యోగులకు  వేతనాలను బట్వాడా ప్రారంభించామని ఒక బీఎస్ఎన్ఎల్ అధికారి తెలిపారు. మార్చి నెల జీతాలు కూడా కొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల ఉద్యోగుల వేతన విలువ సుమారు రూ.1200 కోట్లు ఉంటుంది. వార్షిక వేతన బిల్లు రూ.15 వేల కోట్లని అంచనా. 

మార్కెట్లోకి రిలయన్స్‌ జియో టెలికాం సేవలు చౌక ధరలకే అందుబాటులోకి రావడంతో మిగతా టెలికాం సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకుంటున్నాయి.దీంతో గతంలో దేశ వ్యాప్తంగా 14 టెలికాం సంస్థలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య మూడుకు పడిపోయింది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ నష్టాలు గత మార్చి నాటికి రూ.7,992 కోట్లకు పెరిగాయి. 

బీఎస్ఎన్ఎల్ రుణ భారం కూడా రూ.14,000 కోట్లకు చేరుకుంది.  అయినా మహారాష్ట్ర సర్కిల్‌  రూ. 60 కోట్ల విలువైన వేతనాలు చెల్లించాల్సింది ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 22 సర్కిళ్లలోని ఉద్యోగుల వేతనాలకు వేతనాలు చెల్లించాలి. గమ్మత్తేమిటంటే ఇప్పటికీ దేశీయ టెలికాం మార్కెట్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ దాదాపు 11% వాటాను కలిగి ఉంది.

ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ 5జీ దిశగా అడుగులు వేస్తున్నా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఇంకా అత్యధిక నెట్‌వర్క్‌ను 2జీ, 3జీ టెక్నాలజీపైనే నడిపిస్తోంది. దీంతో ఆ సంస్థ ప్రయివేట్ సంస్థలకు దీటుగా పోటిని ఇవ్వలేకపోతోంది. ఫలితంగా సంస్థకు ఆదాయం తగ్గి నష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. 

ఆదాయంలో అత్యధిక భాగం జీతాలకే సరిపోతుంటే.. అభివృద్ధికి నిధులను వెచ్చించలేని పరిస్థితి నెలకొందని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రయివేట్ సంస్థల్లోనైతే వేతనాల బిల్లు 10 శాతానికి మించి ఉండదని వారు విశ్లేషిస్తున్నారు. దీంతో వారు డెవలప్‌మెంట్‌కు అత్యధికంగా నిధులను వెచ్చిస్తున్నట్టు తెలిపారు. ప్రయివేటు సంస్థలు అభివృద్ధి దిశగా దుసుకుపోకపోవడానికి ఇదో ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. 
 
ప్రభుత్వ రంగంలోని టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగులకు ఫిబ్రవరి జీతాల చెల్లింపునకు ప్రభుత్వం రూ.1000 కోట్ల మేర నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వెలువడింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు హౌలి (ఈ నెల 21) నాటికి రూ.850 కోట్ల వేతన బకాయిల చెల్లింపులు జరపనున్నట్టుగా సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

ఇందుకు యాజమాన్యం నుంచి తమకు హామీ లభించిందని ఉద్యోగ సంఘాల వారికి ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. సంస్థలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థను నిలబెట్టేందుకు గాను దాదాపు రూ.13000 కోట్ల మేర బెయిలవుట్‌ ప్యాకేజీని ప్రకటించే విషయమై కూడా సర్కార్ నుంచి తమకు హామీ లభించినట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

బీఎస్‌ఎన్‌ఎల్‌ జీతాల బకాయిలను చెల్లింపునకు తాము రూ.1000 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించడాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. సాంబశివరావు ఆక్షేపించారు. ప్రతినెల తొలి అర్థ భాగంలో సంస్థకు సగటున రోజుకు రూ.70 కోట్ల మేర రెవెన్యూ వస్తుందన్నారు.

 గత 14 రోజులుగా వచ్చిన ఆదాయాన్నే ఇప్పుడు జీతాలకు మళ్లిస్తూ.. ప్రభుత్వం ఏదో మేలు చేసినట్టుగా ప్రకటనలు చేయడమేంటని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. సాంబశివరావు ప్రశించారు. తెలుగు రాష్ట్రాల్లో జీతాలందక దాదాపు 8500 మంది సంస్థ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios