PM Modi: బస్టాండ్ లో పండ్లు అమ్మే మహిళను కలిసిన ప్రధాని మోడీ.. ఆమెపై ఎందుకు ప్రశంసలు కురిపించారు?
Narendra Modi : సోమవారం (ఏప్రిల్ 29) కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన అంకోలాకు చెందిన పండ్ల అమ్మే చిరు వ్యాపారి మోహినీ గౌడను కలిశారు. ఆమె చేస్తున్న పనిని మెచ్చుకున్నారు.
Prime Minister Narendra Modi : కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ క్రమంలోనే అక్కడ నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా సామాన్య ప్రజానీకంతో కలిసిన దృశ్యాలు వైరల్ గా మారాయి. సోమవారం (ఏప్రిల్ 29) కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రధాని కర్ణాటక పర్యటనలో ఆసక్తికర సన్నివేశం దర్శనమిచ్చింది. ఈ సమయంలో అంకోలాకు చెందిన పండ్లను విక్రయించే సాధారణ మహిళ మోహినీ గౌడను కలిశారు. ప్రధాని మోడీ సిర్సీకి చేరుకున్న వెంటనే హెలిప్యాడ్ వద్ద శ్రీమతి మోహినీ గౌడను కలిశారు. ప్లాస్టిక్ కవర్లు వాడకుండా సరికొత్తగా పండ్ల వ్యాపారం చేయడమే ఆమెను ప్రధాని వరకు చేర్చింది. స్వచ్చ భారత్ ను ప్రమోట్ చేసేలా ఆమె చేసిన పనిని ప్రధాని ప్రశంసించారు.
అంకోలాకు చెందిన మోహిని గౌడ్ పండ్ల విక్రయదారు. స్థానిక బస్టాండ్‌లో పండ్లను ఆకుల్లో చుట్టి విక్రయిస్తోంది. పండ్లు కొనుకున్ని తిన్న తర్వాత కొందరు ఆకులను పారేస్తే, ఆమె ఆకులను ఏరుకుని చెత్తబుట్టలో వేయడం, అలాగే, ప్లాస్టిక్ వాడకుండా ఆకుల్లో పండ్లను విక్రయించడం, అక్కడ పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో ఆమె చేస్తున్న మంచి పనిని ప్రధాని మోడీ కొనియాడారు. ప్లాస్టిక్ వాడకుండా ప్రధాని మోడీ స్వచ్చ భారత్ విజన్‌కు సహకరించిన ఇలాంటి వ్యక్తుల ఉదాహరణలు ఇతరులకు చోదక శక్తిగా పనిచేస్తాయని సోమవారం కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ అన్నారు.
ఇదిలావుండగా, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ బాగల్‌కోట్‌లో ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ బాలికతో మాట్లాడేందుకు ప్రధాని కాసేపు తన ప్రసంగాన్ని ఆపేశారు. ఆ బాలిక తన చేతులతో వేసిన పెయింటింగ్‌తో ర్యాలీకి వచ్చింది. చిత్రంలో నరేంద్ర మోడీ, అతని తల్లి ఉన్నారు. ఫోటోలో మోడీ, తన తల్లి నుండి ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు కనిపించింది. సభలో ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని కళ్ళు ఆ అమ్మాయి, ఆమె చేతిలో ఉన్న ఫోటోపై పడ్డాయి. మండుతున్న ఎండలో ఆ అమ్మాయి ఉత్సాహంగా చిత్రాన్ని ప్రధానికి చూపించడానికి ప్రయత్నిస్తోంది. ఇది గమనించిన ప్రధాని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చెప్ప ఫొటోను తీసుకొమ్మన్నారు. అలాగే, అభినందిస్తూ అమ్మాయికి లేఖ రాస్తానని చెప్పడంతో ఎగిరి గంతేసింది. మోడీ మోడీ నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది.
బాగల్‌కోట్‌లో ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోడీ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలో మతపరమైన రిజర్వేషన్‌లను కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందనీ, అయితే దీనిని జరగనివ్వబోమని అన్నారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ వర్గాలు ఇప్పుడు బీజేపీ వెంట ఉన్నందున మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకే కాంగ్రెస్ ఈ ప్రతిపాదనలు చేస్తోందని అన్నారు.