Asianet News TeluguAsianet News Telugu

ఆర్యన్ ఖాన్ కేసులో మరో ట్విస్ట్.. ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఎన్‌సీబీ దర్యాప్తు

ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న క్రూజ్ షిప్‌ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఓ సాక్షి ప్రభాకర్ సాయిల్ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ దర్యాప్తు చేయడానికి ఎన్‌సీబీ నిర్ణయించింది. షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేయాలంటే రూ. 25 కోట్లు ఇవ్వాలని ఎన్‌సీబీ అధికారి డిమాండ్ చేశారని సాయిల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
 

ncb to conduct probe against sameer wankhede on bribe allegations
Author
New Delhi, First Published Oct 25, 2021, 2:03 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబయి: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ నిందితుడుగా ఉన్న డ్రగ్స్ కేసు మరో సంచలన మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆర్యన్ ఖాన్ ప్రయాణిస్తున్న క్రూజ్‌ షిప్‌లో డ్రగ్స్ లభించాయన్న పంచనామా పత్రంలో సాక్షిగా ఉన్న ఓ ప్రైవేటు డిటెక్టర్ కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సాయిల్ సంచలన ఆరోపణలు ఇప్పుడు కేసు ఫోకస్ అంతా సమీర్ వాంఖేడ్‌పైకి మారేలా చేశాయి. ఆర్యన్ ఖాన్ విడుదలకు రూ. 25 కోట్ల లంచం డిమాండ్ చేశారని ఆయన చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. ఈ ఆరోపణలను సమీర్ వాంఖడే కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆరోపణల తీవ్రత దృష్ట్యా ఎన్‌సీబీ సంస్థే సమీర్ వాంఖడేపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలని నిర్ణయించింది.

ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సమీర్ వాంఖడేపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై దర్యాప్తును తానే పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. మరి ముంబయి ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్‌గా సమీర్ వాంఖడే కొనసాగుతారా? అనే ప్రశ్నకూ సమాధానమిచ్చారు. దానిపై తాను ఇప్పుడే సమాధానం చెప్పలేనని, తాము ఇప్పుడే దర్యాప్తు ప్రారంభించామని వివరించారు. వాంఖడేపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సమగ్ర రిపోర్టును ముంబయి ఎన్‌సీబీ అధికారులు ఎన్‌సీబీ డైరెక్టర్ జనరల్‌కు సమర్పించారు. ఎన్‌సీబీలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్ సింగే కావడం గమనార్హం. ఆయనే ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.

ఢిల్లీలోని ఎన్‌సీబీ హెడ్‌క్వార్టర్స్‌లో జరగనున్న సమీక్ష సమావేశం కోసం మంగళవారం సమీర్ వాంఖడే ఢిల్లీ పయనించబోతున్నారు.

Also Read:Aryan Khan : ఆర్యన్ విడుదలకు రూ.25 కోట్లు లంచం.. కేసులో కొత్త ట్విస్ట్...

కాగా, సమీర్ వాంఖడేపై సంచలన ఆరోపణలు చేసిన సాక్షి ప్రభాకర్ సాయిల్ ఈ రోజు ఉదయం ముంబయి పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. సీనియర్ సెక్యూరిటీ అధికారులను కలిశారు. ఆయన భద్రతకు సంబంధించి ఆయన కమిషనర్ కార్యాలయానికి వెళ్లినట్టు తెలుస్తున్నది.

కాగా, ఎన్‌సీబీ విజిలెన్స్ దర్యాప్తుపై సమీర్ వాంఖడే స్పందించారు. ఈ దర్యాప్తునకు తాను సిద్ధంగా ఉన్నారని వివరించారు. తనను, తన కుటుంబాన్ని మరణించిన తన తల్లినీ కొందరు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. కొంతమంది తనను తప్పుడు కేసుల్లో ఇరికించాలని కుట్ర పన్నుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కుట్రల నుంచి తనకు రక్షణ కావాలని పేర్కొంటూ ఆదివారం ఆయన ముంబయి పోలీసు కమిషనర్‌ హేమంత్ నగ్రాలేకు లేఖ రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios