వివిధ ప్రాంతాల్లో ఉండే ఆలయాలను దర్శించుకోవడానికి మనలో చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. అయితే..  ఓ రైలులో మాత్రం ఏకంగా ఆలయం ఏర్పాటు చేశారు. రైలులోని ఓ సీటుని శివుడికి ఏర్పాటు చేశారు. దీంతో... అది కూడా ఒక ఆలయంగా భావించి భక్తులు పూజలు చేస్తుండటం గమనార్హం. ఈ సంఘటన వారణాసిలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మూడు జ్యోతిర్లింగాలు కలుపుతూ సాగే కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్ రైలుని ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా... ఆ రైలులో చిన్నపాటి   శివాలయం వెలిసింది. రైల్వే అధికారులు ఏకంగా పరమశివుడికి ఓ బెర్తునే రిజర్వ్ చేసేశారు. 

Also Read మోసపోయిన టెక్కీ.... నెయిల్ పాలిష్ ఖరీదు రూ.92వేలా..?

సహజంగా మనుషులకు ట్రైన్ బెర్త్ లు రిజర్వ్ చేస్తారు కానీ ఇక్కడ శివుడికి బెర్త్ రిజర్వ్ చెయ్యటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఈ రైలు మూడు జ్యోతిర్లింగాలను కలుపుతూ సాగుతున్న నేపధ్యంలో దీని ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఏర్పాటు చేశారు.

బీ5 బోగిలోని 64వ నెంబర్ సీటుని ఈశ్వరునికి కేటాయించారు. శివుడి ఫోటో పెట్టి.. అందంగా పూలతో అలంకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ రైలు మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓంకారేశ్వర్ ను, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ను, యూపీ.. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ ను అంటే మూడు జ్యోతిర్లింగాలను కలిపుతూ వెళ్తుండటం దీని విశేషం. ఈ నెల 20వ తేదీ నుంచి దీని సర్వీసులు ప్రారంభం కానున్నాయి.