'గాంధీ ఫ్యామిలీని ఆ ఆడబిడ్డ ఖతం చేసేసింది..': ఈ అమేథీ పాన్ వాలా అంతమాట అనేసాడేంటి..!
గాంధీ కుటుంబ వారసత్వ సీటుగా పేరున్న అమేథీలో ఇప్పుడు పోటీలో నిలిచేది ఎవరు? రాహుల్ గాంధీ మళ్లీ పోటీ చేస్తారా? అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు?...
అమేథీ : గాంధీ కుటుంబ రాజకీయాలకు నిలయం అమేథీ లోక్ సభ. ఇక్కడ అన్నదమ్ములు సంజయ్, రాజీవ్ గాంధీలు... తల్లీ కొడుకులు సోనియా, రాహుల్ గాంధీలు అమెథీ నుండి గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఇలా సుధీర్ఘకాలం గాంధీ కుటుంబం చేతుల్లో వున్న ఈ లోక్ సభలో ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా వున్నాయి. ఇక్కడి నుండి పోటీ చేయడానికి గాంధీ కుటుంబం వెనకడుగు వేస్తోంది. గాంధీ కుటుంబ వారసత్వ సీటుగా పేరున్న అమేథీలోనే కాంగ్రెస్ పరిస్థితి ఇలావుంటే మిగతా చోట్ల పరిస్థితి ఏమిటి? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఈ సందర్భంగా అమేథీకి చెందిన ఓ పాన్ వాలా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో మాదిరిగా గాంధీ కుటుంబం హవా అమెథీలో లేదని... ఇప్పుడు స్మృతి ఇరానీ హవా నడుస్తోందని పాన్ వాలా తెలిపాడు. కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న ఆమె అమేథీని అభివృద్ది చేసారని తెలిపాడు. దీంతో ఈసారి కూడా స్మృతి ఇరానీ వైపే అమేథీ ప్రజలు నిలుస్తారని... ఇకపై ఇక్కడ కాంగ్రెస్ వుండదు అనేలా పాన్ వాలా మాట్లాడాడు. 'గాంధీ ఫ్యామిలీ అస్తిత్వాన్ని స్మృతీ ఇరానీ ఖతం చేసారు... అమేథీలో ఇకపై గాంధీ కుటుంబానికి చోటులేదు' అని పాన్ వాలా ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
ఈసారి రాహుల్ గాంధీ అమేథీ నుండి పోటీచేసినా గెలవలేడని పాన్ వాలా పేర్కొన్నాడు. సుదీర్ఘకాలం అమేథీ ఎంపీగా పనిచేసినా ఆయన చేసిన అభివృద్ది ఏమీ లేదని... స్మృతీ ఇరాని గెలిచిన మొదటిసారే అద్భుతంగా అభివృద్ది చేసారని తెలిపాడు. ఇలా గాంధీ కుటుంబం, స్మృతీ ఇరానీ పనితీరుపై కామెంట్స్ చేసిన అమేథీ పాన్ వాలా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
రాహుల్ గాంధీ దక్షిణ భారతదేశంలోని వయనాడ్ కు షిప్ట్ అయ్యారు. గత లోక్ సభ ఎన్నికల్లో అమేథీలో ఓటమి పాలయిన రాహుల్ ఈసారి పోటీకి వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం వయనాడ్ లో మాత్రమే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. దీంతో అమేథీ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది సస్పెన్స్ గా మారింది.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్ బరేలీలో ప్రియాంకా గాంధీని పోటీ చేయించాలని భావిస్తోందట. ఈ విషయమై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్, ప్రియాంకతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీళ్లు పోటీకి ఒప్పుకోకుంటే వేరే అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు.
అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల్లోనూ ఐదవ దశలో పోలింగ్ జరగనుంది... ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మే 4 నామినేషన్లకు చివరి తేదీ. బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ ఇప్పటికే అమేథీ నుండి నామినేషన్ దాఖలు చేసారు. మరి కాంగ్రెస్ నుండి ఎవరు పోటీలో నిలుస్తారో త్వరలోనే తేలనుంది.