Asianet News TeluguAsianet News Telugu

కొలీజియం సిఫార్సులకు ఆమోదంలో జాప్యంపై సుప్రీం కోర్టు ఆవేదన.. కేంద్ర మంత్రి రిజిజు వ్యాఖ్యలపై అభ్యంతరం..

కొలీజియం ప్రతిపాదనల్లో కొందరి పేర్లను ఆమోదించడం, మరికొన్ని పేర్లను కొలీజియం సిఫారసుల నుంచి నిలుపుదల చేయడం ద్వారా కేంద్రం అనుసరిస్తున్న విధానంపై సుప్రీంకోర్టు సోమవారం ఆవేదన వ్యక్తం చేసింది.

Supreme court Objects law Minister Kiren Rijiju comments about collegium system
Author
First Published Nov 29, 2022, 9:53 AM IST

కొలీజియం ప్రతిపాదనల్లో కొందరి పేర్లను ఆమోదించడం, మరికొన్ని పేర్లను కొలీజియం సిఫారసుల నుంచి నిలుపుదల చేయడం ద్వారా కేంద్రం అనుసరిస్తున్న విధానంపై సుప్రీంకోర్టు సోమవారం ఆవేదన వ్యక్తం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించి కొలీజియం సిఫారసు చేసిన పేర్లను క్లియర్ చేయకుండా ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను కేంద్రం నిరాశకు గురిచేస్తోందని పేర్కొంది. సమస్యను పరిష్కరించాలని కోరింది. అలాగే న్యాయ పక్షంపై నిర్ణయం తీసుకోమని బలవంతం చేయవద్దని పేర్కొంది. అయితే ఇది న్యాయమూర్తుల నియామకాలపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టుల మధ్య ప్రతిష్టంభనను తీవ్రతరం చేసే అంశంగా మారింది. 

కొలీజియం వ్యవస్థను విమర్శిస్తూ న్యాయమూర్తులను నియమించే బాధ్యతను కోర్టు తీసుకోకూడదని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రకటనను ఎస్‌సీసీఏ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకురాగా.. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. “ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎవరైనా చెప్పినప్పుడు వారి పని వారిని చేయనివ్వండి. మా పని మేము చేస్తాం. ఇబ్బంది ఏం లేదు. అయితే ఇది ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి నుండి వచ్చింది. ఇది చేయకూడదని మేము చెప్పగలం’’ అని పేర్కొంది. 

ఇక, కిరణ్ రిజిజు ఇటీవల టైమ్స్ నౌ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. నియామకాలలో పారదర్శక,  జవాబుదారీతనం ఉండాలని అన్నారు. కొలీజియం వ్యవస్థను రాజ్యాంగానికి పరాయి వ్యవస్థ అని అన్నారు. ‘‘నేను కొలీజియంను విమర్శించదలచుకోలేదు. లొసుగులు ఉన్నాయని.. జవాబుదారీతనం లేదని నేను ఎత్తి చూపాలనుకుంటున్నాను. ఇందులో పారదర్శకత లేదు.. ఒకవేళ ప్రభుత్వం ఫైళ్లపై జాప్యం చేస్తుంటే ఆ ఫైళ్లను పంపొద్దు’’ అని  కిరణ్ రిజిజ్ అన్నారు. 

కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్రం చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉంచడం, సెలక్టివ్‌గా ఎంపిక క్లియర్ చేయడం సుప్రీం కోర్టు రూపొందించిన చట్టం, మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని తెలిపింది. నియామకాలు ఎంత గడువులోపు పూర్తి కావాలనే దానిపై గతంలోనే సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను గుర్తుచేసింది. 

కొలీజియం పునరుద్ఘాటించిన దాదాపు 11 సిఫార్సులు ఉన్నాయని.. అవి ప్రభుత్వం ముందు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. కొలీజియం చేసిన పునరుద్ఘాటన విషయంలో పేర్లను క్లియర్ చేయడం మినహా ప్రభుత్వానికి వేరే మార్గం లేదని పేర్కొంది. ‘‘ఒకసారి పునరుద్ఘాటిస్తే అది చట్టం ప్రకారం ప్రక్రియ ముగుస్తుంది. మీరు వెనక్కి తగ్గలేరు. ఇది నిరాశపరిచింది. ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఒకటిన్నర సంవత్సరాలుగా పేర్లు పెండింగ్‌లో ఉన్నాయి. మీరు పేర్లను క్లియర్ చేయలేరని ఎలా చెప్పగలరు? మేము మీకు తెలియజేసేది ఏమిటంటే, పేర్లను ఇలా పెండింగ్‌లో ఉంచడం ద్వారా ఇది కొంత రూబికాన్‌ను దాటుతోంది’’ అని ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలతో చెప్పింది.

వివిధ సిఫార్సుల జాబితాల నుండి ఎంపిక చేసిన పేర్లను క్లియర్ చేయడం ద్వారా.. కొలీజియం పరిగణనలోకి న్యాయమూర్తుల సీనియారిటీకి భంగం కలుగుతుందని ధర్మాసం ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానం మంచి న్యాయవాదులను న్యాయమూర్తిగా పదవులు స్వీకరించకుండా నిరుత్సాహపరిచిందని కోర్టు పేర్కొంది. న్యాయవాదుల్లో ఒకరు ఆలస్యం కారణంగా తన సమ్మతిని ఉపసంహరించుకున్నారని.. మరొకరు ఇటీవల మరణించారని, అతని పేరును ప్రభుత్వం క్లియర్ చేయలేదని కోర్టు తెలిపింది.

న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఫైళ్లను ప్రాసెస్ చేయడంలో చట్టబద్ధత పాటించాలని, సమయపాలన పాటించాలని ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌లను ధర్మాసనం కోరింది. అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌ లేవనెత్తిన ఆందోళనలపై ప్రభుత్వాన్ని ఒప్పించగలదని అభిప్రాయపడ్డ బెంచ్.. తదుపరి విచారణ తేదీ నాటికి కొంత పురోగతి సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ధర్మాసనం తన వేదనను వ్యక్తీకరించడానికి “మృదువైన పదాలను” ఉపయోగిస్తోందని.. అయితే ఏ కోర్టు కూడా తన స్వంత ఆదేశాలను ఉల్లంఘించదని పేర్కొంది.

కొలీజియం తన సిఫార్సును పునరుద్ఘాటించిన 11 పేర్లతో సహా 68 పేర్ల సిఫార్సులు ప్రభుత్వం ముందు పెండింగ్‌లో ఉన్నాయి. 2019లో కొలీజియం కొన్ని సిఫార్సులు చేసిందని, కేంద్రం పునరాలోచన కోరిన తర్వాత మళ్లీ వారి పేర్లను పంపిందని.. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ న్యాయవాది పాయ్ అమిత్ ద్వారా బెంగుళూరులోని అడ్వకేట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఇక, తదుపరి విచారణను వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios