ఆకస్మికంగా గుండెపోటుతో సంభవించే మరణాలకు లాంగ్ కోవిడ్‌తో సంబంధం.. వైద్యుల సూచన ఇదే
ఆకస్మిక గుండెపోటు మరణాలకు దీర్ఘకాల కోవిడ్‌తో సంబంధం ఉన్నదని ఎయిమ్స్ వైద్యులు సూచించారు. కాలం గడుస్తున్న కొద్దీ కొవిడ్ ఇన్ఫెక్షన్, గుండె సంబంధ రిస్క్ పెరుగుతూనే ఉన్నాయని ఎయిమ్స్ ప్రొఫెసర్ తెలిపారు. ఫిట్‌నెస్, వయసును దృష్టిలో పెట్టుకుని హృద్రోగ సమస్యల లక్షణాలను నిర్లక్ష్యం చేయరానది సూచించారు.

న్యూఢిల్లీ: గార్బా కార్యక్రమంలో 35 ఏళ్ల వ్యక్తి డ్యాన్స్ చేసుకుంటూనే ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు, అక్కడే మరణించాడు; 20 ఏళ్లు నిండిన ఓ వధువు వరుడికి పూల మాల వేస్తూ స్టేజీపైనే కుప్పకూలిపోయింది, కొన్ని గంటల వ్యవధిలోనే మరణించింది; ఓ బాలుడు వాకింగ్ కోసం బయటికి వచ్చి కుప్పకూలిపోయి మరణించాడు.. ఇవన్నీ కేసుల్లో కారణంగా హార్ట్ ఎటాక్ అని అనుమానించారు.
ఇలాంటి చాలా ఘటనలు వీడియోకు చిక్కాయి. సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. సాధారణ నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అయ్యారు. వీటిని కార్డియాలజిస్టులు కూడా అంత సింపుల్‌గా తీసుకోవడం లేదు. ఈ మరణాలపై ఆందోళనలు వెలిబుచ్చారు.
ఆకస్మిక్ కార్డియాక్ డెత్స్ గణాంకాలు ఏవీ అందుబాటులో లేవు. కానీ, అడపాదడపా బాగా ప్రచారంలోకి వస్తున్న కేసులను చూసినా ఈ కేసులో ఎక్కువే అని అర్థం అవుతున్నదని ఎయిమ్స్‌లో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాకేశ్ యాదవ్ తెలిపారు. ఈ మరణాలను లాంగ్ కోవిడ్‌తో లింక్ చేయవచ్చని చెప్పారు.
2020లోనే డాక్టర్ రాకేశ్ యాదవ్, ఆయన కొలీగ్స్ ఇండియన్ హార్ట్ జర్నల్‌లో ఓ కథనం ప్రచురించారు. కొవిడ్ సడన్ కార్డియక్ డెత్స్‌కు కారణంగా తయారు కావొచ్చని వారి కథనం పేర్కొంది. ఇందులో ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్, గుండె కండరాలు బలహీనం కావడం, ఇతర కారణాలను వారు ప్రస్తావించారు.
కాలం గడుస్తున్న కొద్దీ కొవిడ్ ఇన్ఫెక్షన్, గుండె సంబంధ రిస్క్ పెరుగుతూనే ఉన్నాయని ఎయిమ్స్ ప్రొఫెసర్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. ఫిట్‌నెస్, వయసును దృష్టిలో పెట్టుకుని హృద్రోగ సమస్యల లక్షణాలను నిర్లక్ష్యం చేయరానది సూచించారు. ఈ ముప్పును ముందుగానే అంచనా వేయడానికి లేదా, రిస్క్ తగ్గించుకోవడానికి నిర్ణీత అవధుల్లో హెల్త్ చెకప్స్ రెగ్యులర్‌గా చేయించుకోవడం మంచిదని వివరించారు.
Also Read: గుండెపోటు ప్రారంభ సంకేతాలు.. ఏమాత్రం కేర్ లెస్ గా ఉన్నా ప్రాణాలు పోవచ్చు జాగ్రత్త..
ఎయిమ్స్‌లోని ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ గుప్తా మాట్లాడుతూ, ఇలా మరణించిన వారికి పోస్టుమార్టం నిర్వహించాలని సూచనలు చేశారు. తద్వార మరణాలకు కారణాలు తెలుసుకోవడమే కాదు.. హార్ట్‌కు సంబంధించిన గుర్తించిన సమస్యలతోనూ మరణించాడా? అనే విషయాలను కూడా తెలుసుకోవచ్చని వివరించారు. తద్వార అతని కుటుంబాన్ని కూడా ఆ డిసీజ్ నుంచి కాపాడుకోవడానికి స్క్రీనింగ్‌కు పంపవచ్చని తెలిపారు. కొన్ని హృద్రోగ సమస్యలు కుటుంబాల్లోనే వ్యాపిస్తూ ఉంటాయని వివరించారు.
హార్ట్ అటాక్, సడెన్ కార్డియక్ అరెస్టు రెండూ వేరని వారు చెప్పారు. హార్ట్ అటాక్ అనేది బ్లడ్ సర్క్యులేషన్‌కు సంబంధించిందని, అదే సడెన్ కార్డియక్ అరెస్టు అనేది ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వివరిస్తున్నది. సడెన్ కార్డియక్ అరెస్టు అంటే.. గుండె లయ తప్పుతుందని, వెంటనే కొట్టుకోవడం ఆపేస్తుందని తెలుపుతున్నది. ఈ సడెన్ కార్డియక్ అరెస్టు వచ్చినప్పుడు పేషెంట్ హాస్పిటల్‌లో ఉంటే బ్రతుకుతాడని, లేదంటే.. నిమిషాల వ్యవధిలోనే మరణిస్తాడని ఏహెచ్ఏ చెబుతున్నది.
Also Read: పూజలో కూర్చునే హార్ట్ ఎటాక్‌తో మరణించిన భక్తుడు.. మధ్యప్రదేశ్ గుడిలో ఘటన (వీడియో)
హార్ట్ ఎటాక్ తర్వాత సడెన్ కార్డియాక్ అరెస్టు రావొచ్చని ఎయిమ్స్‌లోని మరో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అంబుజ్ రాయ్ తెలిపారు. ఒక వేళ ఎవరికైనా సడెన్ కార్డియక్ అరెస్టు వస్తే కార్డియో పల్మునరి రిసాసిటేషన్ చేపట్టాలని, లేదా చెస్ట్ కంప్రెషన్ (ఛాతిపై లయబద్ధంగా ఒత్తిడి చేయడం) పద్ధతులు కొంత సహాయపడతాయని వివరించారు. కరోనరి ఆర్టరీ బ్లాకేజీ (గుండె ప్రధాన రక్తవాహిక డ్యామేజీ కావడం, దానికి సంబంధించిన సమస్య) సమస్య బారిన భారతీయులు పది సంవత్సరాలు ముందే పడే ముప్పు ప్రస్తుతం ఉన్నదని జీబీ పంత్ హాస్పిటల్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మోహిత్ గుప్తా తెలిపారు.