ఉగ్రదాడులపై కాంగ్రెస్ రాజకీయాలు ... పాకిస్థాన్ కు క్లీన్ చీట్ ఇచ్చేందుకే..: బిజెపి స్ట్రాంగ్ కౌంటర్
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా తాజాగా హర్యానాకు చెందిన ఓ లోక్ సభ అభ్యర్థి పుల్వామా దాడుల వెనక మోదీ సర్కార్ వుందని ఆరోపిస్తే.. బిజెపి దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
భారతదేశ చరిత్రలోనే ఫిబ్రవరి 14, 2019 ఓ చీకటి రోజు. భారత్ లోకి చొరబడ్డ ఉగ్రవాద మూకలు ఇదే రోజున భారత సైనికులను పొట్టనబెట్టుకున్నాయి. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కాశ్మీర్ లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడగా 40 మంది సిఆర్ఫిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడికి భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిమరీ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో గల ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక ద్వంసం చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఘటనలు సరిగ్గా 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగాయి. దీంతో ఈ ఉగ్ర దాడులను, జవాన్ల మరణాలను బిజెపి రాజకీయాల కోసం వాడుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. అయితే తాజా లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి పుల్వామా దాడుల్లో బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర వుందంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది. తాజాగా హర్యానా రాష్ట్రంలోని ఫరిదాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ ప్రతాప్ సింగ్ ఇలాగే పుల్వామా మారణహోమంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
''పుల్వామ ఘటన కారకులెవరో దేశ ప్రజలందరి ముందు తేటతెల్లం అయ్యింది. బిజెపికి చెందిన గవర్నర్ (సత్యపాల్ మాలిక్) అసలు నిజాన్ని బయటపెట్టాడు. పుల్వామా దాడి సమయంలో కాశ్మీర్ గవర్నర్ గా వున్న ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేసినట్లు... సిఆర్ఫిఎఫ్ జవాన్లను ఎయిర్ లిప్ట్ చేయాలని కోరినట్లు తెలిపాడు. కానీ పీఎం మోదీ ఆయనను ఇది నీ పని కాదని వారించాడట. దీంతో జరగాల్సిన దారుణం జరిగిపోయి జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గవర్నర్ వెల్లడించాడు'' అని కాంగ్రెస్ నేత మహేందర్ ప్రతాప్ ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
కేవలం మహేందర్ ప్రతాప్ మాత్రమే కాదు అంతకుముందు మరికొందరు కాంగ్రెస్ నాయకులు కూడా ఇలాంటి కామెంట్స్ చేసారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, మహారాష్ట్ర సిఎల్పీ నేత విజయ్ వాడెట్టివార్, పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ కూడా ఇలాంటి కామెంట్స్ చేసారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ 26/11 ముంబై ఉగ్రదాడులపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటిఎస్) మాజీ చీఫ్ హేమంత్ కర్కరేను ఎన్నికల వేళ తెరపైకి తీసుకువచ్చారు విజయ్. అసలు హేమంత్ ను చంపింది పాకిస్థాని ఉగ్రవాదులు కాదు... ఆర్ఎస్ఎస్ తో సంబంధాలున్న ఓ పోలీస్ అధికారి అంటూ సంచలన ఆరోపణలు చేసారు. ఇలా కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి
ఇలా కాంగ్రెస్ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై బిజెపి ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ నేతల కామెంట్స్ చూస్తుంటే భారత్ పై ఉగ్రదాడులతో పాకిస్థాన్ కు సంబంధం లేదు... క్లీన్ చీట్ ఇవ్వాలన్నట్లు వున్నాయన్నారు. స్వయంగా పాకిస్థాన్ సైన్స్ ఆండ్ టెక్నాలజీ మంత్రి ఫవద్ చౌదరి ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా భారత్ పై దాడులు తమ పనేనని ఒప్పుకున్నాడు. అయినా కాంగ్రెస్ నాయకులు ఇలా పాకిస్థాన్ ప్రమేయం లేదనేలా మాట్లాడటం దేశ భద్రతకే ముప్పు అని అమిత్ మాల్వియా ఆందోళన వ్యక్తం చేసారు.