పాక్ టెర్రరిస్ట్ కసబ్ కాదు... కర్కరే ను చంపింది మన పోలీసే..: మహా కాంగ్రెస్ నేత సంచలనం
లోక్ సభ ఎన్నికల వేళ 26/11 ముంబై ఉగ్రదాడులను తెరపైకి తెస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడో సీనియర్ కాంగ్రెస్ నేత. ఉగ్రవాది కసబ్ తో పాటు మిగతా టెర్రరిస్టులకు మద్దతిచ్చేలా అతడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి... ఇంతకూ అతడు ఏమన్నాడంటే...
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత విజయ్ వడెట్టివార్ 26/11 ముంబై ఉగ్రదాడులపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటిఎస్) మాజీ చీఫ్ హేమంత్ కర్కరేను ఎన్నికల వేళ తెరపైకి తీసుకువచ్చారు విజయ్. అసలు హేమంత్ ను చంపింది పాకిస్థాని ఉగ్రవాదులు కాదు... ఆర్ఎస్ఎస్ తో సంబంధాలున్న ఓ పోలీస్ అధికారి అంటూ సంచలన ఆరోపణలు చేసారు. ఇలా కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
అయితే హేమంత్ కర్కరేను హత్యచేసింది పోలీస్ అధికారేనని 26/11 ముంబై ఉగ్రవాది కేసును వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిగమ్ కు తెలుసని విజయ్ పేర్కొన్నారు. అయితే ఈ విషయం బయటపడకుండా చూసాడని అన్నారు. ఇప్పుడు అదే ఉజ్వల్ ముంబై నార్త్ సెంట్రల్ నుండి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగాడని వాడెట్టివార్ తెలిపారు. ఇలా బిజెపి నేతను ముంబై ఉగ్రదాడుల కేసులో ద్రోహిగా పేర్కొన్నాడు.
"నికమ్ న్యాయవాది కాదు దేశద్రోహి. ముంబై దాడుల్లో పాల్గొన్న అజ్మల్ కసబ్ వంటి ఉగ్రవాదుల తూటాల వల్ల కాదు, ఆర్‌ఎస్‌ఎస్ అనుకూల పోలీస్ అధికారి బుల్లెట్ల వల్ల కర్కరే మరణించాడు. అధికారిని రక్షించడానికి నికమ్ ప్రత్యేక కోర్టు ముందు తప్పుడు వాదనలు వినిపించారు... ఆధారాలను నొక్కిపెట్టారు" అని కాంగ్రెస్ నేత విజయ్ ఆరోపించారు.
కాంగ్రెస్ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అసలు వాడెట్టివార్ ఏం చెప్పాలనుకుంటున్నాడు... మారణహోమం సృష్టించిన అజ్మల్ కసబ్, మిగతా ఉగ్రవాదులు అమాయకులుగా నిరూపించాలని అనుకుంటున్నారా? అని బిజెపి ప్రశ్నిస్తోంది. ఇలాంటి ప్రకటనల ద్వారా పాకిస్థాన్ ఓటర్లకు దగ్గర కావాలనుకుంటున్నారా? కానీ ఎన్నికలు జరిగేది భారతదేశంలో కదా? అంటూ కాంగ్రెస్ నాయకుడిని బిజెపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
''అసలు కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఎందుకు తయారయ్యింది. వాళ్ళు పాకిస్థాన్ లో పోటీ చేస్తున్నారా... అక్కడ ఓట్లు అడుగుతున్నారా? ముంబైలో ఎందరో ప్రాణాలను బలితీసుకున్న అజ్మల్ కసబ్, మిగతా ఉగ్రవాదులు అమాయకులు అనేలా ఎందుకు మాట్లాడుతున్నారు. బిజెపి ఉజ్వల్ నిగమ్ కు టికెట్ ఇవ్వగానే అతడు దేశద్రోహిగా మారిపోయాడా... అసలు అజ్మల్ కసబ్ ఏ తప్పూ చేయలేదు అన్నట్లు మాట్లాడటం ఏమిటి?'' అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పడ్నవిస్ సీరియస్ అయ్యారు.
''కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పరచి వారి ఓట్లను పొందడానికి కాంగ్రెస్ నాయకులు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. దేశాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న వీరులను ఇలాంటి వ్యాఖ్యల నిరుత్సాహపరుస్తాయి. ఇలా మన భద్రతా బలగాలను కించపర్చేలా మాట్లాడటం దారుణం. పాకిస్థాన్ తమకు ఉగ్రదాడులతో సంబంధం లేదని సర్దిచెప్పినట్లుగా కాంగ్రెస్ నాయకుల మాటలు వున్నాయి'' అంటూ బిజెపి ఐటి విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేసారు.