'గత పదేళ్లలో భారత్ ఆదాయం మూడు రెట్లు పెరిగింది" : రాహుల్ గాంధీకి ధీటైన సమాధానం
Akhilesh Mishra: గత పదేళ్లలో సామాన్యుల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ధీటైన సమాధానమిచ్చారు బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈవో అఖిలేష్ మిశ్రా.
Akhilesh Mishra: భారత ప్రభుత్వం ఆదాయ పన్ను విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది. ఆదాయ పన్ను చెల్లించేవారిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను మరింత సరళం చేసింది. దీంతో ట్యాక్స్ చెల్లించడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రతినెలా ఆదాయపు పన్ను వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఈ తరుణంలో బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ కీలక విషయం వెల్లడించింది. గత పదేళ్లలో సామాన్యుల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈవో అఖిలేష్ మిశ్రా పేర్కొన్నారు. కార్పొరేట్ పన్ను వసూళ్లు పెరిగాయని శివసేన యూబీటీ నేత ప్రియాంక చతుర్వేది ఆరోపణలను అఖిలేష్ మిశ్రా తోసిపుచ్చారు. ఇండియా కూటమి ఐక్యత రోజురోజుకూ రాహుల్ గాంధీలా అసంబద్ధంగా మారుతున్నట్లు కనిపిస్తోందన్నారు.
నూతన నివేదికల ప్రకారం.. గత దశాబ్దంలో కార్పొరేట్ పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయని అఖిలేష్ మిశ్రా పేర్కొన్నారు. ఇది 2013-14లో రూ.3.95 లక్షల కోట్ల నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9.11 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. భారతదేశంలో పన్నుల వసూళ్లు వేగంగా పెరగడం నిజానికి దేశ అభివ్రుధ్దికి, శ్రేయస్సుకు సంకేతమని ఆయన అన్నారు. పెరుగుతున్న శ్రేయస్సుతో ఎక్కువ మంది ప్రజలు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తున్నారని తెలిపారు. SBI రీసెర్చ్ ప్రకారం.. గత దశాబ్దంలో భారతీయుల సగటు ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగిందనీ, FY2014లో రూ.3.1 లక్షల నుండి FY21లో రూ.11.6 లక్షలకు పెరిగిందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ పన్ను వ్యక్తిగత పన్ను కంటే చాలా తక్కువ అని అఖిలేష్ మిశ్రా పేర్కొన్నారు. భారతదేశంలో మాత్రమే కార్పొరేట్ పన్నుల సహకారం ఎక్కువగా ఉంటుందనీ, వ్యక్తిగత పన్నులు తక్కువగా విధించబడతాయని అన్నారు. OECD దేశాలలో కార్పొరేట్ పన్నులు సగటున 9.8% పన్ను రాబడిని కలిగి ఉండగా, వ్యక్తిగత పన్నులు 23.9% దోహదం చేస్తాయని అన్నారు. USలో కార్పొరేట్ పన్నులు పన్ను ఆదాయంలో 5.1% వాటాను కలిగి ఉండగా, వ్యక్తిగత పన్నులు 41.1%గా ఉందని తెలిపారు. యూపీఏ హయాంలో 2014లో భారతదేశంలో మధ్యతరగతి వ్యక్తి వార్షికాదాయం రూ.2 లక్షలపై ఉంటే.. పన్ను చెల్లించాల్సి వచ్చేందనీ, కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో మధ్యతరగతి వ్యక్తి వార్షిక ఆదాయం రూ.7.5 లక్షల వరకు ఉన్న ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం తమ పన్నులను నిజాయితీగా వినియోగిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో దళారులు, ఇతర దుండగులు దోచుకోరని, ఈ విషయం భారతీయ ఓటర్లకు కూడా తెలుసునని అన్నారు. అందుకే 2014లో దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్య దాదాపు 3.8 కోట్లు ఉండగా, 2024 నాటికి ఆ సంఖ్య దాదాపు 8.18 కోట్లకు పెరిగిందని తెలిపారు. నిజాయితీ గల బీజేపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందనీ, జైలులో లేదా బెయిల్‌పై బయట ఉన్న దొంగ నాయకుల కూటమిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఎన్నికలకు ముందే.. ఇండియా కూటమి విచ్ఛిన్నమైందని, ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారం కైవసం చేసుకుంటుందని, ముచ్చటగా మోడీ మరో మారు ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.